logo

చెత్త కుప్పలు తొలగించేదెవరు?

ఎన్ని చర్యలు తీసుకున్నా పారిశుద్ధ్యం పట్టాలెక్కడం లేదు. నగరవ్యాప్తంగా 23 లక్షల ఇళ్లు ఉన్నాయని అంచనా. వాటన్నింటి నుంచి నిత్యం చెత్త సేకరణకు ప్రస్తుతం 4,500 స్వచ్ఛ ఆటోలున్నాయి.

Published : 19 May 2024 03:45 IST

చిరు వ్యాపారాలు,  సంతలతో 1,600 చోట్ల వ్యర్థాలు 

గోషామహల్‌లో ఏసీపీ కార్యాలయం వెనుక

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్ని చర్యలు తీసుకున్నా పారిశుద్ధ్యం పట్టాలెక్కడం లేదు. నగరవ్యాప్తంగా 23 లక్షల ఇళ్లు ఉన్నాయని అంచనా. వాటన్నింటి నుంచి నిత్యం చెత్త సేకరణకు ప్రస్తుతం 4,500 స్వచ్ఛ ఆటోలున్నాయి. ఇందులో 80 నుంచి 90 శాతం వాహనాలు మాత్రమే తిరుగుతున్నాయి. కొంతమ ంది వాహనదారులు విధులను అసంపూర్తిగా ముగించి మమ అనిపిస్తున్నారు. అనంతరం ప్రైవేటుగా హోటళ్లు, రెస్టారెంట్లు, వాణిజ్య, వ్యాపార కేంద్రాల వ్యర్థాలను సేకరిస్తుంటాయనే ఆరోపణలున్నాయి. పాతబస్తీ, మెహిదీపట్నం, టోలిచౌకి, ఖాజాగూడ, బోరబండ, బాలానగర్, సికింద్రాబాద్‌ చిలకలగూడ, సీతాఫల్‌మండి వంటి పేద, మధ్య తరగతి వారుండే ప్రాంతాల్లో మూడు, నాలుగు రోజులకోసారి చెత్త సేకరణ జరుగుతోంది. దీంతో రోడ్లపై 1,600 చెత్తకుప్పలు ఏర్పడుతున్నాయి.

రుసుముతోనూ సమస్యే.. సంపన్నులు ఉండే కాలనీల్లో నెలకు రూ.200, మధ్యతరగతి, పేదల బస్తీల్లో రూ.100 నుంచి రూ.150 తీసుకుంటున్నారు. రెండు, మూడు రోజులకోసారి వచ్చి చెత్త తీసుకెళ్లే ఆటోకు ప్రతినెలా డబ్బులు చెల్లించడానికి ఇళ్ల యజమానులు ఇబ్బంది పడుతున్నారు.

గోల్కొండ చోటా బజార్‌లో..


ఇలా చేయొచ్చు..

ప్రతి చెత్త కుప్పతో ఓ ఇల్లు లేదా వ్యాపార కేంద్రం ఇబ్బంది పడుతుంది. ఆయా ఇళ్ల యజమానులు లేదా వ్యాపార కేంద్రాలతో కలిసి జీహెచ్‌ఎంసీ నిఘా పెట్టొచ్చు. చెత్త వేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవచ్చు.

నగరంలో సుమారు 500 చోట్ల వారాంతపు సంతలు జరుగుతున్నాయి. సంత జరిగిన రోజున అక్కడ రెండు, మూడు టన్నుల చెత్త పోగవుతుంది. రోజూ తోపుడు బండ్లు, చిరు తిండ్లు విక్రయించే దుకాణాల వద్ద పోగయ్యే చెత్తను స్వచ్ఛ ఆటోలు సేకరించట్లేదనే మాటలు వినిపిస్తున్నాయి. దుకాణాల యజమానులు అడిగినంత డబ్బు ఇవ్వట్లేదనే కారణంతో వ్యర్థాల సేకరణకు నిరాకరిస్తున్నారు. ఆ చెత్తంతా వీధి చివర్లో కుప్పగా మారుతోంది. అలాంటి రోడ్డు మార్గాలు, ప్రాంతాలను గుర్తించి.. వ్యాపారుల నుంచి నేరుగా వ్యర్థాలను సేకరించేందుకు ప్రత్యేక వాహనాలను సమకూర్చవచ్చు. లేదా పారిశుద్ధ్య బాధ్యతల్లో భాగమైన రాంకీ సంస్థ వాహనాలను ఉపయోగించుకోవచ్చు.


ప్రైవేటు దిశగా.. 

మెజార్టీ ఆటోల యజమానులు జీహెచ్‌ఎంసీ ఆదేశాలను పాటించట్లేదని కేంద్ర కార్యాలయం భావిస్తోంది. రెండ్రోజుల క్రితం కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌.. జోనల్‌ కమిషనర్లు, అదనపు కమిషనర్, ఇతర ఇంజినీర్లతో నిర్వహించిన సమావేశంలో దీనిపై చర్చించారు. పనిచేయని స్వచ్ఛ ఆటోలను తొలగించి వాటి స్థానంలో ప్రైవేటు వాహనాలు అందుబాటులోకి తేవాలని అధికారులు అభిప్రాయపడ్డారు. చెత్త సేకరణను రాంకీ సంస్థకు అప్పగించాలనే అంశంపైనా చర్చించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని