logo

మంటలంటుకునే పదార్థాలు అక్రమంగా నిల్వ చేస్తే చర్యలు

మంటలంటుకునే పదార్థాలను అక్రమంగా నిల్వ చేసేవారిపై చట్టపరంగా చర్యలు తప్పవని, అలాంటి సమాచారం 101కు అందించాలని అగ్నిమాపకశాఖ డీజీ వై.నాగిరెడ్డి సూచించారు.

Published : 15 Apr 2024 02:37 IST

అగ్నిమాపక శాఖ డీజీ వై.నాగిరెడ్డి

వట్టినాగులపల్లి శిక్షణ కేంద్రంలో స్తూపం వద్ద నివాళులర్పిస్తున్న అధికారులు

రాయదుర్గం, న్యూస్‌టుడే: మంటలంటుకునే పదార్థాలను అక్రమంగా నిల్వ చేసేవారిపై చట్టపరంగా చర్యలు తప్పవని, అలాంటి సమాచారం 101కు అందించాలని అగ్నిమాపకశాఖ డీజీ వై.నాగిరెడ్డి సూచించారు. నేషనల్‌ ఫైర్‌ సర్వీస్‌ డే (జాతీయ అగ్నిమాపక దినం)ను పురస్కరించుకుని ఆదివారం వట్టినాగులపల్లిలోని అగ్నిమాపక శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 1944లో ఏప్రిల్‌ 14న ముంబయి నౌకాశ్రయంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదాన్ని ఎదుర్కొంటూ 44 మంది సిబ్బంది, పలువురు పౌరులు ప్రాణాలు కోల్పోయారని, వారి త్యాగాలను స్మరిస్తూ అగ్నిమాపక దినాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. త్వరలో 39 అగ్నిమాపక శకటాలు, మరో 18 చిన్న శకటాలను సమకూర్చుకోనున్నట్లు వెల్లడించారు. 5 ఫైర్‌ఫైటింగ్‌ రోబోలు రానున్నాయన్నారు. వరద బాధితులను రక్షించేందుకు మానవరహిత రిమోట్‌ లైఫ్‌ బాయ్స్‌ను సమకూర్చుకోనున్నట్లు తెలిపారు. 35 అంతస్తుల నుంచి బాధితులను రక్షించే ల్యాడర్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 2022లో 7942 అగ్నిప్రమాదాలు జరగగా, 2023లో 8024 జరిగాయని చెప్పారు. 2022లో 46మంది, 2023లో 44మంది అగ్నిప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారన్నారు. గతేడాది రూ.1072 కోట్లు, 2022లో రూ.723 కోట్ల ఆస్తులు రక్షించామని తెలిపారు. షార్ట్‌సర్క్యూట్‌ నివారణ సాధనాలు ఇళ్లలో అమర్చుకోవాలని సూచించారు. శాఖ డైరెక్టర్‌ లక్ష్మీప్రసాద్‌, అదనపు డైరెక్టర్‌ జీవీ నారాయణరావు, ఆర్‌ఎఫ్‌ఓ హరినాథరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్‌ సుధాకర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని