logo

వాహనాలు ఇచ్చారు.. మరిచారు

మత్స్యకారుల సంక్షేమానికి గత ప్రభుత్వం 75శాతం రాయితీతో చేపలను రవాణా చేసేందుకు వాహనాలిస్తే.. అధికారుల పర్యవేక్షణలోపంతో కొందరు లబ్ధిదారులు వాటిని సొంత అవసరాలకు వినియో గించుకుంటున్నారు.

Updated : 18 May 2024 02:28 IST

మత్స్యకారులకు 75శాతం రాయితీ
లూనా, ఆటోలు, డీసీఎంల వినియోగంపై విజిలెన్స్‌ ఆరా
ఈనాడు,హైదరాబాద్‌, కీసర, న్యూస్‌టుడే

మత్స్యకారుల సంక్షేమానికి గత ప్రభుత్వం 75శాతం రాయితీతో చేపలను రవాణా చేసేందుకు వాహనాలిస్తే.. అధికారుల పర్యవేక్షణలోపంతో కొందరు లబ్ధిదారులు వాటిని సొంత అవసరాలకు వినియో గించుకుంటున్నారు. మేడ్చల్‌ జిల్లా మత్స్యశాఖ అధికారుల ఉదాసీనత కారణంగా రూ.5కోట్ల విలువైన వాహనాలకు జవాబుదారీతనం లేకుండా పోయింది. ఒక లబ్ధిదారుడు డీసీఎం తీసుకుని ఇతరులకు లీజుకు ఇచ్చారు. చేపలు తాజాగా ఉండేలా అందులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డీసీఎంతో పాటు లూనాలు, ఆటోలను కూడా కొందరు లబ్ధిదారులు వినియోగించుకోవడంతో పాటు లీజుకు ఇచ్చుకుంటున్నారు.

నిబంధనలు ఇలా: మత్స్యశాఖ రాయితీపై ఇచ్చిన వాహనాలను ఏడేళ్ల వరకూ సొంత అవసరాలకు వినియోగించకూడదు. ఏడేళ్ల వరకూ అధికారులు వాహనాలు తీసుకున్న లబ్ధిదారులు వాటితో ఏం చేస్తున్నారు? ఉపాధి అవకాశాలు పెంచుకున్నారా..? మార్కెటింగ్‌ సామర్థ్యం పెరిగిందా? లేదా..? అన్న అంశాలను పర్యవేక్షించాలి. క్షేత్రస్థాయిలో ఇందుకు భిన్నంగా జరిగింది. వాహనాల దుర్వినియోగంపై ఇటీవల విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు వివరాలను తీసుకున్నట్టు సమాచారం.

లీజుకు ఇచ్చారా? విక్రయించారా?...

మేడ్చల్‌ జిల్లాలోని చెరువుల్లో చేపలను హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు రవాణా చేసేందుకు కీసరలో ఒక లబ్ధిదారుడు ఐదేళ్ల క్రితం డీసీఎం వాహనాన్ని 75శాతం రాయితీతో పొందారు. చేపల్ని తాజాగా ఉంచేందుకు వీలుగా అందులో ఫ్రీజర్‌ తరహాలో పెట్టెలను ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. చెరువుల్లో ఉదయం, సాయంత్రం చేపలు పట్టిన వెంటనే డీసీఎంలోకి తరలించి హైదరాబాద్‌తో పాటు మేడ్చల్‌ జిల్లాలోని చేపల మార్కెట్లకు తరలించాలి. కొద్దినెలలు సజావుగా జరిగినా.. చెరువుల్లో చేపలు లేకపోవడంతో డీసీఎంను ఇతరులకు లీజుకు ఇచ్చారు.మేడ్చల్‌, కీసర, శామీర్‌పేట్‌ మండల్లాలో ఆటోలు తీసుకున్న లబ్ధిదారుల్లో కొందరు వాటిని లీజుకు ఇచ్చారు. ముగ్గురు, నలుగురు విక్రయించినట్టు తెలిసింది.

బెదిరించి మరీ లంచాల వసూళ్లు...!

లబ్ధిదారులకు మత్స్యశాఖ అధికారులకు వాహనాలు కేటాయించినప్పుడు కొందరు అధికారులు బెదిరించి మరీ లంచాలు వసూలు చేసుకున్నట్టు తెలిసింది. ప్రభుత్వం వీటిని అందించేప్పుడు పీపుల్స్‌ ప్లాజాలో కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమ నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేసినా కొందరు అధికారులు మాత్రం ఒక్కొక్కరి దగ్గర రూ.2వేల నుంచి రూ.5వేల వరకూ వసూలు చేశారు. లూనాకు రూ.10వేలు, ఆటోకు రూ.40వేలు, డీసీఎంకు రూ.60వేల చొప్పున వసూలు చేసుకున్నట్టు తెలిసింది. లబ్దిదారుల జాబితాను సేకరించిన విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం అధికారులు వారితో మాట్లాడి వివరాలను తీసుకున్నట్టు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని