logo

ఖాళీగా ఉంచితే ఖతమే!

రాజధాని పరిధిలో దేవాదాయ శాఖకు సంబంధించి రూ.వేల కోట్ల విలువైన భూములున్నాయి. వీటికే ప్రహరీలు, కంచెలు నిర్మించకపోవడంతో ఇప్పటికే 40శాతం మేర ఆక్రమణలకు గురయ్యాయి.

Updated : 21 Apr 2024 06:22 IST

ఆలయాల భూములకు రక్షణ కరవు
లీజుకు ఇచ్చే యోచనలో అధికారులు

నెక్నాంపూర్‌ శ్రీగణేశ్‌ దేవాలయ భూముల్లో ఆక్రమణలను తొలగించి దేవాదాయ శాఖ భూములుగా బోర్డు పాతిన అధికారులు, పోలీసులు

ఈనాడు, హైదరాబాద్‌:  రాజధాని పరిధిలో దేవాదాయ శాఖకు సంబంధించి రూ.వేల కోట్ల విలువైన భూములున్నాయి. వీటికే ప్రహరీలు, కంచెలు నిర్మించకపోవడంతో ఇప్పటికే 40శాతం మేర ఆక్రమణలకు గురయ్యాయి. కొందరు నకిలీ పత్రాలు సృష్టించి.. తమ భూములేనంటూ ఎండోమెంట్‌ ట్రైబ్యునల్‌లో, న్యాయస్థానాల్లో కేసులు వేస్తున్నారు. ఆక్రమణల తొలగింపు క్రమంలో, ఆక్రమించినవారిని ప్రతిఘటించే క్రమంలో ఈవోలపై దాడులు జరుగుతున్న దాఖలాలూ ఉన్నాయి. ఈ క్రమంలోనే, ఖాళీగా ఉన్న ఆలయ భూములను వినియోగంలోకి తీసుకొస్తేనే వాటిని కాపాడే అవకాశం ఉంటుందని ఈవోలు భావిస్తున్నారు. ఆయా అంశాలను శాఖకు నివేదించారు. క్రీడా మైదానాలు, ఇతర అభివృద్ధి పనులకు లీజుకు ఇస్తే ప్రత్యేకంగా రక్షణ ఏర్పాట్ల అవసరముండదని సూచిస్తున్నారు.

ఇదీ పరిస్థితి.. గ్రేటర్‌ పరిధిలో మొత్తం 1,736 ఆలయాలు ఉన్నాయని అంచనా. దేవాదాయ శాఖ లెక్కల ప్రకారం హైదరాబాద్‌ జిల్లా పరిధిలో ఆలయాలకు 5718.01 ఎకరాల భూములున్నాయి. 5088.35 ఎకరాల వ్యవసాయ, 629.06 ఎకరాల వ్యవసాయేతర భూములు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 250 ప్రముఖ ఆలయాలకు వేలాది ఎకరాల్లో భూములున్నాయి. వీటి విలువ రూ.వేల కోట్ల పైమాటే. ఆలయాల్లో దీప, ధూప నైవేద్యాల కోసం అప్పట్లో దాతలు ఈ భూములను రాసిచ్చారు. వీటితో వచ్చే ఆదాయాన్ని పూజలు, అర్చకుల వేతనాలు తదితరాలకు వినియోగించాలి. అనేక ఏళ్లుగా ఈ భూములు ఖాళీగా ఉండటంతో కొన్ని ఆలయాలు ధూప, దీప, నైవేద్యాలకు సైతం నోచుకోవడం లేదు. ఖాళీగా ఉన్న భూములపై కబ్జాదారుల కళ్లు పడటంతో నిజాం కాలం నాటి ముంతకబ్‌లు, రెవెన్యూ రికార్డుల్లో వివరాలు లేకపోవడం చూసి నకిలీ పత్రాలు సృష్టించి వాటిని తమ పరం చేసుకుంటున్నారు. యాచారం ఓంకారేశ్వర ఆలయానికి 1,450 ఎకరాలు, కొందుర్గు పెండాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి 360 ఎకరాలు, శంషాబాద్‌ కోదండ రామాలయ పరిధిలోని 35.5 ఎకరాలు, మొయినాబాద్‌ అజీజ్‌నగర్‌లో 1.04 ఎకరాలు, రంగనాథ ఆలయానికి సంబంధించి తొర్రూర్‌లో 8 ఎకరాలుండగా.. వీటిలో చాలా మేరకు అన్యాక్రాంతమయ్యాయి. కొన్ని వివాదాలు న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్నాయి.

నెక్నాంపూర్‌ ఆలయ భూముల్లో చేపట్టిన నిర్మాణాలు

ఇలా చేయాలని.. ఆలయాల ఖాళీ భూములను గుర్తించాలి. గ్రామీణ ప్రాంతాల్లో పంటలకు, పశువుల గడ్డి మొక్కల పెంపకానికి, పట్టణ ప్రాంతాల్లో క్రికెట్‌ మైదానాలు, రిటైల్‌ స్టోర్లు, రెస్టారెంట్లు, వాహనాల వాషింగ్‌ సెంటర్లు, పెట్రోల్‌ బంకులు తదితర వాణిజ్య కార్యకలాపాలను అప్పగించాలనే యోచిస్తున్నారు. 5-10 ఏళ్ల పరిమిత సమయానికి లీజుకు ఓపెన్‌ టెండర్లను ఆహ్వానించి ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు