logo

ప్రీ లాంచ్‌ ఆఫర్ల పేరుతో టోకరా

కొంపల్లిలో ఖరీదైన ప్రాంతంలో రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్ల ప్రీ లాంచ్‌ ఆఫర్ల పేరుతో 350 మంది నుంచి రూ.60 కోట్ల వరకు వసూలు చేసి మోసగించిన ముగ్గురు మోసగాళ్లను సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Published : 19 May 2024 03:40 IST

350 మంది నుంచి రూ.60 కోట్ల వరకు వసూలు

రాయదుర్గం, న్యూస్‌టుడే: కొంపల్లిలో ఖరీదైన ప్రాంతంలో రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్ల ప్రీ లాంచ్‌ ఆఫర్ల పేరుతో 350 మంది నుంచి రూ.60 కోట్ల వరకు వసూలు చేసి మోసగించిన ముగ్గురు మోసగాళ్లను సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. డీసీపీ (ఈఓడబ్ల్యూ) కె.ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన దుప్పటి నాగరాజు ఛైర్మన్‌గా, మల్పూరి శివరామకృష్ణ ఎండీగా, తోడాకుల నరసింహారావు అలియాస్‌ పొన్నారి సీఈఓగా భారతి బిల్డర్స్‌ పేరుతో స్థిరాస్తి సంస్థ ఏర్పాటు చేశారు. ఆ సంస్థ పేరిట మాదాపూర్‌లో కార్యాలయాన్ని ప్రారంభించారు. కొంపల్లిలో 6.23 ఎకరాలను కొని.. ఆ స్థలంలో భారతి లేక్‌ వ్యూ పేరుతో అపార్ట్‌మెంట్స్‌ నిర్మించాలని ప్రణాళిక వేశారు. భారీఎత్తున కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ప్రీలాంచ్‌ ఆఫర్ల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేయాలని పథకం పన్నారు. రూ.3200కే చదరపు అడుగు (ఎస్‌ఎఫ్‌టీ) లెక్కన ఫ్లాట్‌లు విక్రయిస్తున్నట్లు ఆకర్షణీయమైన బ్రోచర్‌లు ముద్రించి ప్రచారం చేశారు. ఇందుకు ఛైర్మన్, ఎండీలు.. సీఈఓగా పొన్నారిని నియమించుకున్నారు. అతడూ వివిధ ప్రాంతాల్లో తిరిగి కొనుగోలుదారులను పెట్టుబడిపెట్టేలా చేశాడు. కొంపల్లి, మాదాపూర్‌లోని కార్యాలయాల్లో కొనుగోలుదారులతో సమావేశాలు నిర్వహించి మరింత నమ్మించారు. వారి మాటలు విశ్వసించిన బీవీఎస్‌ ప్రసాదరావుతోపాటు మరో 350 మంది ప్రీలాంచ్‌ పథకం కింద రూ.50-60కోట్ల వరకు చెల్లించారు. డబ్బులు వసూలు చేశాక ఎంతకీ భవనాలు నిర్మించకపోవడమేకాక ఫ్లాట్‌లు అందించడంలో విఫలమయ్యారు. వారు అభివృద్ధి చేయాలనుకున్న 6.23 ఎకరాల స్థలాన్ని రూ.100 కోట్లకు మరొకరికి విక్రయించారు. దీంతో బాధితులు ఈఓడబ్ల్యూ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇన్‌స్పెక్టర్‌ జె.వెంకటేశ్వర్లు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని