logo

గుడిలో ఆభరణాల చోరీ కేసులో ముగ్గురి రిమాండ్‌

ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో పంచలోహ విగ్రహాలు, బంగారు ఆభరణాల చోరీ కేసులో నిందితుడు సహా మరో ఇద్దరిని చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Published : 23 Apr 2024 04:09 IST

రాంనగర్‌, న్యూస్‌టుడే: ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో పంచలోహ విగ్రహాలు, బంగారు ఆభరణాల చోరీ కేసులో నిందితుడు సహా మరో ఇద్దరిని చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలను సోమవారం ఠాణా ఆవరణలో ఏసీపీ రమేష్‌కుమార్‌ వెల్లడించారు. గాంధీ ఆసుపత్రి ఎదుట కాలిబాటపై నివసిస్తున్న రాజశేఖర్‌(20) జల్సాలకు అలవాటు పడి.. ద్విచక్ర వాహనాలను దొంగిలించి విక్రయించేవాడు. అతడిపై నగరంలోని అఫ్జల్‌గంజ్‌, వరంగల్‌ మట్టెవాడ ఠాణాల్లోనూ గతంలో కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 9న అర్ధరాత్రి ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన రాజశేఖర్‌.. గుడి తాళం పగులగొట్టి ఆరు పంచలోహ విగ్రహాలు, 8.5 తులాల స్వర్ణాభరణాలను దోచుకెళ్లాడు. సీసీఫుటేజీలను పరిశీలించిన పోలీసులు, ఆయా విగ్రహాలు కొనుగోలు చేసినట్లు గుర్తించి భోలక్‌పూర్‌కు చెందిన మహ్మద్‌ ఆసిఫ్‌(28), ఇస్మాయిల్‌ హుస్సేన్‌(23)లను అదేనెల 23న అరెస్ట్‌చేశారు. విగ్రహాలు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. రాజశేఖర్‌ కోసం అప్పటినుంచి గాలిస్తున్నారు. సోమవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో వాహనాల తనిఖీ వేళ.. అనుమానాస్పదంగా కన్పించడంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. గుడిలో దొంగింలించిన బంగారు ఆభరణాలను భోలక్‌పూర్‌కు చెందిన మొహినుద్దీన్‌(23), ఖలీద్‌ అహ్మద్‌(31)లకు విక్రయించినట్లు చెప్పాడు. వారిని సైతం అదుపులోకి తీసుకొని ఆభరణాలు, 3 బైక్‌లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.


కట్టుకున్నోడిని వదిలేసి.. కపట మాటలు నమ్మేసి

 మోసపోయిన మహిళ ఆత్మహత్య

తోయాజాక్సి

పటాన్‌చెరు అర్బన్‌, న్యూస్‌టుడే: పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో భర్తకు విడాకులిచ్చి రాగా మాటిచ్చిన వ్యక్తి మోసం చేయడంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. పటాన్‌చెరు పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా మందస మండలం మకరజోలకు చెందిన తోయాజాక్సి(25) పటాన్‌చెరు మండలం పాశమైలారంలో ఓ పరిశ్రమలో హెచ్‌ఆర్‌గా పనిచేస్తుంది. ఇస్నాపూర్‌లో ప్రైవేటు వసతిగృహంలో ఉంటుంది. 2021లో ఇదే జిల్లాకు చెందిన విజయ్‌తో వివాహమైంది. అదే జిల్లా సువర్ణపురానికి చెందిన కిరణ్‌కుమార్‌ ‘నిన్ను ప్రేమించాను.. నీ భర్తకు విడాకులు ఇచ్చి వస్తే పెళ్లి చేసుకుంటాను’ అని రోజు ఫోన్‌ చేస్తూ, మెసేజ్‌లు పెట్టేవాడు. ఇది నమ్మిన తోయాజాక్సి తన భర్త విజయ్‌కు 2023 డిసెంబర్‌లో విడాకులిచ్చింది. తరువాత పెళ్లి చేసుకోమని కిరణ్‌కుమార్‌ను అడగ్గా ఇంట్లో వాళ్లు ఒప్పుకోవటం లేదు.. తనకు వేరే అమ్మాయితో పెళ్లి కుదిరిందని మాట మార్చాడు. దీంతో ఈనెల 20న గుర్తుతెలియని పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆమె సహోద్యోగి ఆసుపత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. కిరణ్‌కుమార్‌ పెళ్లి చేసుకుంటానని మోసం చేసినందుకే ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


మహిళలను వేధిస్తున్న నలుగురికి జైలు

ఈనాడు, హైదరాబాద్‌: మహిళలను వేధిస్తున్న నలుగురిని షీటీమ్స్‌ బృందాలు పట్టుకున్నట్లు నగర మహిళా భద్రత విభాగం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచగా రెండు రోజుల జైలుశిక్ష, రూ.250 జరిమానా విధిస్తూ ఆదేశాలిచ్చినట్లు వివరించింది. మహిళల భద్రత, చిన్నారులపై లైంగిక వేధింపులు, సైబర్‌ నేరాల నియంత్రణపై నగరంలోని బస్తీలు, వివిధ ప్రాంతాల్లో కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహిస్తున్నట్లు వివరించింది.


సంపులో పడి యువకుడి మృతి ఘటనలో యజమానిపై కేసు

రాయదుర్గం, న్యూస్‌టుడే: నీటి సంపులో పడి ప్రైవేటు ఉద్యోగి మృతిచెందిన ఘటనలో పీజీ (పెయింగ్‌ గెస్ట్‌) హాస్టల్‌ యజమానిపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ వెంకన్న వివరాల ప్రకారం.. భద్రాచలం జిల్లా ఇల్లెందుకు చెందిన అక్మల్‌ సుఫియాన్‌(26) గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని షణ్ముఖ్‌ మెన్స్‌ పీజీ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఆదివారం ఉదయం 10.30కు జిమ్‌కు వెళ్లి వచ్చి భవనం పార్కింగ్‌లో ఉన్న మూత తెరిచి ఉన్న సంపులో పడి మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన గేటు నుంచి మూడు అడుగులు నడిచి ముందుకొచ్చే క్రమంలో 12 సెకన్లలోనే సంపులో పడినట్లు సీసీ కెమెరాల్లోని ఫుటేజీలో కనిపించింది.


జల్సాలతో నేరాల బాట.. ముగ్గురు యువకుల అరెస్టు

స్వాధీనం చేసుకున్న వస్తువులు

నల్లకుంట, న్యూస్‌టుడే: జల్సాల కోసం ప్రజలను భయపెట్టి చోరీలు చేస్తున్న ముగ్గురు పాత నేరస్థులు బోరబండకు చెందిన కల్మేరా రమేష్‌(19), ఎర్రగడ్డకు చెందిన పెండాల వెంకటస్వామి(21), కమ్మగోని కార్తిక్‌గౌడ్‌(19)ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం నల్లకుంట పోలీస్‌స్టేషన్‌లో ఓయూ ఏసీపీ జగన్‌ వెల్లడించారు. వీరు పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చారు. ద్విచక్రవాహనాల చోరీతోపాటు ఒంటరిగా బస్టాపుల్లº, ఆటోల్లో నిద్రించేవారిని కత్తులతో బెదిరించి నగదు, నగలు లాక్కెళ్లేవారు. ఈనెల 21న ఎస్సై కృష్ణ బృందం వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 3 ద్విచక్ర వాహనాలు, 4 చరవాణులు, కత్తి, బ్లేడు, త్రిశూలం స్వాధీనం చేసుకుని సోమవారం రిమాండుకు తరలించినట్లు ఏసీపీ వెల్లడించారు. నల్లకుంట సీఐ జగదీశ్వర్‌రావు, లాలాగూడ సీఐ రమేష్‌గౌడ్‌, ఎస్సైలు కృష్ణ, నాగరాజు, శ్రీనివాస్‌, రమాదేవి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు