logo

పెద్ద హోటళ్లలోనూ.. ఇదేం కక్కుర్తి

రోడ్డు పక్కన ఆహార పదార్థాల వ్యాపారాలు నిర్వహించే తోపుడు బండ్లు, చిన్నపాటి దుకాణాల్లోనే కాదు.. పలు బడా హోటళ్లు కూడా నాసిరకం వస్తువులతో, పాచిపోయిన సాస్‌లతో వంటలు చేస్తున్నాయి.

Updated : 22 Apr 2024 05:26 IST

గడువు తీరిన, నాసిరకం వస్తువులతో ఆహార పదార్థాల తయారీ

ఇటీవల హోటళ్లలో తనిఖీలు నిర్వహించిన అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: రోడ్డు పక్కన ఆహార పదార్థాల వ్యాపారాలు నిర్వహించే తోపుడు బండ్లు, చిన్నపాటి దుకాణాల్లోనే కాదు.. పలు బడా హోటళ్లు కూడా నాసిరకం వస్తువులతో, పాచిపోయిన సాస్‌లతో వంటలు చేస్తున్నాయి. గుర్తింపు లేని పేర్లతో, నకిలీ లైసెన్సు నంబర్లతో తయారైన తాగునీటి సీసాలను విక్రయిస్తున్నాయి. గడువు తీరిన వస్తువులను ఉపయోగించి ప్రజారోగ్యాన్ని హరిస్తున్నాయి. ఇటీవల రాజధానిలో నాలుగు రోజులపాటు ఆహార భద్రత విభాగంలోని ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో వేర్వేరు ప్రముఖ హోటళ్ల బాగోతం వెలుగులోకి వచ్చింది. అయితే.. టాస్క్‌ఫోర్స్‌ బృందాలు తనిఖీ చేసే వరకు.. జీహెచ్‌ఎంసీలో పనిచేస్తోన్న 25 మంది ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు ఏం చేస్తున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. నగరవాసుల నుంచి హోటళ్లలోని దుర్భర పరిస్థితులపై వస్తోన్న ఫిర్యాదులను బల్దియా అధికారులు పట్టించుకోవడంలేదని, హోటళ్ల యజమానులతో కొందరు అధికారులు కుమ్మక్కవడంతోనే ప్రముఖ హోటళ్లలో ఏళ్లుగా తనిఖీలు జరగడంలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

బయటపడ్డ బాగోతాలు..

వేర్వేరు ప్రాంతాల్లోని ప్రముఖ హోటళ్లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ఈ నెల 16, 17, 18, 20 తేదీల్లో తనిఖీలు చేపట్టాయి. వంట గదుల్లోని శుభ్రత, వంట మనుషుల ఆరోగ్యం, సామగ్రి నాణ్యత, ఆయా ప్యాకెట్లపై ఉన్న గడువు, తయారీ సంస్థల వివరాలు, వంటల్లో కలుపుతున్న రంగులు, రసాయనాలు, ఉపయోగించే నూనె, ఇతరత్రా పదార్థాలను క్షుణ్నంగా తనిఖీ చేశారు. నాసిరకం, గుర్తింపులేని సంస్థల పేర్లతో ఉన్న ప్యాకెట్లు, తాగునీటి సీసాలు, సాస్‌లు, ఇతర నాసిరకం పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. నమూనాలను ప్రయోగశాలకు పంపించి..యాజమాన్యాలకు నోటీసులిచ్చారు.

  • గడువు ముగిసిన రూ.4,860 విలువైన ఎండుమిర్చి సాస్‌, చాక్లెట్‌ సిరప్‌ను, నాసిరకంగా గుర్తించిన రూ.1,09,650 విలువైన వంట నూనెను మినర్వా హోటల్‌లో గుర్తించారు.
  • బార్కస్‌లోని ఇండో అరబిక్‌ రెస్టారెంట్‌లో జరిపిన దాడుల్లో రూ.63,600 విలువైన నాసిరకం తాగునీటి సీసాలు, ఇతర పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
  • జూబ్లీహిల్స్‌లోని బాబిలోన్‌ బార్‌లో నాసిరకానికి చెందిన రూ.42,660 విలువైన ఆల్కలిన్‌ నీటి సీసాలు, రూ.1,797విలువైన బ్రిటీష్‌ ఇంగ్లీష్‌ స్పాంజ్‌ ఫింగర్స్‌ ప్యాకెట్లు, రూ.7,748 విలువైన వేర్వేరు గడువు తీరిన పదార్థాలను..
  • బంజారాహిల్స్‌లోని అట్లూరి ఫుడ్స్‌ లిమిటెడ్‌లో రూ.25,200విలువైన 40 నాసిరకం కాజు ప్యాకెట్లను, ఇతర పదార్థాలను గుర్తించామని అధికారులు తెలిపారు.
  • జూబ్లీహిల్స్‌లోని గౌరంగ్‌ డిజైన్స్‌ ఇండియా ప్రై.లి.నుంచి రూ.6,285 విలువైన నాసిరకం మసాలాలు, మిర్చి పొడి స్వాధీనం చేసుకున్నామన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని