logo

సాంకేతిక ఉత్సవం.. విద్యార్థుల నైపుణ్యం

జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ విద్యార్థులు సాంకేతిక నమూనాలతో సత్తాచాటారు. సోమవారం వర్సిటీలో రెండురోజుల సాంకేతిక ఉత్సవాల ప్రారంభం సందర్భంగా వివిధ విభాగాల్లో విద్యార్థులు ఏర్పాటుచేసిన నమూనాలు వారిలోని సాంకేతిక పరిజ్ఞానాన్ని చాటాయి.

Published : 23 Apr 2024 04:05 IST

నమూనాలతో సత్తాచాటిన జేఎన్‌టీయూ విద్యార్థులు   

కూకట్‌పల్లి, న్యూస్‌టుడే: జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ విద్యార్థులు సాంకేతిక నమూనాలతో సత్తాచాటారు. సోమవారం వర్సిటీలో రెండురోజుల సాంకేతిక ఉత్సవాల ప్రారంభం సందర్భంగా వివిధ విభాగాల్లో విద్యార్థులు ఏర్పాటుచేసిన నమూనాలు వారిలోని సాంకేతిక పరిజ్ఞానాన్ని చాటాయి. సృజనాత్మకతకు అద్దంపట్టేలా.. సరికొత్త ఆలోచనలతో ఏర్పాటుచేసిన నమూనాలు ఆకట్టుకున్నాయి. వివిధ బ్రాంచ్‌లలో ఏర్పాటుచేసిన వాటి గురించి తెలుసుకుందాం.

సర్వింగ్‌ రోబో.. బాగుంది

ఈసీఈ ద్వితీయ ఏడాది విద్యార్థినులు నందిని, మేఘన, శ్రీనిధి, నేషిత సర్వింగ్‌ రోబో నమూనా ఏర్పాటుచేశారు. ఎవరైనా సులువుగా వినియోగించేలా సిద్ధం చేశారు. ఇందులోనే చిన్నపాటి ట్యాంకు ఏర్పాటుచేయడంతోపాటు  రోబో వద్ద గ్లాసు పెడితే ఆటోమేటిగ్గా తాగునీటిని నింపుతుంది.

భూకంపమొచ్చినా భవనాలకు ఢోకా లేదు

భూకంపాలకు తట్టుకొని నిలబడేలా భవనాల నిర్మించే పరిజ్ఞానం గురించి సిస్మిక్‌ రెసిస్టెంట్‌ బిల్డింగ్‌ నమూనాతో నిరూపించారు.. సివిల్‌ మూడో ఏడాది విద్యార్థులు అక్షయ్‌కుమార్‌, హరిచంద్‌, గౌతం, యశ్వంత్‌, శివకృష్ణ. తైవాన్‌లో హెవీ మాస్‌ ట్యూన్డ్‌ డాంపర్‌ వినియోగం ద్వారా భూకంపాలను తట్టుకొని నిలబడిన భవనాల ఆధారంగా వీరు ఈ నమూనా రూపొందించారు.

బృహదీశ్వర దేవాలయం.. ఒక అద్భుతం

తంజావూర్‌ బృహదీశ్వర ఆలయ నిర్మాణ పరిజ్ఞానంపై సివిల్‌ ఐడీపీ తొలి ఏడాది విద్యార్థులు హరిత, ధ్రువిత, పూజిత, లత, రోషిత వివరించారు. సిమెంటు, ఇసుక లేకుండా గ్రానైట్‌తో నిర్మించిన ఇదో అద్భుతమని వివరించారు.

వరదలకు అడ్డుకట్ట.. ఇలా వేయొచ్చు ఎంచక్కా

సివిల్‌ మూడో ఏడాది విద్యార్థులు సాకేత్‌, నవీన్‌, వేణు, రిషిత్‌, విజయ్‌రాజ్‌ సెల్ఫ్‌ క్లోజింగ్‌ ఫ్లడ్‌ బారియర్‌ నమూనాతో ఆలోచింపజేశారు. నెదర్లాండ్స్‌లో ఇదే తరహా యంత్రాలతో వరదలను నివారించడంలో విజయం సాధించారని వివరించారు. ఆ పరిజ్ఞానాన్ని వినియోగించి మన దేశంలో వరదల నివారణకు వినియోగించేలా అల్యూమినియం ఫ్లోటింగ్‌ వాల్వ్‌తో తయారుచేశారు.  

చిత్రం, పేరు ఏదైనా సరే.. ఇట్టే గీసేస్తుంది

ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా మనిషి చిత్రం లేదా పేరు ఇలా ఏదైనా సరే ఇట్టే కాగితంపై అందంగా గీసే పెన్‌ప్లాటర్‌ నమూనాను ఈసీఈ ద్వితీయ ఏడాది విద్యార్థులు వేద, శశాంత్‌, హేమంత్‌, దివ్య, అనూహ్య, నితిన్‌ ఏర్పాటు చేశారు.

చంద్రయాన్‌-3.. అవగాహన భేష్‌

ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-3 నమూనాను జేఎన్‌టీయూ ఈసీఈ మొదటి విభాగం విద్యార్థులు గగన్‌, అభినవ్‌, శరవన్‌, మహేశ్‌ తయారు చేసి అవగాహన కల్పించారు. సెన్సార్స్‌, కెమెరాలు ఏర్పాటుచేసి వైఫై ద్వారా సెల్‌ఫోన్లతో ఆపరేట్‌ చేసి అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత ఫొటోలు ఎలా తీస్తుందన్నది చక్కగా వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని