logo

జనగణనలో కులగణనకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి: ఆర్‌.కృష్ణయ్య

జనగణనలో కులగణన కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకమై.. లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు.

Published : 19 Apr 2024 03:04 IST

రమేష్‌కు నియామకపత్రం అందజేస్తున్న ఆర్‌.కృష్ణయ్య, గుజ్జ కృష్ణ

నల్లకుంట, న్యూస్‌టుడే: జనగణనలో కులగణన కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకమై.. లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. కులగణన చేపట్టడం సహా బీసీ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం.. తదితర ప్రధాన డిమాండ్లతో దేశవ్యాప్తంగా పర్యటించేందుకు బీసీ సంఘాలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌ విద్యానగర్‌ బీసీభవన్‌లో బీసీ సంఘాల జాతీయ కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండలం రాళ్లగూడుపల్లి గ్రామానికి చెందిన ర్యాగ రమేష్‌ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించి సంబంధిత పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి బీసీలను అణగదొక్కుతున్నారని, ఈ నేపథ్యంలో కులగణనతోనే వారికి న్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయాలనే ప్రయత్నాలను కేంద్రం విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, నేతలు నీల వెంకటేష్‌, నందగోపాల్‌, వేముల రామకృష్ణ, కృష్ణయాదవ్‌, మధుసూదన్‌, సాయిరామ్‌  పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని