logo

ఏటీఎంలో రూ.19 లక్షల చోరీ

శంషాబాద్‌లో దుండగులు ఏటీఎంను ధ్వంసం చేసి రూ.19 లక్షలు ఎత్తుకెళ్లారు. శంషాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌రెడ్డి వివరాల ప్రకారం..

Published : 16 Apr 2024 05:56 IST

గ్యాస్‌ కట్టర్‌తో దొంగలు ధ్వంసం చేసిన ఏటీఎం

శంషాబాద్‌, న్యూస్‌టుడే: శంషాబాద్‌లో దుండగులు ఏటీఎంను ధ్వంసం చేసి రూ.19 లక్షలు ఎత్తుకెళ్లారు. శంషాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌రెడ్డి వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఎస్బీఐ ఏటీఎంలోకి బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు వెళ్లారు. అక్కడ వాహనాల రద్దీ ఉండడంతో పాలమాకుల బస్టాప్‌ వద్ద మరో ఎస్బీఐ ఏటీఎం కేంద్రంలోకి గ్యాస్‌ కట్టర్‌తో చొరబడ్డారు. గంటపాటు శ్రమించి ఏటీఎంను ధ్వంసం చేశారు. అందులోని సుమారు రూ.18.99 లక్షలను అపహరించారు. ఇవేవీ రికార్డు కాకుండా ముందుగా సీసీ కెమెరాలకు తెల్లని రంగుపూసి అలారం వైర్లను కట్‌ చేశారు. క్లూస్‌ టీం, క్రైం పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ ఏటీఎం నిర్వహణ, భద్రత పకడ్బందీగా లేవు. ఇందులోకి వెళ్లిన దుండగులు కారులో వచ్చినట్లు సీసీ ఫుటేజీల్లో నమోదైంది. ఏటీఎం కేంద్రంలో భారీ నగదు చోరీ చేయడం సైబరాబాద్‌ పరిధిలో ఇదే తొలిసారని పోలీసులు తెలిపారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. రెండు ఏటీఎం కేంద్రాల్లో చొరబడింది ఒక ముఠా పనేనా? లేకుంటే రెండు సంఘటనల్లో వేర్వేరు ముఠాల పనా అనేది విచారణలో తెలుస్తుందని, దుండగులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని