logo

జీహెచ్‌ఎంసీని ఎలా గట్టెక్కిస్తారు?

అప్పుల్లో కూరుకుపోయిన జీహెచ్‌ఎంసీని ఎలా గట్టెక్కించాలనే అంశమై పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌ శుక్రవారం సమీక్ష నిర్వహించారు.

Updated : 18 May 2024 03:48 IST

ఆదాయం పెంపు మార్గాలపై పీఎస్‌ దానకిశోర్‌ సమీక్ష

ఈనాడు, హైదరాబాద్‌: అప్పుల్లో కూరుకుపోయిన జీహెచ్‌ఎంసీని ఎలా గట్టెక్కించాలనే అంశమై పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన కార్యక్రమాలు, వేర్వేరు విభాగాల పనితీరు, ఏడాది కార్యాచరణ, వర్షాకాలంలో ముంపును ఎలా ఎదుర్కోవాలి, ట్రాఫిక్‌ సమస్య, రోడ్ల విస్తరణకు గల ఆటంకాలు, పరిష్కారం, ప్రజారోగ్యం, దోమల సమస్య, క్రీడలు, కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద క్రీడా వసతుల పెంపు, ఇతరత్రా అంశాలపై ఆయన బల్దియా కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌, అదనపు కమిషనర్లు, జోనల్‌ కమిషనర్లతో కలిసి సచివాలయంలో సుదీర్ఘంగా చర్చించారు. పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

ఆర్థిక పరిస్థితి మెరుగుపడేదెలా..?

జీహెచ్‌ఎంసీ ఆర్థిక పరిస్థితిని ఏ రకంగా మెరుగుపరుచుకుంటామనే అంశమై అధికారులు దానకిశోర్‌కు నివేదిక ఇచ్చారు. ‘‘నగరంలో 2007లో చివరిసారి ఆస్తిపన్ను విలువను పెంచారు. పునర్‌ మదింపు ద్వారా ఏటా కొంత ఆదాయం పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాదికి రూ.2,500 కోట్ల వసూలును లక్ష్యంగా పెట్టుకున్నాం. పన్ను విలువను పెంచితే ఆదాయం మరింత పెరుగుతుంది. ట్రేడ్‌ లైసెన్సుల రుసుము, ప్రకటనల విధానాల్లో మార్పుల ద్వారా మరికొన్ని నిధులను సమకూర్చుకోవచ్చు.’’అని జీహెచ్‌ఎంసీ అధికారులు వివరించారు.

ఇంజినీరింగ్‌ పనులపై..

ఎస్సార్డీపీ, ఎస్‌ఎన్‌డీపీ తదితర ప్రాజెక్టుల్లో భాగంగా చేపట్టిన పనులు ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నాయి, పురోగతిలో ఉన్న పనులను పూర్తి చేసేందుకు ఎన్ని నిధులు అవసరమో ఇంజినీర్లు దానికిశోర్‌కు తెలిపారు.అనంతరం కూడళ్ల సుందరీకరణ, రోడ్ల విస్తరణపై దానకిశోర్‌ వారికి సూచనలు చేశారు. రోడ్ల విస్తరణకు విద్యుత్తు స్తంభాలు ఎక్కడెక్కడ అడ్డుగా ఉన్నాయి, ఇతర సమస్యలపై ట్రాఫిక్‌ పోలీసులతో కలిసి క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలని, పోలీసుల సమన్వయంతో సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

నగరంలోని క్రీడా వసతులను మెరుగుపరచాలని, కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద మైదానాలు, స్పోర్ట్స్‌ కాంప్లెక్సులను దత్తత తీసుకునేందుకు సంస్థలను ఆహ్వానించాలని, ముందుకొచ్చిన సంస్థలతో మంచి ఫలితాలు రాబట్టాలని దానకిశోర్‌ బల్దియా కమిషనర్‌కు సూచించారు. పార్కులు, పచ్చదనం, డ్వాక్రా సంఘాలు, తదితర అంశాలపై ఆయన సమావేశంలో చర్చించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని