logo

చిన్న వర్షం.. అతలాకుతలం

నగరంలో వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు.

Published : 19 May 2024 04:08 IST

వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి: మేయర్‌ 

చంపాపేటలో ప్రధాన రహదారిపై ఇలా..

బంజారాహిల్స్, న్యూస్‌టుడే: నగరంలో వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం వర్షం నేపథ్యంలో బంజారాహిల్స్‌ ఎన్‌బీటీనగర్‌లోని మేయర్‌ క్యాంపు కార్యాలయం నుంచి జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్లు, సూపరింటెండెంట్‌ ఇంజినీర్లతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నీరు నిలిచే ప్రాంతాలు, నాలాల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నారు. అవసరమైన చోట్ల ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.

రావిర్యాలలో తడిసిన ధాన్యం కుప్పలు


జలమండలి వానాకాల కార్యాచరణ

ఈనాడు, హైదరాబాద్‌: వర్షాకాలానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సన్నద్ధతపై ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో శనివారం సమీక్షించారు. తాగునీటి సరఫరా, మురుగు వ్యవస్థ నిర్వహణపై దృష్టిసారించాలన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి భద్రత సామగ్రి, రెయిన్‌ కోట్లు అందించాలన్నారు. ఎయిర్‌టెక్‌ యంత్రాలు, సిల్ట్‌కార్ట్‌ వాహనాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. 

  • నగరంలో శనివారం కురిసిన వర్షానికి చాలా ప్రాంతాల్లో చెట్లు కూలిపోగా.. పలుచోట్ల వరద నిలిచిపోయింది.  స్థానికుల ద్వారా మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య జీహెచ్‌ఎంసీకి 37 ఫిర్యాదులు అందాయి. 

భాగ్యనగర్‌కాలనీ ఫేజ్‌-2 వాసుల అవస్థలు

అపార్ట్‌మెంట్‌ ఆవరణలోకి వచ్చిన నీరు

భాగ్యనగర్‌కాలనీ: హైదర్‌నగర్‌ డివిజన్‌ పరిధి భాగ్యనగర్‌కాలనీ ఫేజ్‌-2లో మోస్తరు వర్షానికే రోడ్లు, పలు అపార్ట్‌మెంట్లు జలమయమయ్యాయి. దీంతో స్థానికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందిపడ్డారు. రోడ్డు నంబర్‌-1 చివరలో పీఎన్‌ఆర్‌ కాంప్లెక్స్‌ను ఆనుకొని భూగర్భ డ్రైనేజీ పైప్‌లైన్‌ ఉంది. వర్షం పడిన ప్రతిసారి నీరు డ్రైనేజీ పైప్‌లైన్‌తోపాటు ఆ కాంప్లెక్స్‌లోకి చేరుతుంది. దీంతో నిర్వాహకులు అక్కడ నీరు రాకుండా ఇటీవల గోడ నిర్మించారు. దీంతో వర్షపు నీరు వెళ్లే దారి లేక రెండురోజుల క్రితం కురిసిన భారీ వర్షం, తాజాగా శనివారం కురిసిన మోస్తరు వర్షానికే రోడ్డు చివరలోని అపార్ట్‌మెంట్లు, రోడ్లపైకి భారీగా నీరు చేరింది. ఈ సమస్యను ‘ఈనాడు’ జడ్సీ అభిలాష అభినవ్, డీసీ కృష్ణయ్య, ఈఈ గోవర్ధన్‌గౌడ్‌ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి నిలిచిన నీటిని పంపే ఏర్పాట్లు చేశారు. టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ సోమేశ్‌కుమార్‌ కాంప్లెక్స్‌ నిర్వాహకులతో మాట్లాడి గోడకు రంధ్రం చేయించి సమస్యను పరిష్కరించారు. 

నీటిని తొలగించాక పరిస్థితిని పర్యవేక్షిస్తున్న టీపీఎస్‌ సోమేశ్‌కుమార్‌  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని