logo

ఆన్‌లైన్‌ ఆర్డర్లతో హెరాయిన్‌ రవాణా

ఆన్‌లైన్‌ ద్వారా హెరాయిన్‌ సరఫరా చేస్తున్న ముఠాలోని ఓ నిందితుడిని ఎల్బీనగర్‌ పోలీసులు అరెస్టుచేశారు. నిందితుడి వద్ద రూ.4లక్షల విలువైన 33 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Published : 18 May 2024 02:07 IST

నిందితుడి అరెస్టు

నాగోలు, న్యూస్‌టుడే: ఆన్‌లైన్‌ ద్వారా హెరాయిన్‌ సరఫరా చేస్తున్న ముఠాలోని ఓ నిందితుడిని ఎల్బీనగర్‌ పోలీసులు అరెస్టుచేశారు. నిందితుడి వద్ద రూ.4లక్షల విలువైన 33 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్‌లోని సంచార్‌ జిల్లా సర్వన గ్రామానికి చెందిన దినేష్‌కుమార్‌(20) నాలుగు నెలల కిందట నగరానికి వచ్చాడు. ఎల్బీనగర్‌ సమీపంలోని సెంట్రల్‌ బ్యాంక్‌ కాలనీలో ఉంటూ స్టీలు రెయిలింగ్‌కు చెందిన వెల్డింగ్‌ పనులు చేస్తున్నాడు. స్వస్థలం నుంచి వచ్చిన ఇతని సోదరుడు సురేష్‌తో పాటు దినేష్‌ కల్యాణ్‌, మనోజ్‌ బిష్ణోయ్‌, భన్వర్‌లాల్‌లతో జతకట్టాడు. వీరంతా డ్రగ్స్‌కు అలవాటుపడిన కస్టమర్ల నుంచి ఆన్‌లైన్‌లో ఆర్డర్లు తీసుకుని హెరాయిన్‌ సరఫరా చేస్తున్నారు. తరచూ రాజస్థాన్‌కు వెళ్లి హెరాయిన్‌ తీసుకువస్తున్న దినేష్‌కుమార్‌.. ఒక్కో గ్రాము చొప్పున ప్యాకెట్లలో నింపి వాటిని స్టీలు పైపుల్లో ఉంచి కనిపించకుండా రోలింగ్‌ కవర్‌తో ప్యాక్‌ చేస్తున్నాడు. రాజస్థాన్‌లోనే ఉంటున్న మిగతా నలుగురూ హైదరాబాద్‌కు చెందిన కస్టమర్లతో ఆన్‌లైన్‌ ద్వారా లావాదేవీలు జరుపుతున్నారు. వారు పంపుతున్న కస్టమర్‌ లొకేషన్‌కు దినేష్‌కుమార్‌ హెరాయిన్‌ ప్యాకెట్లను తరలిస్తున్నాడు. ఈ పైపులేంటని ర్యాపిడో వాహనదారు అడిగినా.. కస్టమర్లకు శాంపిల్‌ పైపులు పంపుతున్నానని చెప్పేవాడు. వీరి వ్యవహారం తెలుసుకున్న ఎల్బీనగర్‌ పోలీసులు నిఘా ఉంచారు. గురువారం సాయంత్రం 4 గంటలకు దినేష్‌కుమార్‌ మన్సూరాబాద్‌కు బైక్‌పై వెళుతుండగా నాగోలు సమీపంలోని ఆనంద్‌నగర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బైక్‌ ట్యాంక్‌ కవరులో స్టీలు పైపుల్లో దాచిన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని