logo

స్థానిక సంస్థలపై కాంగ్రెస్‌ గురి

నార్సింగి మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌ దారుగుపల్లి రేఖ, వైస్‌ఛైర్మన్‌ వెంకటేశ్‌యాదవ్‌(భారాస)లపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలు నెగ్గాయి. వీరిపై మెజార్టీ సభ్యులు అందజేసిన అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు మున్సిపల్‌ కార్యాలయంలో శనివారం రాజేంద్రనగర్‌ ఆర్డీవో కె.వెంకట్‌రెడ్డి

Updated : 19 May 2024 05:22 IST

నార్సింగి మున్సిపాలిటీలో నెగ్గిన  అవిశ్వాసం

అవిశ్వాస తీర్మానం నెగ్గిన అనంతరం కాంగ్రెస్‌ కౌన్సిలర్లు, నేతలు

ఈనాడు, హైదరాబాద్, బోడుప్పల్, నార్సింగి, న్యూస్‌టుడే: నార్సింగి మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌ దారుగుపల్లి రేఖ, వైస్‌ఛైర్మన్‌ వెంకటేశ్‌యాదవ్‌(భారాస)లపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలు నెగ్గాయి. వీరిపై మెజార్టీ సభ్యులు అందజేసిన అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు మున్సిపల్‌ కార్యాలయంలో శనివారం రాజేంద్రనగర్‌ ఆర్డీవో కె.వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 18మంది సభ్యులున్న మున్సిపల్‌ కౌన్సిల్‌లో పార్టీలకు అతీతంగా 12 మంది సభ్యులు అవిశ్వాస తీర్మానం కోరుతూ కలెక్టర్‌కు నోటీసు అందజేసిన విషయం తెలిసిందే. కలెక్టర్‌ ఆదేశాల మేరకు జరిగిన సమావేశంలో అవిశ్వాస తీర్మానం అందజేసిన కౌన్సిలర్లతో పాటు మరో ఇద్దరు భారాస సభ్యులు యాదమ్మ, పత్తి శ్రీకాంత్‌ హాజరై ఓటింగ్‌లో పాల్గొన్నారు. 14మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడంతో అది ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అనంతరం వైస్‌ఛైర్మన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం కూడా ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఛైర్‌పర్సన్, వైస్‌ఛైర్మన్లపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలు నెగ్గిన విషయాన్ని వివరిస్తూ కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తామని ఆర్డీవో తెలిపారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు తదుపరి చర్యలుంటాయన్నారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మేనేజరు యోగేష్‌ పాల్గొన్నారు. 

శివారును హస్తగతం చేసుకోవాలని.. 

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన వెంటనే శివార్లలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్‌ అగ్రనేతలు ముమ్మరంగా ప్రయత్నాలు ప్రారంభించారు. భారాస, భాజపాల కౌన్సిలర్లు, కార్పొరేటర్లను చేర్చుకుంటూ ప్రస్తుత పాలక వర్గాలను దిగిపోవాలంటూ ఒత్తిడి తీసుకువస్తున్నారు. శివారులో 21 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లుండగా... ఒకటి, రెండు మున్సిపాలిటీల్లో మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు ఛైర్మన్లుగా ఉండేవారు.. వారు కూడా ఇతర పార్టీల మద్దతుతోనే కొనసాగుతున్నారు. గతేడాది కొందరు భారాస కౌన్సిలర్లు, కార్పొరేటర్లు.. మేయర్లు, ఛైర్మన్లుగా కొనసాగుతున్న సొంతపార్టీ నాయకులపైనే అవిశ్వాస తీర్మానాలు ప్రతిపాదించి గద్దెదింపారు. డిసెంబరులో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో పరిస్థితి మారిపోయింది. ఐదారు మున్సిపాలిటీలు, రెండు, మూడు కార్పొరేషన్లు మినహా అన్నింటిలోనూ భారాస కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరి.. అవిశ్వాస తీర్మానాలతో భారాసకు చెందిన మేయర్లు, ఛైర్మన్లను గద్దెదించారు.భారాస, భాజపాల నుంచి ఇంకా కొందరు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు చేరేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నా భారాస ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్నారు. ఎలాగైనా వారిని చేర్చుకునేందుకు భవిష్యత్తులో కీలక పదవులు ఇస్తామంటూ హామీలు ఇస్తున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని