logo

పొగచూరుతున్న ఉజ్వల

ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్ల జారీ కోసం అర్హులు ఎదురుచూస్తున్నారు. రాజధాని పరిధిలో రెండేళ్లుగా ఈ పథకం కింద కొత్త కనెక్షన్లు ఇచ్చిన దాఖలాలు లేవు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారిలో చాలామంది ఇప్పటికీ కట్టెల పొయ్యి మీదే వంట చేసుకుంటున్నారు.

Published : 16 Apr 2024 05:53 IST

రెండేళ్లుగా కొత్త కనెక్షన్ల ఊసే లేదు
నిరుపేదలకు కట్టెల పొయ్యిలే దిక్కు  
ఈనాడు, హైదరాబాద్‌

జ్వల గ్యాస్‌ కనెక్షన్ల జారీ కోసం అర్హులు ఎదురుచూస్తున్నారు. రాజధాని పరిధిలో రెండేళ్లుగా ఈ పథకం కింద కొత్త కనెక్షన్లు ఇచ్చిన దాఖలాలు లేవు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారిలో చాలామంది ఇప్పటికీ కట్టెల పొయ్యి మీదే వంట చేసుకుంటున్నారు.  రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోని కొన్ని మురికివాడల్లో ఈ పరిస్థితి ఉంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదల్లో అంత్యోదయ అన్నయోజన కార్డుదారులకు ఈ పథకం వర్తిస్తుంది. మహిళల పేరు మీద కనెక్షన్‌ జారీ చేస్తారు. మూడు జిల్లాల్లో మొత్తం లక్ష మంది కార్డుదారులు ఉండగా కనెక్షన్ల సంఖ్య 30వేలు కూడా దాటకపోవడం గమనార్హం. కొత్తగా దరఖాస్తు చేసుకున్నా ఆయిల్‌ కంపెనీల డిస్ట్రిబ్యూటర్లు కొర్రీలు పెట్టి తిరస్కరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి అర్హులను గుర్తించాలని పేదలు కోరుతున్నారు.

కనెక్షన్‌ ఉచితంగానే..

సాధారణంగా ఎల్పీజీ కనెక్షన్‌ పొందాలంటే డిపాజిట్‌, కనెక్షన్‌ ఛార్జీలు, గ్యాస్‌ ఫిల్లింగ్‌, రెగ్యులేటర్‌, స్టవ్‌తో కలిపి సుమారు రూ.4-5 వేల వరకు ఖర్చవుతుంది.   నిరుపేదలు అంతపెట్టి తీసుకునే సాహసం చేయడం లేదు. ఈ నేపథ్యంలో వీరికి పొగబాధ లేకుండా ఉండేందుకు ఉచిత గ్యాస్‌ కనెక్షన్‌ ఇవ్వాలని కేంద్ర సర్కారు సంకల్పించింది. ఇందులో భాగంగా గ్యాస్‌ కనెక్షన్‌, సిలిండర్‌, స్టవ్‌ను నిరుపేద మహిళలకు అందిస్తున్నారు. 2016లో ఈ పథకం అమల్లోకి వచ్చింది.  దేశవ్యాప్తంగా కోట్లాది మంది పేదలకు ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రానికి ఎన్ని కనెక్షన్లు కేటాయించారు? లబ్ధిదారుల ఎంపిక వంటి అంశాలపై అవగాహన కల్పించడం లేదు.

నిబంధనలు ఇలా:   18 ఏళ్లు దాటిన మహిళలు దరఖాస్తుకు అర్హులు. వలస కూలీలు ఫ్యామిలీ డిక్లరేషన్‌, చిరునామా ధ్రువీకరణ ఇస్తే చాలు. వారి కుటుంబానికి చెందిన ఎవరి పేరుమీద ఎల్‌పీజీ కనెక్షన్‌ ఉండకూడదు.


దరఖాస్తు విధానం ఇలా..

ఈ పథకానికి ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయొచ్చు. దగ్గర్లో ఉన్న ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూషన్‌ ఏజెన్సీకి వెళ్లి దరఖాస్తు ఇవ్వాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలంటే https://pmujjwalayojana.com వెబ్‌సైట్‌లో అప్లికేషన్‌ ఫామ్‌ నింపి సబ్మిట్‌ చేయాలి. ఆ ప్రింట్‌ తీసుకుని సమీప ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూషన్‌ ఏజెన్సీలో అందించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని