logo

లక్ష ప్రయాణికులు లక్ష్యం

హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్ట్‌పై మరోసారి చర్చ మొదలైంది. ఆర్టీసీలో మహిళలకు ప్రభుత్వం ఉచిత ప్రయాణ పథకం ప్రారంభించిన తర్వాత మెట్రోలో 40 వేల మంది ప్రయాణికులు తగ్గారని ఎల్‌అండ్‌టీ సంస్థ చెబుతోంది.

Published : 18 May 2024 02:11 IST

18-24 నెలల్లో పెరిగితే మెట్రోకు ఆర్థికంగా వెసులుబాటు
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ ప్రభావంతో 40 వేలు తగ్గిన వైనం

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్ట్‌పై మరోసారి చర్చ మొదలైంది. ఆర్టీసీలో మహిళలకు ప్రభుత్వం ఉచిత ప్రయాణ పథకం ప్రారంభించిన తర్వాత మెట్రోలో 40 వేల మంది ప్రయాణికులు తగ్గారని ఎల్‌అండ్‌టీ సంస్థ చెబుతోంది. 2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సగటున నిత్యం 4.4 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఈ సంఖ్య 5.5 లక్షలకు చేరితే మెట్రో ప్రాజెక్ట్‌ ఆర్థికంగా మెరుగవుతుంది. మరో లక్షకుపైగా ప్రయాణికుల సంఖ్య పెరగాల్సి ఉందని ఎల్‌అండ్‌టీ వర్గాలు పేర్కొన్నాయి. 

సర్కార్‌ ఇచ్చింది రూ.900 కోట్లు : కొవిడ్‌ సమయంలో మెట్రో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిందని.. సాఫ్ట్‌లోన్‌ ఇచ్చి ఆదుకోవాలని సర్కార్‌ను ఎల్‌అండ్‌టీ కోరింది. అప్పటి ప్రభుత్వం రూ.3 వేల కోట్ల వడ్డీ రహిత దీర్ఘకాల రుణం ఇస్తామని హామీ ఇచ్చింది. ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి రూ.900 కోట్లు వచ్చాయని.. మరో రూ.2100 కోట్లు రావాల్సి ఉందని ఎల్‌అండ్‌టీ సీఎఫ్‌వో ఆర్‌.శంకర్‌ రామణ్‌ తెలిపారు. రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధికి తమకు కేటాయించిన భూములను మానిటైజేషన్‌ చేసేందుకు సర్కారు అనుమతిచ్చిందని.. రాయదుర్గంలోని భూమిని గత ఆర్థిక సంవత్సరంలో మానిటైజ్‌ చేశామని చెప్పారు. 

రెండేళ్లు పట్టొచ్చు..: ప్రయాణికుల సంఖ్య 6 లక్షలకు చేరుకుని ప్రాజెక్ట్‌ ఆకర్షణీయంగా మారాలంటే ఒకటి, రెండేళ్లు పడుతుందని శంకర్‌ రామణ్‌ అన్నారు. 12 శాతం రాబడి వస్తే ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారన్నారు. అందుకు 18-24 నెలలు పడుతుందన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంతో ఈ లక్ష్యానికి చేరుకుంటామా.. లేదా.. అనే ఆందోళనను ఆయన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని