logo

హెచ్‌టీ, ఎల్‌టీ పోటీ

గ్రేటర్‌లో ప్రతినెలా దాదాపుగా రూ.1500కోట్ల వరకు విద్యుత్తు బిల్లింగ్‌ జరుగుతోంది. ఇందులో హెచ్‌టీ వినియోగదారుల వాటానే అధికంగా ఉంటుంది. వేసవి దెబ్బతో ఎల్‌టీ బిల్లింగ్‌ అమాంతం పెరిగింది.

Updated : 15 Apr 2024 04:41 IST

వేసవిలో ఇళ్లలో పెరిగిన విద్యుత్తు డిమాండ్‌

బాచుపల్లిలో విద్యుత్తు సరఫరాపై స్థానికులతో మాట్లాడుతున్న ఉన్నతాధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌లో ప్రతినెలా దాదాపుగా రూ.1500కోట్ల వరకు విద్యుత్తు బిల్లింగ్‌ జరుగుతోంది. ఇందులో హెచ్‌టీ వినియోగదారుల వాటానే అధికంగా ఉంటుంది. వేసవి దెబ్బతో ఎల్‌టీ బిల్లింగ్‌ అమాంతం పెరిగింది. ఎండలతో ఇళ్లలో ఏసీల వినియోగం గణనీయంగా పెరగడమే దీనికి కారణమని ఇంజినీర్లు అంటున్నారు. నగరంలో తొమ్మిది విద్యుత్తు సర్కిళ్లు ఉన్నాయి. ఎల్‌టీ (లో టెన్షన్‌), హెచ్‌టీ (హై టెన్షన్‌) కలిపి సుమారు 60 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. ఎల్‌టీ కనెక్షన్లు లక్షల్లో ఉంటే.. హెచ్‌టీ వినియోగదారుల సంఖ్య వేలల్లోనే ఉంటుంది. పరిశ్రమలు, బడా వాణిజ్య కేంద్రాలే హెచ్‌టీ కనెక్షన్‌ తీసుకుంటాయి. అధిక కరెంట్‌ వాడకం, అధిక టారిఫ్‌తో ఎల్‌టీ డిమాండ్‌ అధికంగా ఉంటుంది. రంగారెడ్డి జోన్‌ పరిధిలో ఏప్రిల్‌లో రూ.775 కోట్ల బిల్లుల్లో హెచ్‌టీనే రూ.460 కోట్లు ఉంది.

సర్కిళ్లలో చూస్తే.. హెచ్‌టీ కనెక్షన్లు వేలల్లోనే ఉన్నా వీటి విద్యుత్తు వాడకం, టారిఫ్‌ అధికం కాబట్టి బిల్లులు అధికంగానే విద్యుత్తు సంస్థకు చేరుతాయి. సైబర్‌సిటీ సర్కిల్‌లో ఐటీ కార్యాలయాలు అధికంగా ఉన్నాయి. వీరందరూ హెచ్‌టీ వినియోగదారులే. ఏప్రిల్‌లో వీరి బిల్లింగ్‌ చూస్తే దాదాపు రూ.165 కోట్ల వరకు ఉంది. ఎల్‌టీ బిల్లింగ్‌ కూడా రూ.131 కోట్లపైనే నమోదైంది. మార్చి నుంచి ఏప్రిల్‌కు వచ్చేసరికి ఏకంగా రూ.30కోట్ల బిల్లింగ్‌ ఈ ఒక్క సర్కిల్‌లోనే పెరిగింది. హైదరాబాద్‌ సౌత్‌లోనూ రూ.100కోట్ల ఎల్‌టీ బిల్లింగ్‌ ఉంటుంది.

మూడు సర్కిళ్లలో.. గృహ బిల్లింగ్‌లో వేసవిలో ప్రతినెలా రూ.100 కోట్ల బిల్లింగ్‌ అవుతున్న సర్కిళ్లు మూడు ఉన్నాయి. అత్యధికంగా సైబర్‌సిటీ సర్కిల్‌లో రూ.131 కోట్ల కాగా.. బంజారాహిల్స్‌ సర్కిల్‌ నుంచి రూ.100కోట్ల దాకా బిల్లింగ్‌ జరిగింది. హైదరాబాద్‌ సెంట్రల్‌ సర్కిల్‌లోనూ రూ.102 కోట్లపైనే బిల్లింగ్‌ అయ్యింది. సరూర్‌నగర్‌లో ఎల్‌టీ బిల్లింగే అధికం. ఇక్కడ రూ.125కోట్ల బిల్లింగ్‌లో రూ.88 కోట్ల దాకా ఎల్‌టీనే కావడం గమనార్హం.

అక్కడ హెచ్‌టీనే.. రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో హెచ్‌టీ బిల్లింగ్‌ అధికంగా ఉంటుంది. ఇక్కడ కాటేదాన్‌, కొత్తూరు ప్రాంతాల్లో పరిశ్రమలతో కరెంట్‌ వాడకం అధికంగా ఉంది. హబ్సిగూడ, మేడ్చల్‌ సర్కిల్‌లోనూ ఎక్కువే ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని