logo

మంటల కాలం.. ముందు చూపుంటేనే పైలం

తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాలు నగరవాసుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అటు పరిశ్రమలు, ఇటు వాణిజ్య కాంప్లెక్స్‌లు, అపార్ట్‌మెంట్‌ల్లో సంభవించిన ఘటనలు ప్రతి చోటా నిప్పు ముప్పు పొంచి ఉందన్న సంగతిని గుర్తు చేస్తున్నాయి.

Published : 16 Apr 2024 06:04 IST

అప్రమత్తతతోనే అగ్నిప్రమాదాలు దూరం

ఈనాడు, హైదరాబాద్‌: తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాలు నగరవాసుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అటు పరిశ్రమలు, ఇటు వాణిజ్య కాంప్లెక్స్‌లు, అపార్ట్‌మెంట్‌ల్లో సంభవించిన ఘటనలు ప్రతి చోటా నిప్పు ముప్పు పొంచి ఉందన్న సంగతిని గుర్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, ఆసుపత్రులు వంటి జనసంచారం ఉండే ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగితే తప్పించుకునే మార్గాలున్నాయా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మార్చి నెలాఖరు నుంచే వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతుండగా.. ‘మే’ నెల వరకు ‘అగ్నిగండం’ పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ఇళ్లు, ఆసుపత్రులు, పరిశ్రమలు, గోదాముల్లో ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని.. ప్రమాదాలు జరిగితే తక్షణమే తప్పించుకునేలా వ్యూహాలపై అవగాహన ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


ప్రమాదాల లెక్కలివీ..

జనవరి నుంచి ఏప్రిల్‌ 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,104 ఫైర్‌కాల్స్‌ నమోదయ్యాయి. స్వల్ప ప్రమాదాల విభాగంలో 2,860, మధ్యస్థంగా 62, తీవ్రతర ప్రమాదాలు 9, రెస్క్యూ కాల్స్‌ 127, ఎమర్జెన్సీ కాల్స్‌ 15 ఉన్నాయని కమాండ్‌ కంట్రోల్‌ సిబ్బంది తెలిపారు. ఇందులో 40-50శాతం ప్రమాదాలు రాజధాని పరిధిలోవే. ఇటీవల జరిగిన ఫిల్మ్‌ఛాంబర్‌లో అగ్నిప్రమాదంతో మొదలుకొని కాటేదాన్‌లోని ఓ బిస్కెట్‌ ఫ్యాక్టరీ, మల్కాజిగిరి పరిధిలోని ఓ ఆయిల్‌గోదాం, చార్మినార్‌ యునానీ ఆసుపత్రి సమీపంలో, గండిపేటలోని ఓ కార్ల గోదాముల్లో మంటల ఘటనలు సంభవించాయి. నివాస ప్రాంతాల్లో ఘటనల వేళ అగ్నిమాపకశాఖ వెనువెంటనే అక్కడికి చేరుకొని మంటలార్పేస్తోంది. వర్షాలతో వాతావరణం చల్లబడే వరకు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండటంతో పాటు ఎవాక్యుయేషన్‌ ప్లాన్‌పై దృష్టి సారించాలని అధికారులు సూచిస్తున్నారు.


ఎంఎస్‌డీఎస్‌ షీట్‌లో సూచనలు పాటించాలి...

పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలకు ప్రధాన కారణం నిషేధిత ప్రదేశాల్లో సిగరెట్లు తాగడం, విద్యుత్‌ ఉపకరణాల్లో స్పార్క్‌లను పట్టించుకోకపోవడమే. షార్ట్‌సర్క్యూట్‌, ఓవర్‌లోడ్‌, వదులుగా వైరింగ్‌, మండే స్వభావమున్న పదార్థాలు లీక్‌ అవడం, వెల్డింగ్‌, కటింగ్‌, సోల్డరింగ్‌, పరిశ్రమల యంత్రాల నిర్వహణలో లోపాలు ఇతర కారణాలు. ప్రమాదాలు జరిగిన వెంటనే ‘ఎంఎస్‌డీఎస్‌’ షీట్‌లో పేర్కొన్న సూచనలు పాటించాలి.


మంటల్లో చిక్కుకుంటే....

అగ్నిప్రమాదం సంభవిస్తే ఫైర్‌ అలారం మోగించాలి. లిఫ్ట్‌ వాడకుండా మెట్లమార్గం ఎంచుకుని సురక్షిత ప్రదేశం చేరుకోవాలి. ఫైర్‌ అలారం వింటే గాబరా పడకుండా ఎవాక్యుయేషన్‌ ప్లాన్‌ను అనుసరించాలి. విలువైన వస్తువుల గురించి చూడకుండా మొదటగా ప్రాణాలను కాపాడుకోవాలి. పొగలో చిక్కుకుపోతే మెల్లగా శ్వాస పీలుస్తూ.. నేలపై పాకుతూ అక్కడి నుంచి బయటపడాలి. ముఖానికి తడి రుమాలు లేదా టవల్‌ను చుట్టుకోవాలని అగ్నిమాపకశాఖ అధికారులు సూచిస్తున్నారు.


ఎవాక్యుయేషన్‌ ప్లాన్‌ ఉందా...?

ఆసుపత్రులు, షాపింగ్‌మాల్‌లు, మల్ల్టీప్లెక్స్‌ల్లో అంతస్తులను ఫైర్‌ కంపార్ట్‌మెంట్లుగా విభజించి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చెత్త పోగవకుండా ఆసుపత్రుల్లో వాడే గ్యాస్‌ నిల్వలో జాగ్రత్తలు పాటించాలి. ర్యాంపులు, మెట్లకు అడ్డంగా సామగ్రి ఉంచొద్దు. అత్యవసర ద్వారాలు, ఫైర్‌ డోర్లకు తాళాలు వేయకూడదు. అగ్నిమాపక పరికరాలున్న స్థలాలు, బయటకు వెళ్లే మార్గాలు, మెట్లను చూపుతున్న ఎవాక్యుయేషన్‌ ప్లాన్‌ను ప్రతి అంతస్తులో అందరికీ కనిపించేలా అతికించాలి. ఐదేళ్లకోసారి వైరింగ్‌, ఎంసీబీలు, ఇతర ఎలక్ట్రిక్‌ పరికరాలు లైసెన్స్‌డ్‌ ఇంజినీర్లతో పరీక్ష చేయించి అవసరమైన మార్పులు చేయించుకోవాలి. బ్యాటరీ బ్యాకప్‌తో కనీసం 90 నిమిషాలు పనిచేసేలా ఎమర్జెన్సీ లైటింగ్‌, ఆటో గ్లో ఎగ్జిట్‌ సైన్‌ ఏర్పాటుచేసుకోవాలి. అర్హులైన ఫైర్‌ అధికారి, ఎవాక్యుయేషన్‌ సూపర్‌వైజర్లను నియమించుకోవాలి. మూడు నెలలకోసారి మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలి.


హోటల్‌లో బస చేసినప్పుడు..

  • హోటల్‌లో బసచేసే గది, అక్కడినుంచి సురక్షితంగా బయటకు వెళ్లే మార్గం గురించి తెలుసుకోవాలి. హోటల్‌లోని ఎగ్జిట్‌లు, స్టెయిర్‌ కేసులపై అవగాహన పెంచుకోవాలి. హోటల్‌లో సరైన అగ్నిమాపక పరికరాలు, అగ్ని నిరోధక చర్యలు ఉన్నాయో లేదో చూడాలి.
  • ఫైర్‌ అలారం కాల్‌ పాయింట్లు, ఫైర్‌ ఎగ్జిట్‌లు ఎక్కడ ఉన్నాయో గుర్తించాలి. ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్లు, హోస్‌ రీల్స్‌ పనితీరుపై అవగాహన అవసరం.
  • విద్యుత్‌ ఉపకరణాల్లో స్విచ్‌ల్లో ఏ విధమైన పగుళ్లు, లోపాలు కనిపించినా వెంటనే మేనేజ్‌మెంట్‌ దృష్టికి తీసుకెళ్లాలి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు