logo

చెవులకు చిల్లు.. గుండె ఝల్లు

నగరంలో శబ్ద కాలుష్యం రోజురోజుకు తీవ్రమవుతోంది. వాహనాల హారన్లు, చెవులు చిల్లులు పడేలా సైలెన్సర్లు, నివాసాల మధ్య డీజే హోరుతో గూబ గుయ్‌మంటోంది.

Updated : 15 Apr 2024 04:53 IST

జూబ్లీహిల్స్‌లో అత్యధిక శబ్ద కాలుష్యం
65 డెసిబుల్స్‌ దాటిన తీవ్రత

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో శబ్ద కాలుష్యం రోజురోజుకు తీవ్రమవుతోంది. వాహనాల హారన్లు, చెవులు చిల్లులు పడేలా సైలెన్సర్లు, నివాసాల మధ్య డీజే హోరుతో గూబ గుయ్‌మంటోంది. ప్రధానంగా జూబ్లీహిల్స్‌ నివాసిత ప్రాంతాల్లో పరిమితికి మించి నమోదవుతోంది. శబ్ద తీవ్రత 70 డెసిబుల్స్‌ దాటితే చెవుడు కూడా వచ్చే ప్రమాదం ఉండగా ఇక్కడ అత్యధికంగా 78.52, 76.25 డెసిబుల్స్‌గా నమోదైందని ఇటీవల పీసీబీ విడుదల చేసిన నివేదిక స్పష్టం చేస్తోంది. నిర్దేశిత పరిమితుల ప్రకారం నివాసిత ప్రాంతాల్లో ఉదయం 55, రాత్రి వేళ 45 డెసిబుల్స్‌ ఉండాలి. సికింద్రాబాద్‌, తార్నాకతో పాటు సున్నిత ప్రాంతాలుగా గుర్తించిన జూ పార్కు, హెచ్‌సీయూ వద్ద పరిమితికి మించి శబ్ద కాలుష్యం నమోదవుతోంది. కంటోన్మెంట్‌ ప్రాంతంలో శబ్దతీవ్రత పెరుగుతోందని అక్కడి స్థానికులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఉల్లంఘనలతో ఉక్కిరి బిక్కిరి.. నిబంధనల ప్రకారం రాత్రి 10గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎలాంటి సౌండ్‌ సిస్టమ్స్‌ ఉపయోగించకూడదు. జూబ్లీహిల్స్‌లాంటి ప్రాంతాల్లో డీజే హోరు మొదలయ్యేది అప్పుడే. దీనికి తోడు అధునాతన పరికరాలు అమర్చిన ద్విచక్ర వాహనాలు, కార్లు రయ్‌రయ్‌మంటూ తిరుగుతుంటాయి. కొందరు ఇదే సమయంలో రేసింగ్‌లతో పాటు విన్యాసాలు చేస్తున్నారు. హద్దుమీరితే..చప్పుడు హద్దు మీరితే గుండె కొట్టుకునే వేగం, రక్తపీడనం పెరుగుతుంది. 70 డెసిబుల్స్‌ దాటితే చెవుడు రావొచ్చు. నిద్రలేమి, తలనొప్పి, అలసటకు ఆస్కారం ఉంది. మానసికంగా, శారీరకంగా కుంగదీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

కారణాలివే.. నగరంలో శబ్ద కాలుష్యానికి రవాణా వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణరంగ కార్యకలాపాలు, జనరేటర్ల వినియోగం, బాణసంచా కాల్చడం, లౌడ్‌ స్పీకర్లు, డీజే హోరు తదితరాలు ప్రధాన కారణాలు.

  • భారీ ట్రక్కులు, వాహనాల డ్రైవర్లు నిరంతరాయంగా హారన్ల మోత మోగిస్తుండటం.
  • వాహనాల సంఖ్య 77లక్షలకు చేరుకోగా అందులో 15 ఏళ్లు దాటిన వాహనాలను గుర్తించకపోవడం.
  • యువత ప్రత్యేక అధిక శబ్దాలు వెలువడే హారన్లను వినియోగిస్తుండటం.
  • గ్రేటర్‌లో 100కు పైగా కూడళ్లు ఉండగా అధిక సమయం వాహనాలు నిలపాల్సి వస్తోంది. ఇక్కడ హారన్ల మోత మోగుతోంది.
  • నివాస ప్రాంతాలకు ఆనుకొని ఫంక్షన్‌ హాళ్లు, క్లబ్బులు, పబ్బులు ఏర్పాటుచేస్తుండటం.
  • రాజధాని పరిధిలో సుమారు 1000 ప్రభుత్వ, ప్రైవేలు ఆసుపత్రులు ప్రధాన రహదారులు, ముఖ్య కాలనీల్లోనే ఉన్నాయి. రోగులు అధిక ధ్వనులతో ఆందోళనకు గురవుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని