logo

ఈ‘నామ్‌కే’వాస్తే!

జిల్లాలో ఎలక్ట్రానిక్‌ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌( ఈనామ్‌)ఇంకా దేశ వ్యాప్తంగా విస్తరణ జరగలేదు. ఫలితంగా విపణుల్లో వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు రావడం లేదు. వివిధ రాష్ట్రాల విపణులకు అనుసంధానం జరిగితే, ఉత్పత్తులను వ్యాపారులు ఒకరికి తెలియకుండా ఒకరు ఆన్‌లైన్‌లో పోటీ పడి కొనుగోలు చేస్తారు.

Published : 18 May 2024 02:17 IST

తాండూరు విపణిలో అమలు కాని విధానం

న్యూస్‌టుడే, తాండూరు: జిల్లాలో ఎలక్ట్రానిక్‌ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌( ఈనామ్‌)ఇంకా దేశ వ్యాప్తంగా విస్తరణ జరగలేదు. ఫలితంగా విపణుల్లో వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు రావడం లేదు. వివిధ రాష్ట్రాల విపణులకు అనుసంధానం జరిగితే, ఉత్పత్తులను వ్యాపారులు ఒకరికి తెలియకుండా ఒకరు ఆన్‌లైన్‌లో పోటీ పడి కొనుగోలు చేస్తారు. ఈ పరిణామం రైతులకు ఆర్థికంగా లాభిస్తుంది. మార్కెట్లకు కూడా రుసుం రూపంలో ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

2016లో ప్రారంభమైనా..: ఖరీప్‌ సీజన్‌కు ముందు 2016లో కేంద్ర ప్రభుత్వం ఈనామ్‌ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 615 వ్యవసాయ మార్కెట్లను దీని పరిధిలో చేర్చింది. ఇందులో జిల్లా నుంచి తాండూరు విపణిని చేర్చారు. దశల వారీగా వికారాబాద్‌, పరిగి విపణులను చేర్చారు. గేట్‌ ఎంట్రీ, లాట్‌ నంబరు కేటాయింపు, బిడ్డింగ్‌ వంటి ప్రక్రియ చేపట్టేందుకు కంప్యూటర్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. విక్రయానికి తెచ్చిన ఉత్పత్తులను ఫ్లాట్‌ ఫారాలపై కుప్పగా పోయాలి. అధికారులు వాటి చిత్రాలు, వీడియోలు తీసి విపణులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దేశవ్యాప్త సర్వర్‌ ద్వారా అప్‌లోడ్‌ చేయాలి. నిర్ణీత సమయంలో కంప్యూటర్‌లో వీక్షించే వ్యాపారులు సరకును ఎంతకు కొనుగోలు చేస్తున్నారనే వివరాలను కోట్‌ చేస్తారు. బిడ్డింగ్‌ అనంతరం జరిగే డిక్లరేషన్‌లో ఏ వ్యాపారి ఎంత ధరకు ఏ సరకును కొనుగోలు చేశారనే విషయం తెలుస్తుంది. ఎక్కువ ధరకు కొనుగోలు చేసిన వ్యాపారులకు అధికారులు వారు సూచించిన చిరునామాకు పంపిస్తారు.

వ్యాపారుల పోటీతో: దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు పోటీ పడడం వల్ల రైతులు తాము ఆశించిన ధర కంటే ఎక్కువ ధర వస్తుంది. ఇదే సమయంలో వ్యాపారులు కొనుగోలు చేసిన ఉత్పత్తుల విలువలో ప్రతి రూ.100కు 1శాతం చొప్పున ఎక్కవ ఆదాయం విపణికి సమకూరుతుంది. అయితే విపణులను జాతీయ సర్వర్‌కు అనుసంధానం చేయకపోవడంతో, విపణుల పరిధిలోనే కొనుగోళ్లు జరుగుతున్నాయి. రైతుల నుంచి తక్కువ ధరకు కొన్న వ్యాపారులు,  ఎక్కువ ధరకు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసి లబ్ధిపొందుతున్నారు.

రూ.1200 కోట్లకు పైగా ఉత్పత్తుల విక్రయాలు: జిల్లాలోని పది వ్యవసాయ విపణుల పరిధిలో రైతులు ఏటా రూ.1200 కోట్లకు పైగా వ్యవసాయ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఇందులో కందులు, పెసలు, మినుములు, మొక్కజొన్నలు, వేరుసెనగ, శనగలు, పసుపు, వాము, సోయాబిన్‌, జొన్నలు, కుసుమ వంటి తదితర ఉత్పత్తులు ఉంటున్నాయి. విక్రయమైన ఉత్పత్తుల విలువలో రూ.800 కోట్లు తాండూరు, పరిగి, వికారాబాద్‌ విపణుల నుంచే ఉంటున్నాయి. రూ.100కు 1 శాతం చొప్పున మూడింటికి కలిపి రూ.8కోట్ల వరకు ఆదాయం వస్తోంది. అయితే ఈ-నామ్‌ పక్కాగా అమలైతే ఆదాయం రెట్టింపయ్యే అవకాశం ఉంది. ఈ-నామ్‌ విస్తరణ ఉన్నత స్థాయి అధికారులు తీసుకోవాల్సిన నిర్ణయమని తాండూరు వ్యవసాయ విపణి ప్రత్యేక శ్రేణి కార్యదర్శి రాజేశ్వరీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు