logo

గోప వాహనంపై దేవ దేవుడు

చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం గోపవాహన సేవ నిర్వహించిన అనంతరం హనుమంత వాహనం పూజలు నిర్వహించారు.

Published : 21 Apr 2024 02:51 IST

ఆలయ పురవీధుల్లో ఉత్సవమూర్తుల ఊరేగింపు

మొయినాబాద్‌, న్యూస్‌టుడే: చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం గోపవాహన సేవ నిర్వహించిన అనంతరం హనుమంత వాహనం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులను ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయ పరిసర ప్రాంతాలు మార్మోగాయి. ఉత్సవమూర్తులను దర్శించుకోవడానికి భక్తులు పోటీపడ్డారు. సాయంత్రం సమయంలో నిర్వహించిన పలు సేవల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఆలయ గోపురం, ప్రధాన ద్వారం విద్యుత్తు వెలుగుల్లో మిరుమిట్లుగొల్పాయి. బ్రహ్మోత్సవ వేడుకలను వేదపండితులు తిరుల కిరణాచారి, పురావస్తు రామాచారి ఆధ్వర్యంలో కొనసాగుతుండగా ఆలయ మేనేజింగ్‌ కమిటీ కన్వీనర్‌ గోపాలకృష్ణస్వామి, అర్చకుడు సీఎస్‌ రంగరాజన్‌, కన్నయ్య, సురేష్‌, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

కల్యాణం నేడు.. బ్రహ్మోత్సవాల్లో మరో ప్రధాన ఘట్టమైన కల్యాణోత్సవానికి ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేపట్టారు. ఆదివారం ఆలయంలో సూర్యప్రభ, గరుడ వాహన సేవలు నిర్వహించిన అనంతరం రాత్రి 10 తర్వాత కల్యాణ తంతును ప్రారంభించనున్నారు.

అవివాహితులకు ప్రత్యేక కార్యక్రమాల్లేవు: ఆలయవర్గాలు

సంతాన సాఫల్యం కోసం గరుడ ప్రసాదం పంపిణీ, ఈనెల 21న నిర్వహించనున్న కల్యాణోత్సవం సందర్భంగా అవివాహితులు, పెళ్లి సంబంధాలు కుదరని వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలుంటాయని సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం కల్యాణోత్సవం మినహా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని ఆలయ పూజారి రంగరాజన్‌ శనివారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని