logo

మచ్చలు నయం చేస్తామంటూ కుచ్చుటోపీ

కాలికి ఉన్న నల్ల మచ్చలను నయం చేస్తామంటూ మోసం చేసిన ఘటన ఎస్సార్‌నగర్‌ ఠాణా పరిధిలో జరిగింది. ఎస్‌ఐ అఖిల కథనం ప్రకారం..

Published : 15 Apr 2024 02:49 IST

అమీర్‌పేట, న్యూస్‌టుడే: కాలికి ఉన్న నల్ల మచ్చలను నయం చేస్తామంటూ మోసం చేసిన ఘటన ఎస్సార్‌నగర్‌ ఠాణా పరిధిలో జరిగింది. ఎస్‌ఐ అఖిల కథనం ప్రకారం.. బల్కంపేటకు చెందిన నీలేష్‌ చంద్‌ మాధుర్‌ (61) ఫిబ్రవరి 2న బల్కంపేట సాయిబాబ ఆలయం వద్ద ఉండగా ఓ వ్యక్తి బైక్‌పై వచ్చాడు. అతడి కాళ్లకు ఉన్న నల్ల మచ్చలను గమనించిన అగంతకుడు మాట కలిపాడు. తన తల్లికి ఇలాగే మచ్చలు ఉంటే ఆయుర్వేద ఔషధం వాడటంతో తగ్గిందని నమ్మించాడు. మందు కోసం పటాన్‌చెరులో ఉండే డా.రాజేష్‌ను సంప్రదించాలని ఓ ఫోన్‌ నంబరు ఇచ్చాడు. మరుసటి రోజుల అతడ్ని సంప్రదించడంతో రాజేష్‌ బాధితుడి ఇంటికే వచ్చాడు. తొలుత వేడి నీళ్లు, కొబ్బరి నూనె నల్లమచ్చలపై రాసి సూది గుచ్చి ఇత్తడి పైపుతో రక్తాన్ని పీల్చాడు. అదంతా చెడు రక్తమని, దీన్ని పీల్చాలంటే చుక్కకు రూ.వెయ్యి చొప్పున చెల్లించాల్సి ఉంటందని, మొత్తం రూ.40 వేలు వసూలు చేశాడు. అనంతరం గ్రీజు ను పోలిన మందును బాధితుడికి అందించి నువ్వుల నూనెలో కలిపి రాస్తే నయమవుతుందని చెప్పాడు. 30 గ్రాముల నూనె చింతల్‌ చంద్రానగర్‌లోని శ్రీనాథ్‌ ఆయుర్వేదిక్‌ భండార్‌లో కొనుగోలు చేయాలని సూచించాడు.

నువ్వుల నూనె పేరిట టోకరా.. బాధితుడు రూ.5 వేలు చెల్లించి 10 గ్రాముల నూనె కొనుగోలు చేశాడు. మరుసటి రోజు డా.రాజేష్‌ అనుచరుడు ఫోన్‌ చేసి 30 గ్రాములు ఎందుకు కొనలేదని ప్రశ్నించాడు. తాను 10 గ్రాములే కొనుగోలు చేసిన విషయం ఎలా తెలిసిందని బాధితుడికి అనుమానం వచ్చి నిలదీయగా ఫోన్‌ పెట్టేశాడు. మందులు వాడినా మచ్చలు నయం కాకపోవడం.. వారికి ఫోన్‌ చేయగా స్పందన లేకపోవడంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని