logo

ప్రచారాస్త్రం.. పార్టీల సమాయత్తం

లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులు దరఖాస్తుల సమర్పణ వేగవంతమైంది. ఇదే సమయంలో ఉన్నంతలో ప్రస్తుతం సమావేశాలకే పరిమితమవుతున్న అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించడానికి అస్త్రశస్త్రాలతో సమాయత్తమవుతున్నాయి.

Updated : 21 Apr 2024 06:21 IST

న్యూస్‌టుడే, వికారాబాద్‌: లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులు దరఖాస్తుల సమర్పణ వేగవంతమైంది. ఇదే సమయంలో ఉన్నంతలో ప్రస్తుతం సమావేశాలకే పరిమితమవుతున్న అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించడానికి అస్త్రశస్త్రాలతో సమాయత్తమవుతున్నాయి. చేవెళ్ల నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్‌, భారాస, భాజపాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న తీరుపై ‘న్యూస్‌టుడే’ కథనం.


గ్యారంటీలతో ప్రజల్లోకి కాంగ్రెస్‌..

కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీలను విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, అర్హులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, ఆరోగ్యశ్రీ బీమా పెంపు, ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్‌కార్డుల జారీకి మంత్రిమండలి ఆమోదం, ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వ ఏర్పాట్లు వంటి అంశాలను ప్రచార అస్త్రాలుగా మలుచుకోనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పార్టీ బాధ్యులతో ఇటీవల సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని సూచించారు. పాత, కొత్త నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు. లోక్‌సభ నియోజకవర్గ బాధ్యతలను వేం నిరంజన్‌రెడ్డికి అప్పగించారు.


పదేళ్ల పాలనను వివరిస్తూ భాజపా..

కాంగ్రెస్‌, భారాసలకు దీటుగా ప్రచారం నిర్వహించేందుకు భాజపా సమాయత్తమవుతోంది. పదేళ్లుగా కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ అందిస్తున్న పాలనతో పాటు అవినీతిని అంతం చేసేందుకు చేపడుతున్న చర్యలను వివరించి ఓట్లు అభ్యర్థించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. జాతీయ స్థాయిలో అమలు చేస్తున్న పాలనా సంస్కరణలు ప్రజలకు వివరిస్తున్నారు. జాతీయ నాయకులతో పాటు ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులను ఆహ్వానించి, సభల్లో వారి ప్రసంగాలతో ప్రచారం నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. బూత్‌, శక్తి కేంద్రాలను బలోపేతం చేసే పనిని ఇప్పటికే క్షేత్రస్థాయిలో కార్యకర్తలు పూర్తి చేస్తున్నారు. దేశ రాజకీయాల్లో ప్రధాని మోదీ ఆవశ్యకతను వివరిస్తూ ఓట్లు రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు.


ప్రజా సమస్యలే ఎజెండాగా భారాస..

ప్రజా సమస్యలే ఎజెండాగా భారాస ప్రచారం నిర్వహిస్తోంది. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌లలో కార్యకర్తల సమావేశాలను నిర్వహించి కార్యకర్తలను భారాస సమాయత్తం చేసింది. ప్రస్తుతం మండల, గ్రామ స్థాయిలో కార్యకర్తలు, ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహించి ఇంటింటికీ ప్రచారం సందర్భంగా ప్రస్తావించాల్సిన అంశాలపై తర్ఫీదునిస్తోంది. ముఖ్యంగా శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో విఫలమైన తీరును ఎండగట్టాలని నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఓట్లను అభ్యర్థించేందుకు ప్రణాళికలు రూపొందించారు.  

  • శాసనసభ నియోజకవర్గాలకు ఎన్నికల బాధ్యులుగా వికారాబాద్‌కు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, తాండూర్‌కు బైండ్ల విజయ్‌కుమార్‌, పరిగికి గట్టు రాంచందర్‌రావు, చేవెళ్లకు నాగేందర్‌గౌడ్‌, మహేశ్వరానికి స్వామిగౌడ్‌, శేరిలింగంపల్లికి నవీన్‌రావు, రాజేంద్రనగర్‌కు పుటం పురుషోత్తంలను నియమించి సమన్వయం చేస్తోంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని