logo

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బండి.. దోపిడీ దండి

జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలోని పలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వాహనాలు అక్రమ వసూళ్లకు కేంద్రంగా మారాయి. అధికారులు, సిబ్బంది వేధింపులతో చిరు వ్యాపారులు, నిర్మాణదారులు, దుకాణదారులు సతమతమవుతున్నారు. 

Published : 21 Apr 2024 03:32 IST

ఈనాడు, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలోని పలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వాహనాలు అక్రమ వసూళ్లకు కేంద్రంగా మారాయి. అధికారులు, సిబ్బంది వేధింపులతో చిరు వ్యాపారులు, నిర్మాణదారులు, దుకాణదారులు సతమతమవుతున్నారు.  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వాహనాలు కేంద్రంగా చలాన్ల మాయాజాలం నడుస్తోంది. రూ.50వేల జరిమానా వేస్తామంటూ వ్యాపారులను బెదిరించడం, చివరకు రూ.500 చలానా రాసి, రూ.10వేల నుంచి రూ.20వేలు లంచం తీసుకోవడం ఉద్యోగులకు పరిపాటిగా మారింది.  

వాహనాలు ఎందుకంటే..?

జీహెచ్‌ఎంసీ పరిధిలో 30 సర్కిళ్లు ఉండగా, సర్కిల్‌కు ఓ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వాహనం పనిచేస్తోంది. అందులో డ్రైవరు, సూపర్‌వైజరు, ఇద్దరు కార్మికులు ఉంటారు. రోడ్లపై చెత్త, నిర్మాణ వ్యర్థాలు వేసినా, ఫ్లెక్సీలు కట్టినా..  ఇతరత్రా ఉల్లంఘనలపై ఆయా వాహనాల సిబ్బంది చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సర్కిల్‌ సహాయ వైద్యాధికారి(ఏఎంవోహెచ్‌), ఉప కమిషనర్‌ పర్యవేక్షణలో ఇవి పనిచేస్తాయి.

ఇవిగో ఉదాహరణలు..

  • ముషీరాబాద్‌ సర్కిల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వాహనానికి సంబంధించిన చలాన్ల డబ్బును అధికారి నెలరోజులుగా ట్రెజరీలో చెల్లించలేదు.  గతంలో ఇక్కడే ఓ ఉన్నతాధికారి రూ.లక్షల్లో వసూళ్లకు పాల్పడిన ఉదంతంపై ‘ఈనాడు’ కథనాలు ప్రచురించినా.. యంత్రాంగం తీరు మారలేదు.
  • ఈ అక్రమ వసూళ్లకు ట్రెజరీ అధికారులు, సర్కిల్‌ డీసీల మద్దతు ఉందనే ఆరోపణలున్నాయి.

అధికార దుర్వినియోగం ఇలా..

  • ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వాహనాల్లోని ఉద్యోగులు, సిబ్బంది.. ఉన్నతాధికారుల అండతో రెచ్చిపోతున్నారు. కొందరు ఏఎంవోహెచ్‌లు నకిలీ చలాన్లు సృష్టించి రోజూ రూ.లక్షకుపైగా వసూలు చేస్తుండగా, మరి కొందరు..  దుకాణదారులనుంచి నెలవారీ తీసుకుంటున్నారు.
  • తోపుడుబండ్లు, కిరాణా దుకాణాలను తనిఖీచేసి, ప్లాస్టిక్‌ కవర్లను ఉపయోగిస్తున్నందున రూ.50వేల జరిమానా కట్టాలని బెదిరించడం, వ్యాపారి ఇచ్చే ముడుపులు తీసుకుని వదిలేయడం కొందరు ఏఎంవోహెచ్‌లకు పరిపాటిగా మారింది.
  • స్థానికంగా హోటళ్లపై వచ్చే ఫిర్యాదులనూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వాహనాలు వసూళ్లకు వాడుకుంటున్నాయనే ఫిర్యాదులున్నాయి. అధికారం లేకపోయినా.. సిబ్బంది హోటల్‌కు వెళ్లి, ఫొటోలు తీసి హల్‌చల్‌చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
  • దుకాణం పేరుతో రోడ్డుపై పెట్టేబోర్డులనూ సిబ్బంది లక్ష్యంగా చేసుకుంటున్నారు. జరిమానా పేరుతో బెదిరిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు