logo

అదే జోరు.. సాగాలి కారు

శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించినట్లే రాజధాని పరిధిలో నాలుగు లోక్‌సభ స్థానాల్లో కనీసం మూడింటిలోనైనా గులాబీ జెండా ఎగరేయాలని భారాస గట్టి ప్రయత్నాలు చేస్తోంది

Updated : 18 Apr 2024 04:30 IST

మెజార్టీ స్థానాల్లో విజయానికి శ్రమిస్తున్న భారాస

నాలుగు లోక్‌సభ స్థానాల బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగింత

 

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించినట్లే రాజధాని పరిధిలో నాలుగు లోక్‌సభ స్థానాల్లో కనీసం మూడింటిలోనైనా గులాబీ జెండా ఎగరేయాలని భారాస గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మెజారిటీ అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఉండటంతో.. వారి తోడ్పాటుతో ఫలితాలను అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తోంది. వీరంతా క్షేత్రస్థాయిలో శ్రమిస్తే సాధ్యమేనని అంటున్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులు కాంగ్రెస్‌లో చేరుతుండటం.. ఎమ్మెల్యేల్లోనూ కొందరు పక్కచూపులు చూస్తుండటంతో భారాస అగ్రనేతల్లో ఆందోళన కలిగిస్తోంది. దీన్ని అధిగమించడానికి శాసనసభ నియోజకవర్గాల వారీగా భారీ ఎత్తున సభలు, ప్రచారాలు నిర్వహించాలని నిర్ణయించారు.

 విజయంపై ధీమా..గత లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల స్థానాల్లో ఒక్క చేవెళ్ల నుంచి మాత్రమే భారాస అభ్యర్థి విజయం సాధించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇదే పార్టీ గెలిచింది. ఈ నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 28 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అందులో 17 చోట్ల భారాస జయకేతనం ఎగరేసింది. వీరంతా మల్కాజిగిరి, సికింద్రాబాద్‌, చెవేళ్ల లోక్‌సభ పరిధిలోనే ఉండటం గమనార్హం. అయా ప్రాంతాల్లో ఎమ్మెల్యేల బలం పార్టీకి ఎక్కువగా ఉంది. దీన్ని బట్టి లోక్‌సభ ఎన్నికల్లోనూ తమ పార్టీ అభ్యర్థుల విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొనే పార్టీ అధినేత కేసీఆర్‌ అభ్యర్థులను ఎంపిక చేశారు.

నేతల మీదే భారం!

ప్రతిపక్షంగా ఉండటంతో భారాస నుంచి పెద్దఎత్తున ఆర్థిక దన్ను అభ్యర్థులకు లభించడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు లోక్‌సభ అభ్యర్థుల గెలుపు బాధ్యత పార్టీ అప్పగించింది. ఇదే సమయంలో గత కొన్ని రోజులుగా చూస్తే చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు చురుకుగా ప్రచారంలో పాల్గొనడం లేదు. నామినేషన్ల పర్వం ముగిసిన తరువాత ప్రచారం పెద్దఎత్తున మొదలుపెడతామని కొంతమంది ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌లోకి నగరానికి చెందిన అయిదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొంతమంది సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. కొందరు ఆ పార్టీ అగ్రనేతలతోనూ చర్చలు జరుపుతున్నారని అంటున్నారు.

  • సికింద్రాబాద్‌ అభ్యర్థిగా అదే అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే టి.పద్మారావు గౌడ్‌ను ప్రకటించారు. మాజీ మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా వివిధ హోదాల్లో పని చేసిన ఆయన ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. ఆయన ఎంపికకు ప్రధాన కారణం ఇదేనని చెబుతున్నారు. ప్రచారంలోనూ దూసుకెళ్తున్నారు.

  • మల్కాజిగిరి అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డిని నిలబెట్టారు. పదవులు చేపట్టకపోయినా ఉప్పల్‌ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఆర్థికంగా బలవంతుడైన లక్ష్మారెడ్డి ప్రచారంలో శ్రమిస్తున్నారు.

  •  చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థిగా రాజకీయ కురువృద్ధుడు కాసాని జ్ఞానేశ్వర్‌ను ఎంపిక చేశారు. అక్కడి సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జ్ఞానేశ్వర్‌ను బరిలో దింపారు. గతంలో ఎమ్మెల్సీగానూ పని చేశారు. కొన్ని బీసీ కులాల్లో పట్టు ఉంది.

  •  హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి గెడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ను అభ్యర్థిగా ఎంపిక చేశారు. భారాసలో యువనేతగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఎంఐఎంకు పట్టు ఉంది. కాబట్టి ఇక్కడ పోటీ నామమాత్రమేనని అంటున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని