logo

మూడు ప్రమాదాలు.. 8 మంది మృతి

ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న అయిదుగురూ ప్రాణాలు కోల్పోయారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని గౌరవరం వద్ద జాతీయరహదారిపై మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది.

Published : 17 Apr 2024 02:32 IST

మృతుల్లో రెండేళ్ల చిన్నారి
కావలి సమీపంలో దుర్ఘటన

ప్రమాదంలో నుజ్జయిన కారు

కావలి, న్యూస్‌టుడే: ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న అయిదుగురూ ప్రాణాలు కోల్పోయారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని గౌరవరం వద్ద జాతీయరహదారిపై మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని జలదంకి మండలం చామదలకు చెందిన దావులూరి శ్రీనివాసులు భవన నిర్మాణాలకు కార్మికులను సమకూర్చే గుత్తేదారు. హైదరాబాద్‌లో ఉంటున్నారు. శ్రీరామనవమికి స్వగ్రామానికి వచ్చారు. రాములవారికి నూతన వస్త్రాలు కొనేందుకు శ్రీనివాసులు (54), భార్య వరలక్ష్మి (44), గంటా లక్ష్మమ్మ (56), గంటా నీలిమ (24), గంటా నందు (2) కారులో కావలి బయలుదేరారు. గౌరవరం వద్దకు రాగానే రోడ్డు మార్జిన్‌లో ఆగిన లారీని ఢీకొట్టింది. కారు నుజ్జయి అక్కడికక్కడే మృతిచెందారు.

కర్ణాటకలో ప్రమాదంలో..

హుబ్బళ్లి, న్యూస్‌టుడే: కర్ణాటకలోని హుబ్బళ్లి శివార్లలో సోమవారం అర్ధరాత్రి సంభవించిన ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఉప్పల్‌కు చెందిన బహుదొడ్డి ప్రదీప్‌ (35), మొలగల్‌ బాలరాజగౌడ (44), రుద్రప్ప నవీన్‌ (26) మరణించినట్లు గుర్తించారు. సీతారామ, అర్జున, రాజు కృష్ణప్ప గాయపడ్డారు. కారును ఎదురుగా వచ్చిన బస్సు ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది.

మరో ఘటనలో ఆరుగురికి గాయాలు

పెబ్బేరు: తిరుపతి నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఓ కారు పెబ్బేరు సమీపంలో బోల్తాపడగా ఆరుగురికి గాయాలయ్యాయి. ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి కారు డీవైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని