logo

పావులు కదుపుతూ.. జనంలోకి వెళ్తూ

లోక్‌సభ ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. పోలింగ్‌కు మరో 29 రోజులే ఉండటంతో మూడు ప్రధాన పార్టీలు ఇప్పటికే గ్రేటర్‌లో ఎన్నికల శంఖారావం పూరించాయి. రాష్ట్రవ్యాప్త ప్రచారాన్ని ఇక్కడి నుంచే మొదలెట్టాయి.

Updated : 15 Apr 2024 04:13 IST

ఒక్కో పార్టీ ఒక్కో వ్యూహంతో ఎన్నికల ప్రచారం

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. పోలింగ్‌కు మరో 29 రోజులే ఉండటంతో మూడు ప్రధాన పార్టీలు ఇప్పటికే గ్రేటర్‌లో ఎన్నికల శంఖారావం పూరించాయి. రాష్ట్రవ్యాప్త ప్రచారాన్ని ఇక్కడి నుంచే మొదలెట్టాయి. ఈ నెల మొదటివారంలో చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని తుక్కుగూడలో అధికార కాంగ్రెస్‌ జనజాతర సభతో ప్రచారానికి శ్రీకారం చుట్టింది. అగ్రనేత రాహుల్‌గాంధీ ఎన్నికల నగారా మోగించారు. రెండ్రోజుల కిందట భారాస చేవెళ్ల నియోజకవర్గంలోనే తొలి ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించి పోటీకి సై అంది. బలమైన విపక్షం ఉండాలంటే అన్ని సీట్లు భారాసనే గెలవాలని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. భాజపా ఎన్నికల షెడ్యూల్‌ కంటే ముందే అగ్రనేతల సభలను నిర్వహించింది. ఎల్బీస్టేడియంలో అమిత్‌షా పాల్గొని ఎన్నికల వేడిని రాజేశారు. ఇప్పుడిక నగర ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఒక్కో పార్టీ ఒక్కో వ్యూహంతో ముందుకెళ్లాలని నిర్ణయించాయి.


చేరికలతో సత్తా చాటేలా..

నగరంలో బలం పెంచుకునేందుకు అధికార కాంగ్రెస్‌ చేరికలపై దృష్టిపెట్టింది. ఇప్పటికే భారాస నుంచి పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్‌లో చేరగా.. కార్పొరేటర్లు, శివారు మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఇతర పార్టీ నేతలను చేర్చుకోవడంపైనే దృష్టిపెట్టింది. డివిజన్ల వారీగా పాత, కొత్త నేతలతో కలిపి కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. సీఎం స్వయంగా పర్యవేక్షిస్తుండటంతో క్యాడర్‌లోనూ జోష్‌ కనిపిస్తోంది.


ఎమ్మెల్యేల బలంతో...

నగరంలో హైదరాబాద్‌ మినహా మిగతా మూడు లోక్‌సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కువ మంది భారాస ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదరించిన మాదిరే పార్లమెంట్‌ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ కోరుతోంది. మాజీ మంత్రులు గెలుపు బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నారు. కొందరు పార్టీని వీడుతున్నా.. ఆ ప్రభావం పడకుండా జాగ్రత్త పడుతోంది. కొత్త నాయకులకు బాధ్యతలు అప్పగించి బలోపేతం చేసే పనిలో పడింది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ చేవెళ్లలో నిర్వహించిన సభతో కార్యకర్తల్లో హుషారు వచ్చింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొని క్యాడర్‌కు దిశనిర్దేశం చేస్తున్నారు.


మోదీ చరిష్మాతో..

నాలుగు స్థానాల్లోనూ గెలవాలనే పట్టుదలతో ఉన్న భాజపా ప్రత్యర్థి పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించింది. అప్పటి నుంచే వారు ఎన్నికల క్షేత్రంలో దిగారు.  ఇంటింటి ప్రచారంతో ఓటర్లను కలుసుకునే వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. ఐవీఆర్‌ఎస్‌ ఫోన్ల ద్వారా ఓటర్ల మద్దతు కోరుతున్నారు. అపార్ట్‌మెంట్లలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మోదీ చరిష్మా , అయోధ్య రామమందిర నిర్మాణ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అగ్రనేతల ర్యాలీలతో ప్రచారాన్ని ముమ్మరం  చేయనున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని