logo

రూ.కోటి వజ్రాభరణాలు మాయం

శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు క్యాబ్‌లో ఓ వృద్ధురాలు బయల్దేరగా ఆమెకు సంబంధించిన రూ.కోటి విలువైన వజ్రాభరణాలు మాయమయ్యాయి. వాటిని క్యాబ్‌ డ్రైవరే తస్కరించాడని బాధితులు ఫిర్యాదు చేశారు. గత నెల 20న చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Updated : 18 May 2024 02:13 IST

క్యాబ్‌ డ్రైవర్‌ తస్కరించాడని బాధితుల ఫిర్యాదు

శంషాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు క్యాబ్‌లో ఓ వృద్ధురాలు బయల్దేరగా ఆమెకు సంబంధించిన రూ.కోటి విలువైన వజ్రాభరణాలు మాయమయ్యాయి. వాటిని క్యాబ్‌ డ్రైవరే తస్కరించాడని బాధితులు ఫిర్యాదు చేశారు. గత నెల 20న చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం ఆర్జీఐఏ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌కు చెందిన వృద్ధురాలు(62) బెంగళూరులో నివాసం ఉంటున్న తన కుమార్తె వద్దకు వెళ్లారు. తిరిగి హైదరాబాద్‌కు వస్తున్న క్రమంలో రూ.కోటి విలువైన మూడు వజ్రాల నెక్లెస్‌లు, మూడు జతల వజ్రాల చెవిదుద్దులను సూట్‌కేసులో పెట్టుకుని తాళం వేయకుండానే విమానం ఎక్కి శంషాబాద్‌కు వచ్చారు. విమానాశ్రయంలో ఓ ప్రీపెయిడ్‌ ట్యాక్సీని బుకింగ్‌ చేసుకుని హైదరాబాద్‌లోని నివాసానికి చేరుకున్నారు. తాళం వేయని సూట్‌కేసు, సామగ్రిని కారు డిక్కీలో పెట్టిన ట్యాక్సీ డ్రైవర్‌ ఆ విషయాన్ని గమనించి మార్గమధ్యలో వాహనాన్ని నిలిపాడు. కారును శుభ్రం చేస్తున్నట్లు నటించి సూట్‌కేస్‌లో ఉన్న వజ్రాభరణాల సంచిని తస్కరించాడు. తర్వాత ఏమీ తెలియనట్లు వృద్ధురాలిని ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయాడు. గురువారం కుటుంబసభ్యులు వజ్రాభరణాల కోసం సూట్‌కేస్‌లో వెతకగా అవి లేవు. వాటిని క్యాబ్‌ డ్రైవరే తస్కరించాడంటూ బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని