logo

చిరునామాల్లో ఉండరు.. దేనికీ స్పందించరు

సేవాలోపాలకు పాల్పడుతున్న సంస్థల చిరునామాలపై స్పష్టత కొరవడటంతో లీగల్‌ నోటీసులు ఎక్కడికి పంపాలన్న ప్రశ్నలు ఫిర్యాదుదారుల్లో తలెత్తుతున్నాయి. జిల్లా వినియోగదారుల కమిషన్లకు  ఫిర్యాదులు చేసినా అవి విచారణ వరకు వెళ్లడం లేదు.

Updated : 18 May 2024 03:47 IST

‘ప్రూఫ్‌ ఆఫ్‌ ఫైలింగ్‌’ ఉంటేనే విచారణ

ఈనాడు, హైదరాబాద్‌: సేవాలోపాలకు పాల్పడుతున్న సంస్థల చిరునామాలపై స్పష్టత కొరవడటంతో లీగల్‌ నోటీసులు ఎక్కడికి పంపాలన్న ప్రశ్నలు ఫిర్యాదుదారుల్లో తలెత్తుతున్నాయి. జిల్లా వినియోగదారుల కమిషన్లకు  ఫిర్యాదులు చేసినా అవి విచారణ వరకు వెళ్లడం లేదు. దీంతో బాధితులు పరిహారం లభించక నష్టపోతున్నారు. స్పష్టత లేని వివరాలతో నోటీసులు పంపినా అవి ప్రతివాదులకు చేరక తిరిగొస్తుండటంతో ఫిర్యాదుదారులే నేరుగా నోటీసులు అందించి ‘ప్రూఫ్‌ ఆఫ్‌ ఫైలింగ్‌’ సమర్పించాలని కమిషన్లు ఆదేశిస్తున్నాయి.

ఆన్‌లైన్‌లోనూ ఇబ్బందులే.. ఊరు, చిరునామా లేని వెబ్‌సైట్లతోనూ చిక్కులు తప్పడం లేదు. విమాన ప్రయాణాలకు రాయితీలు...విహార యాత్రల్లో అందుబాటు ధరల్లో ఉండేహోటళ్లు, రెస్టారెంట్లు చూపిస్తామని ప్రకటిస్తూ కేటుగాళ్లు వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్నారు. వాటితో సమస్య ఎదురైతే మాత్రం వెబ్‌సైట్‌లో పేర్కొన్న చిరునామాల వద్ద ఆఫీసులుండవు. మెయిల్‌ చేసినా పట్టించుకోరు. నోటీసు పంపాలన్నా ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
‘‘ముషీరాబాద్‌కు చెందిన ఎస్‌.కిషోర్‌కుమార్‌  సిక్కింలోని ప్యాక్యాంగ్‌ వెళ్లేందుకు ‘వయా.కామ్‌’ వెబ్‌సైట్‌ ద్వారా స్పైస్‌జెట్‌ విమానంలో టికెట్లు బుక్‌ చేశారు. చివరి నిమిషంలో ప్రయాణం రద్దయినట్లు సమాచారం రావడంతో రీఫండ్‌ కోసం స్పైస్‌జెట్‌ సిబ్బందిని అడిగారు. ఆ డబ్బు వయా.కామ్‌ ద్వారా వస్తుందని చెప్పడంతో ఆ వెబ్‌సైట్‌ సిబ్బందికి మెయిల్‌ చేసినా స్పందన రాలేదు. వెబ్‌సైట్‌లో ఆఫీసు సికింద్రాబాద్‌లో ఉన్నట్లు తెలపగా.. అక్కడికి వెళ్తే ఆ ఆఫీసు లేదంటూ చుట్టుపక్కలవారి నుంచి సమాధానమొచ్చింది’’


నోటీసులు తీసుకోకుండా ప్రలోభాలు

- ఆర్యవర్ధన్, సామాజిక కార్యకర్త

మద్యం షాపులు, వైన్స్‌ల నిర్వాహకులు ఎమ్మార్పీ మోసాలకు పాల్పడుతున్నారు. సాక్ష్యాలను సేకరించి 150 కేసులు వినియోగదారుల కమిషన్లలో నమోదు చేశాం.  కొందరు నిర్వాహకులు నోటీసుల నుంచి తప్పించుకోవడానికి అక్కడ ఉండటం లేదని చెప్పిస్తున్నారు. పోస్ట్‌మ్యాన్లను ప్రలోభాలకు గురిచేసి నోటీసులను తిప్పి పంపుతున్నారు. దీంతో కమిషన్లు ప్రూఫ్‌ ఆఫ్‌ ఫైలింగ్‌కు ఆదేశిస్తున్నాయి. 150 కేసుల్లో 8 కేసులకు ప్రూఫ్‌ ఆఫ్‌ ఫైలింగ్‌ చేయాలని హైదరాబాద్‌ జిల్లా కమిషన్‌ ఆదేశించింది. సమగ్ర వివరాలతో పత్రికా ప్రకటన ఇస్తే కేసు విచారణను కొనసాగించే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని