logo

మెజార్టీ రికార్డు.. సాకారమయ్యేనా!

రాజధాని పరిధిలో ఇప్పటివరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ 2,82,186గా నమోదైంది. 1952 నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో లక్షకు పైగా మెజార్టీ సాధించిన సందర్భాలు అరుదు. నియోజకవర్గాల వారీగా గత ఎన్నికల్లో నమోదైన మెజార్టీ రికార్డులను పరిశీలిస్తే..

Updated : 21 Apr 2024 08:48 IST

రాజధాని పరిధిలో ఇప్పటివరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ 2,82,186గా నమోదైంది. 1952 నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో లక్షకు పైగా మెజార్టీ సాధించిన సందర్భాలు అరుదు. నియోజకవర్గాల వారీగా గత ఎన్నికల్లో నమోదైన మెజార్టీ రికార్డులను పరిశీలిస్తే..

ఈనాడు, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ 1996లో నమోదైంది. కాంగ్రెస్‌ అభ్యర్థి పి.వి.రాజేశ్వర్‌రావు భాజపా అభ్యర్థి బండారు దత్తాత్రేయపై 2,14,358 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో భాజపా అభ్యర్థి బండారు దత్తాత్రేయ కాంగ్రెస్‌ అభ్యర్థి పి.వి.రాజేశ్వర్‌రావుపై 1,85,910 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థి అంజన్‌కుమార్‌ యాదవ్‌.. భాజపా అభ్యర్థి బండారు దత్తాత్రేయపై 1,70,167 ఓట్ల మెజార్టీ సాధించారు. అంతకుముందు 1987 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి టి.మణెమ్మ అంజయ్య భాజపా అభ్యర్థి బండారు దత్తాత్రేయపై 92వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1999లో జరిగిన ఎన్నికల్లో బండారు దత్తాత్రేయ కాంగ్రెస్‌ అభ్యర్థి నాదెండ్ల భాస్కర్‌రావుపై 91,626 ఓట్ల మెజార్టీ సాధించారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ స్థాయి మెజార్టీ రాలేదు. ్య హైదరాబాద్‌ జిల్లాలో 2019 ఎన్నికల్లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ భాజపా అభ్యర్థి డా.భగవంతరావుపై 2,82,186 మెజార్టీ సాధించారు. 2014 ఎన్నికల్లో నమోదైన రికార్డును తానే బద్దలు కొట్టారు. ఈ ఎన్నికల్లో అసదుద్దీన్‌ ఒవైసీ భాజపా అభ్యర్థి డా.భగవంతరావుపై 2,02,454 ఓట్ల మెజార్టీ సాధించారు. ఈ ఎన్నికలో 1989లో తన తండ్రి సలావుద్దీన్‌ ఒవైసీ మెజార్టీ రికార్డును తిరగరాశారు. ఈ ఎన్నికల్లో మజ్లిస్‌ పార్టీ తరఫున బరిలో దిగిన సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఒవైసీ తెదేపా అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపై 1,33,078 మెజార్టీ సాధించారు.


  • చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. 2014లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ తెరాస అభ్యర్థిగా బరిలో దిగిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి పటోళ్ల కార్తీక్‌రెడ్డిపై 73,023 ఓట్ల మెజార్టీ సాధించారు. మూడు ఎన్నికలు జరగ్గా ఇదే అత్యధిక మెజార్టీ. మిగిలిన ఎన్నికల్లో.. 2009లో 18,532, 2019లో 14,317 ఓట్ల మెజార్టీలు నమోదయ్యాయి.

  • మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. ఇక్కడ జరిగిన తొలి ఎన్నికలో నమోదైన మెజార్టీ ఇప్పటికీ అత్యధికంగా కొనసాగుతోంది. తొలి ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి సర్వే సత్యనారాయణ తెదేపా అభ్యర్థి టి.భీమ్‌సేన్‌పై 93,326 ఓట్ల మెజార్టీ సాధించారు. 2014లో సీహెచ్‌.మల్లారెడ్డి 28,371, 2019లో ఎ.రేవంత్‌రెడ్డి 10,919 ఓట్ల మెజార్టీ సాధించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని