logo

తాగేది.. శుద్ధ జలమేనా?

అసలే వేసవి కాలం..ఆపై జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గడంతో నగరంలో నల్లా నీరు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో చాలామంది నీటి శుద్ధి కేంద్రాలపై ఆధారపడుతున్నారు.

Published : 15 Apr 2024 02:57 IST

నిబంధనలకు విరుద్ధంగా  నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు

సికింద్రాబాద్‌ క్లాక్‌టవర్‌ వద్ద చిరువ్యాపారులకు సరఫరా

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: అసలే వేసవి కాలం..ఆపై జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గడంతో నగరంలో నల్లా నీరు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో చాలామంది నీటి శుద్ధి కేంద్రాలపై ఆధారపడుతున్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని ప్లాంట్ల నిర్వాహకులు.. నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు. ట్రేడ్‌ లైసెన్స్‌, బీఐఎస్‌, ఆహార కల్తీ నిరోధక శాఖ అనుమతులు లేకుండానే వ్యాపారం చేస్తున్నారు. అపరిశుభ్ర వాతావరణంలో శుద్ధి చేస్తున్న నీటిని సురక్షితమని భావించి వినియోగిస్తూ.. ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. భాగ్యనగరంలో ఏటా వేసవిలో వాటర్‌ ప్లాంట్ల కేంద్రంగా రూ.కోట్ల వ్యాపారం జరుగుతుంది. నగర వ్యాప్తంగా వేల సంఖ్యలో నీటి శుద్ధి కేంద్రాలు ఉన్నా.. నిర్వహణను పట్టించుకునేవారు కరవయ్యారు.

తోడేస్తున్నారు..

నగరంలో చాలావరకు వాటర్‌ ప్లాంట్ల నిర్వాహకులు బోరు నీటినే ఉపయోగిస్తున్నారు. కొందరు ఇంటి అవసరాలకు తీసుకున్న బోరుని వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలంటే సుమారు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కానీ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, నీటి శుద్ధికి అవసరమైన యంత్రాలు కొనుగోలు చేయకుండా రూ.2 నుంచి రూ.5 లక్షలతో ప్లాంట్‌ ప్రారంభిస్తున్నారు. అనధికారికంగా చిన్న చిన్న గదుల్లో ప్లాంట్లను ఏర్పాటు చేసి, రూ.లక్షలు దండుకుంటున్నారు.    

నిబంధనలు ఇలా..

నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటుకు మున్సిపాలిటీ అధికారుల నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాలి. ఈ ఎన్‌వోసీ ఆధారంగా ప్లాంట్‌ ఏర్పాటుకు విద్యుత్తు శాఖ నుంచి కనెక్షన్‌ పొందాలి.

  • బీఎస్‌ఐ ధ్రువ పత్రం, ట్రేడ్‌, ఫుడ్‌ లైసెన్స్‌లు తప్పనిసరి.
  • నీటి నాణ్యత ప్రమాణాల పరీక్షకు ల్యాబ్‌, పరికరాలు, రసాయనాలు ఉండాలి. బీఎస్‌ఐ నిబంధనల ప్రకారం మైక్రో బయాలజిస్ట్‌, కెమిస్టులను నియమించుకోవాలి.
  • నీటిని 12 సార్లు శుద్ధి ప్రక్రియ చేయాల్సి ఉంటుంది. అనంతరం నీటిని డబ్బాల్లో నింపే ముందు 48 గంటలపాటు నిల్వ ఉంచాలి. అనంతరం కెమిస్ట్‌ పరీక్షలు జరపాలి. ఇందుకోసం మైక్రో బయలాజికల్‌ ల్యాబ్‌ ఉండాలి.

తరలింపులోనూ నిర్లక్ష్యం..

ప్లాంట్‌ నుంచి వినియోగదారుల వద్దకు నీటిని తరలించే క్రమంలో జాగ్రత్తలు పాటించడం లేదు. 40 డిగ్రీలు దాటిన ఎండలో ప్లాస్టిక్‌ డబ్బాల్లో తరలిస్తున్నారు. వాటిపై ఎండ పడకుండా చర్యలు తీసుకోవడంలేదు. నీటి శుద్ధికి చాలా సమయం పడుతుంది. డిమాండ్‌ రీత్యా తూతూ మంత్రంగా శుద్ధిచేసి విక్రయిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో రోజులతరబడి క్యాన్లను శుభ్రం చేయడంలేదు. ప్లాస్టిక్‌ డబ్బాలను కాలపరిమితికి మించి వాడటం నిషిద్ధమని తెలిసినా.. పట్టించుకోవడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని