logo

దేవుడా

గ్రేటర్‌ పరిధిలోని కొందరు ఆలయ అధికారుల తీరు ఆడింది ఆట...పాడింది పాటగా మారింది. ఆలయాలకు దాతలు ఇచ్చే విరాళాలు, ఖర్చులపై నిర్ధిష్టమైన లెక్కలు చూపడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Updated : 18 May 2024 03:50 IST

ఆలయాల్లో అధికారుల ఇష్టారాజ్యం
లెక్కలు చూపరు.. నివేదికలుండవు.. చర్యలు శూన్యం
ఈనాడు, హైదరాబాద్‌

గ్రేటర్‌ పరిధిలోని కొందరు ఆలయ అధికారుల తీరు ఆడింది ఆట...పాడింది పాటగా మారింది. ఆలయాలకు దాతలు ఇచ్చే విరాళాలు, ఖర్చులపై నిర్ధిష్టమైన లెక్కలు చూపడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖుల దర్శనాలు, పండగల సమయంలో ఖర్చులపై నిఘా లేకపోవడంతో అధికారులు ఇష్టానుసారం సున్నాలు చుట్టి జేబులు నింపుకొంటున్నారంటూ ఆరోపణలు వినవస్తున్నాయి. దీంతో దాతలు సమర్పించే కానుకలకు రక్షణ లేకుండా పోతోంది. ఆయా ఆలయ అధికారులపై ఫిర్యాదులొచ్చిన ప్రతిసారీ విచారణకు ఆదేశించామంటూ చెబుతున్న ఉన్నతాధికారులు నివేదికలను మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు.

రెజిమెంటల్‌బజార్‌లోని కాశీవిశ్వనాథ దేవాలయం (దర్జీగుడి)కి సంబంధించిన 65 బంగారు ఆభరణాలకు 106.007 గ్రా బంగారం ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇందులోనూ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలొచ్చాయి. ఉన్నతాధికారులు లాకర్‌ తెరిచి చూడగా 16 ఆభరణాలకు సంబంధించి 22.750గ్రా బంగారం మాత్రమే ఉన్నట్లు రెవెన్యూ, పోలీసు అధికారులు నివేదిక ఇచ్చారు. అయితే అప్పటి ఈవో ఇచ్చిన నివేదికకు, రెవెన్యూ అధికారుల నివేదికకు పొంతన లేదు. స్టాక్‌ రిజిస్టర్‌లో నమోదు చేయకుండా 500 చీరలను మాయం చేశారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.

ఉజ్జయినీ మహాకాళీ దేవాలయంలో అమ్మవారి నగల అంశంలో సిబ్బంది చేతివాటంపై ఆరోపణలు వెల్లువెత్తగా విచారణకు ఆదేశించిన దేవాదాయశాఖ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి నివేదికను బయటపెట్టలేదు. భక్తులు సమర్పించిన బంగారు ఆభరణాలు, కానుకలను లెక్కగట్టి గుడి రిజిస్టర్‌లో నమోదు చేయాలి. తర్వాత ఈవోలకు అందజేయాలి. 2006 వరకు అమ్మవారికి సుమారు 5కిలోల 473గ్రాముల 200మిల్లీగ్రాముల బంగారు ఆభరణాలున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. కానీ 2017లో ఓ ఈవో స్వాధీనం చేసుకున్న వాటి లెక్కలకు వ్యత్యాసం ఉందంటూ కొందరు ఆలయాల పరిరక్షణ సంస్థల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. అప్పట్లో దాదాపు 140 బంగారు ఆభరణాలు (5కిలోల 473గ్రాముల 200 మిల్లీగ్రాములు) ఉండగా...2017లో చూపించిన లెక్కల ప్రకారం 76 ఆభరణాలకు (2కిలోల 132గ్రామలు 94 మిల్లీగ్రాములు) సంబంధించిన వివరాలు పొందుపరచలేదంటూ ఫిర్యాదులు అందడంతో దేవాదాయశాఖ విచారణకు ఆదేశించింది. ఈ విషయంపై తమ వద్ద అన్ని ఆధారాలున్నాయంటూ ఫిర్యాదీదారులు చెబుతున్నారు. అయితే విచారణ పూర్తయి ఏళ్లు గడుస్తున్నా..నివేదికను బహిర్గతం చేయలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని