logo

అటవీ భూమి కేటాయింపులు సబబే

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఇమారత్‌ కంచ, సరూర్‌నగర్‌ మండలం మామిడిపల్లిలో అటవీ భూమిని అటవీయేతర అవసరాలకు ప్రభుత్వం కేటాయించడాన్ని హైకోర్టు సమర్ధించింది.

Published : 19 May 2024 03:41 IST

ప్రజాప్రయోజన వ్యాజ్యం కొట్టివేసిన హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఇమారత్‌ కంచ, సరూర్‌నగర్‌ మండలం మామిడిపల్లిలో అటవీ భూమిని అటవీయేతర అవసరాలకు ప్రభుత్వం కేటాయించడాన్ని హైకోర్టు సమర్ధించింది. డీనోటిఫై చేయకుండా ప్రైవేటు కంపెనీలకు కేటాయించడంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ఇమారత్‌ కంచలోని 4,067 ఎకరాల భూమిని 1966లో క్షిపణి పరీక్షల నిమిత్తం డిఫెన్స్‌కు రెండేళ్లకు లీజుకు ఇచ్చి, దాన్ని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చింది, మరో 4,067 ఎకరాలు మామిడిపల్లిలో గొర్రెల పెంపక క్షేత్రం కోసం 1972లో పశుసంవర్ధక శాఖకు అప్పగించారు. అటవీశాఖ భూమిని ఇతర అవసరాలకు వినియోగించడాన్ని సవాలు చేస్తూ ఫోరం ఫర్‌ బెటర్‌ హైదరాబాద్‌ అనే స్వచ్ఛంద సంస్థ హైకోర్టులో 2009లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టి తీర్పు ఇచ్చింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ భూముల్లో నిర్మాణాలు చేపట్టారని వాటిని కూల్చివేయాలని కోరారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ మహమ్మద్‌ ఇమ్రాన్‌ఖాన్‌ వాదనలు వినిపిస్తూ అటవీ సంరక్షణ చట్టం రాక ముందే భూ కేటాయింపులు జరిగాయి.. కాబట్టి అనుమతి అవసరం లేదన్నారు. ఆలస్యంగా దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతించొద్దన్నారు. ప్రైవేటు కంపెనీలు తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. తాము చట్టబద్ధంగా ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం నిజాం నుంచి అటవీ శాఖ కొనుగోలు చేసిన భూములను రిజర్వు ఫారెస్ట్‌గా నోటిఫై చేయలేదని పేర్కొంది. అటవీ సంరక్షణ చట్టం 1980లో వచ్చినందున అంతకుముందు జరిగిన కేటాయింపులకు కేంద్రం అనుమతి అవసరం లేదని.. ఈ విషయాన్ని కేంద్రమే స్పష్టం చేసిందని తెలిపింది. ప్రైవేటు కంపెనీలు సైతం భూమిని ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశాయని పేర్కొంది. అందువల్ల ఈ పిటిషన్‌లో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమంటూ కొట్టివేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని