logo

సైబర్‌ నేరస్థులకు.. ‘మ్యూల్‌’ ఖాతాలు తెరుస్తూ..

సైబర్‌ నేరస్థుల కోసం ‘మ్యూల్‌’ బ్యాంకు ఖాతాలు తెరుస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అయిదుగురు నిందితులను శనివారం అరెస్టు చేశారు.

Published : 19 May 2024 03:59 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: సైబర్‌ నేరస్థుల కోసం ‘మ్యూల్‌’ బ్యాంకు ఖాతాలు తెరుస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అయిదుగురు నిందితులను శనివారం అరెస్టు చేశారు. హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ ఎస్‌.రష్మీ పెరుమాల్‌ వివరాల ప్రకారం.. కొందరు మ్యూల్‌ బ్యాంక్‌ ఖాతాలు తెరిచి సైబర్‌ నేరస్థులకు సరఫరా చేస్తున్నారనే సమాచారంతో హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులు, తెలంగాణ స్టేట్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోతో కలిసి ఆపరేషన్‌ చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో ఉత్తరాఖండ్‌కు చెందిన సివిల్‌ వర్కర్‌ ఆరిఫ్‌ సైఫీ(40), పాతబస్తీ డబీర్‌పురకు చెందిన ఎలక్ట్రీషియన్‌ మహ్మద్‌ అబ్దుల్‌ నవీద్‌(30), లిఫ్ట్‌ మెకానిక్‌ సోహెల్‌ఖాన్‌(20), పాతబస్తీ కాలాడేరాకు చెందిన సేల్స్‌మెన్‌ మహ్మద్‌ దాదే ఖాన్‌(21), చాంద్రాయణగుట్ట ఫూల్‌బాగ్‌కు చెందిన వెల్డర్‌ సోహెల్‌ఖాన్‌(25) ఈ ఖాతాలు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.

దేశవ్యాప్తంగా 82 ఖాతాలు.. ప్రధాన నిందితుడు ఆరిఫ్‌ సైఫీ సౌదీలో సివిల్‌ ఫోర్‌మెన్‌గా పని చేశాడు. 2023 ఫిబ్రవరిలో షార్జాలో యూపీకి చెందిన జయీద్, పంజాబ్‌కు చెందిన సందీప్‌సింగ్‌లతో పరిచయం ఏర్పడింది. వారు క్రిప్టో కరెన్సీ వ్యాపారం చేస్తున్నామని, బ్యాంక్‌ ఖాతాలు అవసరమని, ప్రతీ లావాదేవీకి రూ.1500 ఇస్తామని చెప్పారు. ఈ విషయాన్ని షార్జాలో ఉంటున్న చాదర్‌ఘాట్‌కు చెందిన ఫాతిమా బేగం (ప్రస్తుతం షార్జాలోనే ఉన్నారు) ఆరిఫ్‌ సైఫీ చెప్పిన మాటలకు ఆకర్షితురాలైంది. బ్యాంక్‌ ఖాతాలు తెరిపించడం, సిమ్‌ కార్డులు ఇస్తే రూ.10 వేలు ఇస్తామని చెప్పాడు. ఫాతిమా అల్లుడు మహ్మద్‌ అబ్దుల్‌ నవీద్, కుమారుడు సోహెల్‌ ఖాన్, మహ్మద్‌ దాదే ఖాన్, సోహెల్‌ ఖాన్‌కు విషయం చెప్పింది. వీరంతా బ్యాంక్‌ ఖాతాల తెరిచి, పాస్‌బుక్, డెబిట్‌ కార్డులు, సిమ్‌ కార్డులు దుబాయికి పంపించడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన 125 కేసుల్లో 82 ఖాతాలు గుర్తించారు. 82 మ్యూల్‌ ఖాతాల్లో సుమారు రూ.5 కోట్లు జమైనట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 65 బ్యాంక్‌ ఖాతా కిట్‌లు, 14 డెబిట్‌ కార్డులు, 31 సిమ్‌కార్డ్‌ పౌచ్‌లు, 6 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని