logo

పర్యవేక్షణ శూన్యం.. ఇసుక మాయం

ప్రభుత్వ లక్ష్యానికి, ప్రజా ప్రయోజనానికి అనుగుణంగా నిర్మాణాలు సాగాలి. గుత్తేదారు దానికి తగినట్లుగా పనులు చేయాలి. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.

Published : 19 May 2024 03:52 IST

జాతీయ రహదారి నిర్మాణంలో గుత్తేదారు ఇష్టారాజ్యం 

గుత్తేదారు ఏర్పాటు చేసుకున్న రెడీమిక్స్‌ ప్లాంట్‌ వద్ద ఇసుక డంపు

న్యూస్‌టుడే, తాండూరు: ప్రభుత్వ లక్ష్యానికి, ప్రజా ప్రయోజనానికి అనుగుణంగా నిర్మాణాలు సాగాలి. గుత్తేదారు దానికి తగినట్లుగా పనులు చేయాలి. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ఇవేమీ సక్రమంగా లేనప్పుడు గుత్తేదారు ఇష్టారాజ్యం అవుతుంది. ప్రభుత్వ లక్ష్యం దూరం అవుతుంది. ఇందుకు ఉదాహరణగా.. జాతీయ రహదారి 1679 (ఎన్‌) నిర్మాణాన్ని పేర్కొనవచ్చు. వివరాల్లోకి వెళ్తే...

కొత్లాపూర్‌ నుంచి దుద్యాల వరకు 42.5 కిమీ. పొడవునా..

రాష్ట్ర సరిహద్దు తాండూరు మండలం కొత్లాపూరు గ్రామం నుంచి తాండూరు పట్టణం మీదుగా కొడంగల్‌ నియోజక వర్గం దుద్యాల వరకు 42.5 కిలో మీటర్ల పొడవునా జాతీయ రహదారి 1679 (ఎన్‌) వేగంగా నిర్మాణం జరుగుతోంది. 45 మీటర్ల వెడల్పుతో సాగుతున్న నాలుగు వరుసల రహదారి మార్గంలో 115 కల్వర్టులు ఉన్నాయి. వీటిని పటిష్ఠంగా నిర్మించడానికి కీలకమైన ఇసుక ఎంతో ముఖ్యం. ఈమేరకు ప్రభుత్వం గుత్తేదారుకు 60వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను కేటాయించింది. రహదారి నిర్మాణం చేపడుతున్న గుత్తేదారు యాలాల మండలం బెన్నూరు గ్రామ సమీపం కాగ్నానది నుంచి మార్చి రెండో వారం నుంచి ఇసుకను సేకరిసున్నారు. యాలాల మండలం లక్ష్మీనారాయణపూరు శివారులో భారీ డంపును ఏర్పాటు చేశారు.

క్యూబిక్‌ మీటరుకు రూ.200 చెల్లింపు

కాగ్నానది నుంచి గుత్తేదారు తరలించే ఒక్కో క్యూబిక్‌ మీటరు ఇసుకకు రూ.200 చొప్పున చెల్లిస్తున్నారు. ఈమేరకు నిర్ణీత ఇసుకకు లెక్క ప్రకారం ఇసుకను సేకరించినట్లు డీడీల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తున్నారని అధికారులు వివరిస్తున్నారు. 


కనిపించని నిశిత పరిశీలన 

రెవెన్యూ అధికారులు తవ్వకాలు జరిగే ప్రదేశంలో రోజూ వారీగా ఎన్ని క్యూబిక్‌ మీటర్ల ఇసుక వెళుతోంది? ఇంకా ఎంత వెళ్లాల్సి ఉందనే విషయంలో నిశిత పరిశీలన చేయాల్సి ఉంది. అయితే అదికారులు ఇసుక తవ్వకాల ప్రదేశంలో లేక పోవడం విమర్శలకు తావిస్తోంది. ఇసుక దారి మళ్లుతోంది.

  • ఏప్రిల్‌ 25న బెన్నూరు గ్రామ శివారు కాగ్నానది నుంచి తాండూరు పట్టణం సాయిపూర్‌కు ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు జప్తు చేశారు. డ్రైవర్‌పై కేసును నమోదు చేసి అంతటితో మరిచిపోయారు. నేటి వరకు తనిఖీలు లేక పోవడంతో అనుమతుల పేరిట ఇసుక అక్రమ రవాణా యధావిధిగా సాగిపోతోంది. అనుమతి ఉన్న ట్రాక్టర్లలోనే తరలిపోవడం గమనార్హం.

మిక్సింగ్‌కు ప్రత్యేక ప్లాంటు ఏర్పాటు

రహదారి మార్గంలో కల్వర్టుల నిర్మాణానికి ముఖ్యమైన కంకర, ఇసుక, సిమెంట్‌ను కలగలిపే రీమిక్సింగ్‌ ప్లాంటును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ తయారైన మిశ్రమాన్ని గుత్తేదారు ప్రత్యేక ట్యాంకర్‌లో నిర్మాణ ప్రదేశానికి తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 15 కల్వర్టుల నిర్మాణానికి మిక్సింగ్‌ను వినియోగించారు.  


చర్యలు తీసుకుంటాం
మునీరుద్దీన్, తహసీల్దారు, యాలాల

అనుమతి లేకుండా ఇసుకను తరలించే వాహనాల విషయంలో తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటాం.  ఇసుక తవ్వకాలు జరిగే ప్రదేశంలో సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నాం.పర్యవేక్షణ పటిష్ఠంగా సాగేలా చూస్తాం.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని