logo

మానసిక కుంగుబాటుతో చందు బలవన్మరణం

బుల్లితెర నటుడు చంద్రకాంత్‌ (40) అలియాస్‌ చందు మానసిక కుంగుబాటుతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. త్రినయని సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న చందు శుక్రవారం మణికొండలో బలవన్మరణానికి పాల్పడటం తెలిసిందే.

Updated : 19 May 2024 05:31 IST

సహచర నటి పవిత్ర మృతితో తీవ్ర ఒత్తిడి
ఐదేళ్లుగా భార్య, పిల్లలకు దూరం

కుమారుడి ఆత్మహత్యతో విలపిస్తున్న తల్లి వెంకటమ్మ, భార్య శిల్ప, కూతురు దీక్షిత, కుమారుడు లక్ష్య

రెజిమెంటల్‌బజార్, న్యూస్‌టుడే: బుల్లితెర నటుడు చంద్రకాంత్‌ (40) అలియాస్‌ చందు మానసిక కుంగుబాటుతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. త్రినయని సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న చందు శుక్రవారం మణికొండలో బలవన్మరణానికి పాల్పడటం తెలిసిందే. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని రెజిమెంటల్‌బజార్‌లోని ఆయన నివాసానికి తరలించారు. శనివారం మధ్యాహ్నం అంత్యక్రియలు పూర్తిచేశారు. కుటుంబానికి దూరంగా ఉన్నా.. తన తప్పు తెలుసుకొని భార్యాపిల్లలను ఆదరిస్తాడని భావించామంటూ కుటుంబసభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. వివాహేతర సంబంధంతో జీవితాన్ని నాశనం చేసుకున్నాడని ఆయన బాల్యస్నేహితులు ఆవేదన వెలిబుచ్చారు. చందు మరణంపై తల్లిదండ్రులు వెంకటేశ్, వెంకటమ్మ, భార్య శిల్ప మీడియాతో మాట్లాడారు. 

కుటుంబానికి దూరం

చందు పాఠశాల వయసులోనే ప్రేమిస్తున్నానంటూ తన వెంటపడి పెళ్లిచేసుకున్నాడని భార్య శిల్ప చెప్పారు. తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, నటనపై ఆయన ఇష్టాన్ని గమనించి సీరియల్‌లో అవకాశం ఇప్పించానన్నారు. ఐదేళ్ల క్రితం త్రినయని సీరియల్‌ ప్రాజెక్ట్‌ సమయంలో నటి పవిత్రతో పరిచయం ఏర్పడిందని, ఆమెతో ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నాడని చెప్పారు. మొదట్లో మానసికంగా, శారీరకంగా హింసించాడని, ఆ తరువాత ఇంటికి రావటం మానేశాడన్నారు. తనను, పిల్లలను పట్టించుకోకుండా వదిలేశాడని ఆవేదన చెందారు. అత్తమామల అండతో బిడ్డల్ని చదివించుకుంటున్నానని చెప్పారు. పవిత్రకు చందుతోనే కాకుండా పలువురితో సన్నిహిత సంబంధాలున్నాయని ఆరోపించారు. ఆమెపై విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడని, కొద్దిరోజుల క్రితం ఆమె కారు ప్రమాదంలో మరణించాక మరింతగా కుంగిపోయాడన్నారు. తాను లేకుండా బతకలేనంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాడని, మూడ్రోజుల క్రితం కత్తితో చేయి కోసుకున్నాడని చెప్పారు. శుక్రవారం కుటుంబ సభ్యులు ఫోన్‌ చేసినా ఆయన స్పందించకపోవటంతో మణికొండలోని పవిత్ర ఇంటి వద్దకు స్నేహితులను పంపామని, అప్పటికే చందు ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తించారని వివరించారు.

అవే ఆఖరి మాటలు

పవిత్ర మరణంతో కుమారుడు మానసిక ఒత్తిడికి గురయ్యాడని చందు తండ్రి వెంకటేష్‌ తెలిపారు. ఏడాదిన్నర క్రితం వరకూ తమతో మాట్లాడేవాడని, క్రమంగా దూరమవుతూ వచ్చాడన్నారు. ఈ నెల 16న ఇంటికొచ్చిన కుమారుడు పవిత్ర లేకుండా తాను బతకలేనని చెప్పాడని, మరో రెండ్రోజులే ఈ లోకంలో ఉండి తన వద్దకే వెళ్తానంటూ ఆఖరిగా తనతో మాట్లాడినట్లు కుమారుడి మాటలు గుర్తుచేసుకొని కన్నీరు పెట్టుకున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని