logo

సెప్టెంబరుకు.. ‘సుంకిశాల’ అందేనా?

నాగార్జునసాగర్‌ డెడ్‌స్టోరేజీ నుంచి సైతం నగరానికి నీటిని తరలించేందుకు చేపట్టిన సుంకిశాల ఇన్‌టేక్‌ వెల్‌ ప్రాజెక్టు సెప్టెంబరు నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు జలమండలి సమాయత్తమవుతోంది.

Published : 19 May 2024 04:10 IST

60శాతం పనులు పూర్తి
వేగం పెంచాలని జలమండలి ఆదేశం

కొనసాగుతున్న ఇన్‌టేక్‌ వెల్‌ నిర్మాణం

ఈనాడు, హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌ డెడ్‌స్టోరేజీ నుంచి సైతం నగరానికి నీటిని తరలించేందుకు చేపట్టిన సుంకిశాల ఇన్‌టేక్‌ వెల్‌ ప్రాజెక్టు సెప్టెంబరు నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు జలమండలి సమాయత్తమవుతోంది. గతేడాది మార్చి నాటికే అందుబాటులోకి రావాల్సి ఉండగా జాప్యం జరిగింది. తొలుత ఈ ప్రాజెక్టుకు రూ.1,450 కోట్లు అవుతాయని భావించినప్పటికీ జాప్యంతో రూ.2,215 కోట్లకు చేరింది. ఇప్పటివరకు 60శాతం పనులు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో కీలకమైన ఇన్‌టేక్‌ వెల్‌(సర్జ్‌పూల్‌) పనుల్లో సంక్లిష్టత ఏర్పడింది. లోపల పొరల వరకు రాయిభాగం ఎక్కువగా ఉండటంతో డ్రిల్లింగ్, రాయి తరలింపుతో ఎక్కువ జాప్యం జరుగుతోంది. ఈ వెల్‌కు సంబంధించి నాలుగు బ్లాకుల్లో 60-70శాతం వరకు పనులు పూర్తి చేశారు. ఇన్‌టేక్‌ వెల్‌లోకి సాగర్‌ నుంచి నీటిని తరలించేందుకు మూడు ప్రాంతాల్లో మూడు లెవల్లో సొరంగాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 147 అడుగుల స్థాయిలో ఏర్పాటు చేస్తున్న సొరంగం పనులు పూర్తి కాలేదు. సుంకిశాల ఇన్‌టేక్‌ వెల్‌ నుంచి కోదాంపూర్‌ నీటి శుద్ధి కేంద్రం వరకు మూడు వరుసల్లో 2375 ఎంఎం డయాతో భారీ పైపులైన్లు నిర్మిస్తున్నారు. మొత్తం కలిపి 35కిలోమీటర్ల వరకు పైపులైను పనులు చేయాల్సి ఉండగా..ఇప్పటివరకు 10కిలోమీటర్ల వరకు పూర్తి చేశారు. వచ్చే నాలుగు నెలల్లోనే ఈ పనులన్నీ పూర్తిచేసి ప్రాజెక్టును అందుబాటులోకి తేవాల్సి ఉంది. 

డెడ్‌ స్టోరేజీ నుంచి వాడుకునేలా..

సాధారణంగా 510 అడుగుల వరకు నీటి తరలింపులో ఇబ్బంది ఉండదు. అంతకంటే తగ్గితే.. పుట్టంగండి పంపింగ్‌ స్టేషన్‌కు నీళ్లు అందే పరిస్థితి ఉండదు. ఇలాంటి సమయంలో జలమండలి ఏటా ఆరేడు కోట్లు ఖర్చు పెట్టి అత్యవసర పంపింగ్‌ ఏర్పాటు చేస్తోంది. అయితే, అత్యవసర పంపింగ్‌తో పనిలేకుండా నాగార్జున్‌సాగర్‌లో 147 అడుగుల స్థాయి డెడ్‌స్టోరేజీకి నీటి మట్టం పడిపోయినా నగరానికి నీటిని అందించే ఉద్దేశంతో జలమండలి సుంకిశాల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం పుట్టంగండి వద్ద పంపింగ్‌ను నీటి పారుదల శాఖ నిర్వహిస్తోంది. అక్కడ నుంచి నీటిని ఎలిమినేటి మాదవరెడ్డి కెనాల్‌ ద్వారా నల్గొండ ఇతర ప్రాంతాలకు తరలిస్తోంది. మధ్యలో ఈ కెనాల్‌ నుంచే జలమండలి నీటిని సేకరించి కోదండపూర్‌ వద్ద శుద్ధి చేసి నగరానికి తరలిస్తోంది. సుంకిశాల పూర్తయిన తర్వాత సాగర్‌ నుంచే కోదండాపూర్‌ శుద్ధి ప్లాంట్‌కు నీటిని తరలించి.. అక్కడ నుంచి నగరానికి సరఫరా చేసే వెసులుబాటు కలుగుతుంది. మరోవైపు నీటి పారుదలశాఖపై ఆధారపడే పరిస్థితి జలమండలికి తప్పుతుంది. ఏటా అత్యవసర పంపింగ్‌ కోసం పెడుతున్న ఆరేడు కోట్లు కూడా ఆదా అవుతాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని