logo

నాసిరకం ముప్పు.. కావాలి కనువిప్పు

వానాకాలం సీజన్‌ దగ్గర పడుతోంది. పొలాలను శుభ్రం చేసే పనులు ఊపందుకుంటున్నాయి. ఇదే అదనుగా నాసిరంక విత్తనాలు కూడా విపణిలోకి తెచ్చేందుకు అక్రమార్కులు యత్నిస్తున్నారు.

Published : 19 May 2024 03:56 IST

విత్తన ఎంపికలో జాగ్రత్తలు తప్పనిసరి

స్వాధీనం చేసుకున్న నకిలీ పత్తి విత్తనాలు (పాత చిత్రం)

న్యూస్‌టుడే, వికారాబాద్, పరిగి, వికారాబాద్‌ కలెక్టరేట్‌: వానాకాలం సీజన్‌ దగ్గర పడుతోంది. పొలాలను శుభ్రం చేసే పనులు ఊపందుకుంటున్నాయి. ఇదే అదనుగా నాసిరంక విత్తనాలు కూడా విపణిలోకి తెచ్చేందుకు అక్రమార్కులు యత్నిస్తున్నారు. కట్టడి చేసేందుకు అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నా యథేచ్ఛగా ఏటా మార్కెట్లోకి డంపింగ్‌ చేస్తున్నారు. అన్నదాత అమాయకత్వం, నిరక్షరాస్యత ఆసరాగా వ్యాపారాన్ని నిరాఘాటంగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అధికారులు దాడులు ముమ్మరం చేయాల్సిన అవసరాన్ని, రైతులు అప్రమత్తం కావాల్సిన స్థితిని పేర్కొంటూ ‘న్యూస్‌టుడే’ కథనం.

కర్ణాటక, పాలమూరు నుంచి..

జిల్లాలోని తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల పరిధిలో ఖరీఫ్‌లో ఈ సంవత్సరం 5.95లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులోకి వస్తాయని వ్యవసాయ శాఖ అంచనా. అందులో ప్రధానంగా పత్తి 2.63లక్షల ఎకరాల్లో సాగయ్యే సూచనలు ఉన్నాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.

  • తెల్ల బంగారానికి ఈసారి ధరలు అంతగా లేకున్నా రైతులు ఆసక్తి చూపుతున్నారు.ఇదే అదనుగా అక్రమార్కులు నాసిరకం విత్రతనాలకు తెర తీసున్నారు. గతంలో గుట్టుచప్పుడు కాకుండా మహబూబ్‌నగర్‌ జిల్లా ఇటు సరిహద్దు రాష్ట్రంగా ఉన్న కర్ణాటక నుంచి పల్లెల్లో విక్రయాలు జరిగాయి. మరికొందరు ఆంధ్రప్రాంతం నుంచి కూడా తీసుకువచ్చి విక్రయించారు. 

ఇవి తెలుసుకోండి

  • అధీకృత దుకాణాల్లోనే కొనుగోలు చేయాలి.
  • విత్తన ప్యాకెట్లు, బస్తాలపై లాట్‌ నంబరు, కంపెనీ పేరు, ప్యాకింగ్‌ తేదీ, లేబుల్‌ తదితరాలు పరిశీలించాలి.
  • విత్తన మొలక శాతం సరిగా ఉందో లేదో చూసుకోవాలి.
  • రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి. 
  • విత్తన ప్యాకెట్లపై క్యూర్‌ కోడ్‌ ఉంటుంది. దానిని మొబైల్‌తో స్కాన్‌ చేస్తే విత్తనాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు.

గత ఘటనలు పరిశీలిస్తే..

  • 2023 జూన్‌ 5న వికారాబాద్‌ మండలం సిద్దులూర్‌లో ప్రత్యేక కార్యదళం పోలీసులు నిఘా వేసి రూ.12.24 లక్షల విలువైన 10.24 క్వింటాళ్ల నాసిరకం పత్తివిత్తనాలను పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు సంయుక్తంగా దాడి చేసి స్వాధీనం చేసుకొని ఐదుగురిపై కేసు నమోదు చేశారు.
  • ఐదేళ్ల కిందట ధారూర్‌ మండలం కేరెళ్లికి చెందిన వెంకట్‌రెడ్డి, రెండేళ్ల కిందట వానాకాలం సీజన్‌లో రెండున్నర ఎకరాల్లో అక్షయ వరి విత్తనాలను సాగు చేశారు. రూ.75 వేలు పెట్టుబడి ట్టాడు. పంట చూడటానికి ఏపుగానే పెరిగింది. అయితే ఆ సంబురం నిలవలేదు.
  • యాలాల మండల పరిధిలోని కమాల్‌పూర్‌లో అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తుల వద్ద 18కిలోల నాసిరకం పత్తి విత్తనాలు లభ్యమయ్యాయి. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేసి చర్యలు తీసుకున్నారు.  
  • కొడంగల్‌ మండలం అంగడిరాయిచూర్‌ వద్ద 40 నకిలీ విత్తన ప్యాకెట్లు లభించాయి. ఈ పట్టణంలోనే మరో చోట మూడు క్వింటాళ్లకు పైగా విత్తనాలు పట్టుబడ్డాయి. 

కొరత రాకుండా పక్కా ప్రణాళిక
గోపాల్, జిల్లా వ్యవసాయాధికారి

విత్తనాల కొరత రాకుండా పక్కా ప్రణాళికను తయారు చేశాం. ఎప్పటికప్పుడు డీలర్లను ఆరా తీస్తున్నాం. గతేడాది సాగు పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈసారి సాగు విస్తీర్ణం పెరిగే విధంగా అందుకు అనుగుణంగానే విత్తన ప్యాకెట్లు నిల్వలు ఉండేలా చూస్తున్నాం. ధ్రువీకరణ డీలర్ల వద్దనే రైతులు విత్తనాలు కొనుగోలు చేసి రసీదులను భద్రపరుచుకోవాలి. అవసరమైతే చూపించాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు