logo

ఓటింగ్‌ శాతం తగ్గుతోంది

ఎన్నికలెప్పుడొచ్చినా 50శాతం మంది నగరవాసులు ఓటేసేందుకు మొహం చాటేస్తున్నారు.

Published : 22 Apr 2024 03:36 IST

ఈనాడు, హైదరాబాద్‌

ఎన్నికలెప్పుడొచ్చినా 50శాతం మంది నగరవాసులు ఓటేసేందుకు మొహం చాటేస్తున్నారు. గత మూడు లోక్‌సభ ఎన్నికలను పరిశీలిస్తే హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరిల్లో 55శాతానికి మించి ఓటింగ్‌ నమోదు కాలేదు. చేవెళ్లలోనూ క్రమంగా పోలింగ్‌ శాతం తగ్గుతూ వస్తోంది. మే 13న లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండగా అంతకు ముందు మే 11 రెండో శనివారం, తర్వాత ఆదివారం, సోమవారం ఎన్నికల సందర్భంగా సెలవు ఉండటంతో పోలింగ్‌పై ప్రభావం పడే అవకాశముంది. భానుడి భగభగలు తోడైతే ఇంటికే పరిమితం కావొచ్చు.  

ఓటింగ్‌ పెరిగితేనే నాయకుల్లో భయం

ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి పలికి అభివృద్ధి వైపు నాయకులు దృష్టి సారించాలంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒక లోక్‌సభ నియోజకవర్గంలో 18లక్షల ఓటర్లు ఉంటే 9 లక్షల మంది మాత్రమే ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. దీంతో నాయకులు ఓట్లు ఎక్కడ పడతాయి. ఎక్కడ పడవు అని లెక్కలేసుకుంటూ వారిని ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఇలా గెలిచినవారు ప్రజలను, అభివృద్ధిని పట్టించుకునే అవకాశముండదని పలు స్వచ్ఛంద సంస్థలు, కాలనీ సంక్షేమసంఘాలు ప్రచారాలు చేస్తున్నాయి. ఓటింగ్‌శాతం పెరిగితేనే ఖర్చు, ఓటమి భయం పెరిగి అభివృద్ధిపై దృష్టి సారిస్తారని వివరిస్తున్నారు.

75 పోలింగ్‌  కేంద్రాల్లో బల్దియా సర్వే

గత ఎన్నికల్లో పోలింగ్‌ సరళిని విశ్లేషించిన జీహెచ్‌ఎంసీ ఓటింగ్‌ శాతం తగ్గిన ప్రదేశాలపై దృష్టి సారించింది. దాదాపు 75 పోలింగ్‌స్టేషన్లలో సర్వే నిర్వహించింది. అనేక మంది ఓటర్లు అదే నియోజకవర్గంలో వేరే చోటికి, అదే జిల్లాలో వేరే నియోజకవర్గానికి, జిల్లా దాటి వేరేచోట నివాసముంటున్నారని గుర్తించారు. ఇందులో 2శాతం మరణించినవారు, 2శాతం అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనవారున్నారని గుర్తించారు. 5శాతం కూలిపనికి వెళ్లామన్నారు. వీరితో పాటు ఎక్కువగా రవాణా వాహనాల డ్రైవర్లు, ఆటోడ్రైవర్లు ఉన్నారు. ఈ క్రమంలో కార్మికశాఖ సమన్వయంతో వారికి సెలవు ఇచ్చేలా సంప్రదింపులు జరుపుతున్నారు. ఎండకు తట్టుకునేలా షెడ్లు, తాగునీటి సదుపాయం ఏర్పాటు చేస్తున్నారు.

పోల్‌ క్యూ రూట్‌ పోర్టల్‌.. చాలా మంది పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలైన్లను చూసి బెదిరిపోయి ఓటేసేందుకు మొహం చాటేస్తున్నారు. అందుకే ఎన్నికల సంఘం పోల్‌ క్యూ రూట్‌ పోర్టల్‌ను తీసుకొచ్చింది. నగరంలో మొదటిసారిగా పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటువేసే క్యూలైన్‌ వివరాలు తెలుసుకునేందుకు జీహెచ్‌ఎంసీ గత ఎన్నికల్లో ఈ పోర్టల్‌ సేవలను ప్రారంభించారు. జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌, మైజీహెచ్‌ఎంసీ యాప్‌ ద్వారా పోలింగ్‌కేంద్రాల వద్ద క్యూలైన్‌ వివరాలను తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. లక్ష మందికి పైగా వినియోగించుకున్నారు. ప్రస్తుత లోకసభ ఎన్నికలకు ఈ పోర్టల్‌ సేవలు అందుబాటులో ఉంటాయని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్‌రాస్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌ లేదా యాప్‌లో పోల్‌ క్యూలైన్‌ పోర్టల్‌ ఎంపిక చేసుకోవాలి. నియోజకవర్గం, పోలింగ్‌స్టేషన్‌ వివరాలు నమోదుచేసి సెర్చ్‌ ఆప్షన్‌ ఎంచుకుంటే లైన్‌లో వేచి ఉండాల్సిన సమయం చూపిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు