logo

ఎన్నికల సమగ్రసమాచారం.. ఓటరుకు ఉపయుక్తం

సార్వత్రిక ఎన్నికల్లో శతశాతం ఓటింగ్‌ లక్ష్యంగా ఎన్నికల అధికారులు నగరంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు

Updated : 18 Apr 2024 04:50 IST

పలు అంశాలతో పుస్తకాల పంపిణీ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల్లో శతశాతం ఓటింగ్‌ లక్ష్యంగా ఎన్నికల అధికారులు నగరంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఓటర్ల సౌకర్యార్థం పలు యాప్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా ఓటర్‌ గైడ్‌ పేరిట బుక్‌లెట్లు విడుదల చేసింది. బీఎల్వోల ద్వారా ప్రతి ఒక్కరికీ వీటిని పంపిణీ చేస్తున్నారు. ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటేయాలని ఓటర్లకు సూచిస్తున్నారు. పది పేజీల ఈ బుక్‌లెట్‌లో ఓటు నమోదు మొదలుకొని పోలింగ్‌ ప్రక్రియ, ఓటు వేసే విధానం, అందుబాటులో ఉన్న యాప్‌లు, ఓటరు ప్రతిజ్ఞ అంశాలు పొందుపరిచారు. ఈ బుక్‌లెట్‌ ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచారు.

 ఓటు నమోదు నుంచి నామినేషన్‌ వరకు..

నూతన సాంకేతికత సహాయంతో ఎన్నికల సంఘం తమ సేవలను ఓటర్లకు చేరువచేస్తోంది. ఓటు హక్కు నమోదు మొదలుకొని నామినేషన్‌ వరకు ప్రతీది ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్‌ ద్వారానే చూసుకోవచ్చు. దీని కోసం పలు యాప్‌లను తీసుకొచ్చింది. వీటి గురించి బుక్‌లెట్‌లో వివరించారు.

  •  పార్టీలు సభలు, సమావేశాలు, ర్యాలీలు, లౌడ్‌ స్పీకర్లు, వాహనాల్లో ప్రచారం తదితరాల అనుమతుల దరఖాస్తుకు వీలుగా ‘సువిధ’ యాప్‌ ప్రారంభించారు. వీటికోసం అభ్యుర్థులు అధికారులు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.  
  • ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు నగదు, మద్యం, విలువైన బహుమతులిచ్చే కార్యక్రమాలను అరికట్టేందుకు సీ-విజిల్‌ యాప్‌ను ప్రవేశపెట్టారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు.
  •   సాధారణంగా ఆర్వో కార్యాలయాల్లో నామినేషన్లు వేస్తుంటారు. ఎన్నికల కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో నామినేషన్‌లు వేసే అవకాశం కల్పించారు. ధ్రువపత్రాలను మాత్రం ఆర్వో కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది.
  •  లోక్‌సభ ఎన్నికల్లో మొదటిసారిగా ఇంటి నుంచే ఓటువేసే వీలు కల్పిస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారు వినియోగించుకోవచ్చు. ముందుగా ఫారం-12డీతో దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు వెళ్లి బ్యాలెట్‌ పేపర్‌తో ఓటు వేయిస్తారు.

తనిఖీ చేసుకోవచ్చు..

  • ఓటరు సందేహాల నివృత్తికి ఎన్నికల సంఘం ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో సమగ్ర సమాచారం ఉంటుంది. ఓటరు జాబితాలో తమ పేరుందో లేదో తనిఖీ చేసుకోవచ్చు. పోలింగ్‌ స్టేషన్‌ నంబరు, చిరునామా తదితర వివరాలుంటాయి. ఓటు నమోదు, ఓటరు సేవలు, ఎపిక్‌కార్డు డౌన్‌లోడ్‌, అభ్యర్థుల సమాచారం, ఎన్నికల ఫలితాల గురించి తెలుసుకోవచ్చు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని