logo

షార్ట్‌సర్క్యూట్‌తో ట్రావెల్స్‌ బస్సు దగ్ధం

షార్ట్‌సర్క్యూట్‌ వల్ల ట్రావెల్స్‌ బస్సు దగ్ధమైంది. పేట్‌బషీరాబాద్‌ సీఐ కె.విజయవర్ధన్‌ వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కాంకేర్‌ ట్రావెల్స్‌ బస్సు ఆదివారం ఉదయం 5 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి సోమవారం ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్‌కు చేరింది.

Published : 16 Apr 2024 05:59 IST

పేట్‌బషీరాబాద్‌, న్యూస్‌టుడే: షార్ట్‌సర్క్యూట్‌ వల్ల ట్రావెల్స్‌ బస్సు దగ్ధమైంది. పేట్‌బషీరాబాద్‌ సీఐ కె.విజయవర్ధన్‌ వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కాంకేర్‌ ట్రావెల్స్‌ బస్సు ఆదివారం ఉదయం 5 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి సోమవారం ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్‌కు చేరింది. సాయంత్రం 6.45 గంటలకు తిరిగి బయలుదేరింది. సుమారు 30 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు. కొంపల్లికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండగా బస్సులో ఒకరు సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతుండగా దట్టమైన పొగలు వెలువడ్డాయి. బస్సులో ప్రయాణిస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి హరీష్‌ విషయాన్ని డ్రైవర్‌ రషీద్‌కు చెప్పాడు. తాను మెయిన్‌ స్విచ్‌ బంద్‌ చేశానని తెలిపాడు. కొంపల్లిలోని బొల్లారం కూడలికి వచ్చేసరికి దట్టమైన పొగలు వ్యాపించాయి. హరీష్‌ వెంటనే బస్సులోని తోటి ప్రయాణికులను కిందికి దించారు. చాలామంది సామగ్రి కాలి బూడిదైంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని అభినిత ల్యాప్‌టాప్‌ బుగ్గిపాలైంది. స్థానికులు విషయాన్ని పేట్‌బషీరాబాద్‌ పోలీసులకు చేరవేశారు. జీడిమెట్ల అగ్నిమాపక సిబ్బంది, జీహెచ్‌ఎంసీ రెస్పాన్స్‌ ఫోర్స్‌ మంటలను అదుపులోకి తెచ్చాయి. మేడ్చల్‌ ట్రాఫిక్‌ ఏసీపీ వెంకట్‌రెడ్డి, అల్వాల్‌ ట్రాఫిక్‌ సీఐ నాగేశ్వరరావు, పేట్‌బషీరాబాద్‌ సీఐ కె.విజయవర్ధన్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కిలోమీటర్‌ వరకు వాహనాలు నిలిచిపోయాయి. లా అండ్‌ ఆర్డర్‌, ట్రాఫిక్‌ పోలీసు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. పోలీసులు ప్రైవేట్‌ నీటి ట్యాంకర్లు తెప్పించి మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. బస్సు పత్రాలు పరిశీలించగా అనుమతి లేనట్లు గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని