logo

ప్రతిదానికీ ఓ లెక్కుంది..!

ఫలితాల వరకు ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

Updated : 23 Apr 2024 05:25 IST

 ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చులపై నిఘా
 నామినేషన్‌ తేదీ నుంచి

 ఫలితాల వరకు ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థుల ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా సమానవకాశాలు కల్పించడం కోసం ఎన్నికల ప్రచార ఖర్చులపై ఎన్నికల సంఘం వ్యయ పరిమితిని విధించింది. నామినేషన్‌ మొదలు ఫలితాలు వచ్చేవరకు అభ్యర్థులు పెట్టే ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటుంది. వ్యయాలపై ఎన్నికల పరిశీలకుల నిఘా ఉంటుంది. ఇదివరకు లోక్‌సభ ఎన్నికల్లో వ్యయ పరిమితి రూ.70 లక్షలు ఉండగా.. ఈసారి దాన్ని రూ.95 లక్షలకు పెంచింది.  

రోజువారీ నమోదు.. అభ్యర్థులు నామినేషన్‌ నుంచి ఫలితాలు వచ్చే వరకు ప్రచార నిమిత్తం రోజువారీ పెట్టే ఖర్చుల వివరాలను పక్కాగా నమోదు చేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. ప్రచారానికి ఉపయోగించే వాహనాల అద్దె, హోర్డింగ్‌లు, క్లాత్‌ బ్యానర్లు, పోడియం, ప్రచార రథాలు, ద్విచక్రవాహనాల అద్దె, హోటల్‌ ఛార్జీలు, కూలర్‌లు, పవర్‌ జనరేటర్‌లు, లైటింగ్‌ ఛార్జీలు, బిగ్‌ సైజ్‌ బెలూన్లు, కళా బృందాలు, ఫంక్షన్‌ హాళ్లు, ఎల్‌ఈడీ తెరలు, మైకులు, టీవీలు, రేడియోలు, సోషల్‌ మీడియా ప్రకటనలకు, కండువాలు, జెండాలు, టోపీలు, స్నాక్స్‌, భోజనాలు, షామియానాతోపాటు డ్రైవర్లకు ఇచ్చే జీతాలను ఆయా ప్రాంతాలను బట్టి నిర్ధారించారు. వీటి ఆధారంగా ప్రచారానికి చేసే ఖర్చులను అభ్యర్థుల వ్యయంగా లెక్కిస్తారు. నామినేషన్‌ వేయడానికి ముందు తెరిచిన బ్యాంకు ఖాతాలో అభ్యర్థుల ఎన్నికల లావాదేవీలను నమోదు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులంతా వ్యయ ప్రకటనలను ఎన్నికలు ముగిశాక ఈసీకి సమర్పించాలి.

నిఘా బృందాల పర్యవేక్షణ..

అభ్యర్థుల ప్రచార ఖర్చులను పర్యవేక్షించడానికి ఈసీ నియమించిన వ్యయ పరిశీలకులతోపాటు రాష్ట్ర, కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంస్థలు రంగంలోకి దిగాయి. ఇందులో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, స్టాటిక్‌ సర్వేలెన్స్‌, వీడియో సర్వేలెన్స్‌, వీడియో వీవింగ్‌ బృందాలు ఉన్నాయి. మరోవైపు అభ్యర్థుల వెంట షాడో బృందాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఐఏఎస్‌, ఐపీఎస్‌ క్యాడర్‌కు చెందిన వారిని సాధారణ, ఐఆర్‌ఎస్‌, ఐడీఏఎస్‌ అధికారులను వ్యయ పరిశీలకులుగా ఈసీ నియమిస్తుంది. వీరు సంబంధిత లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మూడుసార్లు పర్యటించి.. అభ్యర్థుల వ్యయాలను నిశితంగా పరిశీలిస్తారు. సభలు, సమావేశాలు, ప్రచారం కోసం సమకూర్చిన కుర్చీలు, షామియానా, వాహనాలు, ఇతర సామగ్రిని వీడియోలో చిత్రీకరిస్తున్నారు. వీడియోలో చిత్రీకరించిన దానికి, అభ్యర్థులు నివేదించిన ఖర్చులకు వ్యత్యాసం ఉంటే నోటీసులు జారీ చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని