logo

కోడ్‌ కూశాక.. కూత మొదలు

నగరానికి నాలుగో రైల్వేస్టేషన్‌గా చర్లపల్లి సిద్ధమైంది. ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated : 16 Apr 2024 06:32 IST

ఎన్నికల తర్వాత చర్లపల్లి రైల్వేస్షేషన్‌ అందుబాటులోకి
25 జతల రైళ్లు ఇక్కడి నుంచే రాకపోకలు

ఈనాడు, హైదరాబాద్‌: నగరానికి నాలుగో రైల్వేస్టేషన్‌గా చర్లపల్లి సిద్ధమైంది. ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మొత్తం 6 ప్లాట్‌ఫాంలతో పాటు.. రైళ్ల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్టేషన్‌ భవనంలో టిక్కెట్‌ కౌంటర్లు, కార్యాలయం సిద్ధమైంది. స్టేషన్‌కు ఇరువైపులా రాకపోకలు సాగించేందుకు వీలుగా రహదారుల నిర్మాణం జరుగుతోంది. ఇక్కడి నుంచి తొలుత 6 ఎక్స్‌ప్రెస్‌లు నడపనుండగా.. వారం, పది రోజుల్లోనే 25 జతల దూరప్రాంత రైళ్లను నడపడానికి స్టేషన్‌ను సిద్ధం చేస్తున్నారు. రూ.430 కోట్లకు పైగా వెచ్చించి ఈ రైల్వేస్టేషన్‌ను తీర్చిదిద్దారు.

చర్లపల్లి రైల్వేస్టేషన్‌


సిద్ధమైన రైల్వే ప్లాట్‌ఫాంలు..

గతంలో రెండు ప్లాట్‌ఫాంలు.. మూడు రైల్వేలైన్లుగా ఉన్న చర్లపల్లిలో ఇప్పుడు 9 ప్లాట్‌ఫాంలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే 24 రైల్వే బోగీలు పట్టే విధంగా 5 ప్లాట్‌ఫాంలు అందుబాటులోకి రాగా.. మరో 4 ఎత్తయిన ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. 12 మీటర్ల వెడల్పుతో రెండు పాదచారుల వంతెనలు రానుండగా.. 6 మీటర్ల వెడల్పుతో మరొకటి కూడా సిద్ధమవుతోంది. 9 ప్లాట్‌ఫాంలలో మొత్తం 7 లిఫ్టులు, 6 ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. కోచ్‌ నిర్వహణ వ్యవస్థతో పాటు.. ఎంఎంటీఎస్‌ రైళ్లకు ఎలాంటి ఆటంకం లేకుండా రెండు ప్లాట్‌ఫాంలు అందుబాటులోకి రానున్నాయి. స్టేషన్‌ బయట బస్సుబేలు, ప్రవేశ మార్గాలు, 4-వీలర్‌, 3-వీలర్‌ మరియు టూ-వీలర్‌ వాహనాలకు తగిన స్థలం,  24 గంటలు సీసీటీవీ వ్యవస్థ ఏర్పాటు చేశారు.


చర్లపల్లి నుంచి నేరుగా బయటికి..

చర్లపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి రైళ్ల రాకపోకలు ప్రారంభిస్తే.. రైళ్ల ఆలస్యానికి కట్టడి వేయవచ్చు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌తో సంబంధం లేకుండా రైలు ప్రయాణాలు సాగిపోతుంటాయి. ఉదాహరణకు లింగంపల్లి నుంచి బయలుదేరే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌, గౌతమి, జన్మభూమి ఇలా పలు రైళ్లు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లకుండానే గమ్యస్థానాలకు చేరేందుకు అవకాశం ఉంది. భవిష్యత్తులో లింగంపల్లి తర్వాత హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్‌లో ఈ రైళ్లు ఆగి సనత్‌నగర్‌ - మౌలాలి మీదుగా చర్లపల్లి చేరుకునే వెసులుబాటు కలగనుంది. అలాగే విజయవాడ మీదుగా వచ్చే రైళ్లు కాచిగూడ స్టేషన్‌మీదుగా బెంగళూరు, కర్నూలువైపు వెళ్లే రైళ్లు కూడా సికింద్రాబాద్‌ స్టేషన్‌కు చేరకుండా వెళ్లడానికి వీలు కలుగుతుంది. 50 శాతం ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించే అవకాశం ఉంది. కాచిగూడ రైల్వేస్టేషన్‌ నుంచి బెంగళూరు వెళ్లే రైళ్లతో పాటు.. విశాఖపట్నం, విజయవాడ వెళ్లే రైళ్లను కూడా అక్కడి నుంచి పంపేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇవి నేరుగా మల్కాజిగిరి రైల్వే స్టేషన్లో ఆగేట్టు చూస్తున్నారు. అలాగే మౌలాలి రైల్వే స్టేషన్లో ఆగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని