logo

హార్డ్‌వేర్‌ దుకాణంలో అగ్ని ప్రమాదం

వికారాబాద్‌ పట్టణం రామయ్యగూడ రోడ్డులోని నాగలక్ష్మి హార్డ్‌వేర్‌ దుకాణంలో  షార్ట్‌సర్క్యూట్‌తో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రూ.3 కోట్ల ఆస్తి అగ్నికి ఆహుతి కాగా, బీరువాలో దాచి ఉంచిన రూ.10 లక్షల నగదు కాలి బూడిదైందని భవన యజమాని తెలిపారు.

Published : 18 May 2024 02:18 IST

మంటల్లో చిక్కుకున్న ముగ్గురిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది

దుకాణంలో చెలరేగుతున్న మంటలు

వికారాబాద్‌, న్యూస్‌టుడే: వికారాబాద్‌ పట్టణం రామయ్యగూడ రోడ్డులోని నాగలక్ష్మి హార్డ్‌వేర్‌ దుకాణంలో  షార్ట్‌సర్క్యూట్‌తో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రూ.3 కోట్ల ఆస్తి అగ్నికి ఆహుతి కాగా, బీరువాలో దాచి ఉంచిన రూ.10 లక్షల నగదు కాలి బూడిదైందని భవన యజమాని తెలిపారు. మంటల్లో చిక్కుకున్న ముగ్గురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ధారూర్‌ మండలం నాగారానికి చెందిన నేనావత్‌ కృష్ణ సొంత భవనంలో ఎనిమిదేళ్ల నుంచి దుకాణంతో పాటు, పక్కనే గోదాం నిర్వహిస్తూ, అక్కడే నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి దుకాణం మూసి వేసి, అదే భవనంలో మొదటి అంతస్తులో కృష్ణ, సునీత దంపతులు ఉండగా, రెండో అంతస్తులో కృష్ణ తల్లి నాగిబాయి, కుమార్తెలు జయశ్రీ, శ్రీనిత్య ఉన్నారు. 3:30 గంటల ప్రాతంలో దుకాణంలో నుంచి దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన కృష్ణ దంపతులు వెళ్లి చూశారు. అప్పటికే మంటలు దుకాణమంతా వ్యాపించడంతో భయపడి కేకలు వేస్తూ బయటికి పరుగులు తీశారు. పొరుగున ఉన్న వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన వికారాబాద్‌ అగ్నిమాపకాధికారి వెంకటరమణారెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రెండో అంతస్తులో మంటల్లో చిక్కుకున్న చిన్నారులు, వృద్ధురాలిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. మంటలను ఆర్పివేశారు.

బాధిత కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న పురపాలక అధ్యక్షురాలు మంజుల

ఫోన్‌లోనే జాగ్రత్తలు..: అగ్నిమాపక అధికారి వెంకటరంగారెడ్డి నాగిబాయికి ఫోన్‌ చేసి.. స్నానాల గదిలోకి వెళ్లి షవర్‌ ఆన్‌ చేసి కింద పడుకోమ్మని, ధైర్యంగా ఉండాలని సూచించారు. సమాచారం తెలుసుకున్న వికారాబాద్‌ సీఐ నాగరాజు పోలీసు సిబ్బంది, పురపాలక అధ్యక్షురాలు మంజుల, రమేష్‌ దంపతులు అక్కడికి చేరుకున్నారు. పారిశుద్ధ్య పనులు చేస్తున్న సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పురపాలికకు సంబంధించిన యూజీడీ ట్యాంకర్‌, రెండు ట్యాంకర్లు, జేసీబీ యంత్రాన్ని తెప్పించి సహాయక చర్యలు వేగవంతం చేశారు. పరిగి నుంచి వచ్చిన మరో శకటాన్ని భవనం వెనుక భాగంలో నిలిపి ఉంచి, సిబ్బంది ల్యాడర్‌ సహాయంతో రెండో అంతస్తుకు చేరుకొని కిటికీ ద్వారా నాగిభాయి, చిన్నారులను  సురక్షితంగా కిందికి తీసుకొచ్చారు. మంటలు చుట్టు పక్కల ఉన్న ఇళ్లకు వ్యాపించకుండా రెండు అగ్ని మాపక శకటాలు, పురపాలికకు చెందిన రెండు ట్యాంకర్లు, ఇతర సిబ్బంది నాలుగు గంటలు శ్రమించడంతో అదుపులోకి వచ్చాయి. ప్రాణాలకు తెగించి మంటల్లో చిక్కుకున్న ముగ్గురిని రక్షించిన అగ్ని మాపక సిబ్బందిని ప్రజలు అభినందించారు. పురపాలిక అధ్యక్షురాలు మంజుల, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి రూ.25 వేల చొప్పున బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు.

చిన్నారిని రక్షిస్తున్న అగ్నిమాపక సిబ్బంది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని