logo

‘నేలబిడ్డల’పై.. నిప్పులు చిమ్మిన నింగి

ప్రకృతితో మమేకమయ్యే హలధారి.. వానకు తడిసి.. ఎండకు ఎండి పంటే ప్రాణంగా ముందుకు ‘సాగు’తాడు. ప్రతి మొక్కను కంటికి రెప్పలా కాపాడుకుంటూ..

Published : 20 May 2024 01:57 IST

యాలాల మండలంలో పిడుగుపాటుకు ముగ్గురి మృత్యువాత
మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదనలు

శ్రీనివాస్‌ మృతదేహం వద్ద కుటుంబ సభ్యుల రోదన 

న్యూస్‌టుడే, తాండూరు, యాలాల: ప్రకృతితో మమేకమయ్యే హలధారి.. వానకు తడిసి.. ఎండకు ఎండి పంటే ప్రాణంగా ముందుకు ‘సాగు’తాడు. ప్రతి మొక్కను కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. ఏపుగా ఎదిగేలా చేస్తాడు. పంట చేతికి వస్తుందంటే సంతోషానికి అవధులుండవు.. కోత కోయాలి.. కాంటాకు తరలించాలి.. కుటుంబానికి అండగా నిలవాలన్న తపనే. పొలమే వారి బలం.. వారి ఆనందం.. ఆ సంతోషంతోనే పొలం బాట పట్టిన ముగ్గురు కర్షకులను విధి చిన్న చూపు చూసింది. మృత్యురూపంలో వచ్చిన పిడుగు వారిని కబళించింది. ఆ మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. యాలాల మండలం జుంటుపల్లి, బెన్నూరు గ్రామాల్లో ఆదివారం జరిగిన ఈ హృదయ విదారకమైన ఘటన అందరిని శోక సంద్రంలో ముంచింది.

అందరి బాధ్యత మోస్తూ..

జుంటుపల్లికి చెందిన యువరైతు మంగలి శ్రీనివాస్‌(30) బీఈడీ వరకు చదువుకున్నాడు. కుటుంబానికి అండగా నిలవాలని సేద్యం బాట పట్టాడు. నాలుగు ఎకరాల భూమితో పాటు, మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేసి, ఆశాజనకమైన దిగుబడులు సాధిస్తూ వస్తున్నాడు. తండ్రి వెంకటయ్య అనారోగ్యానికి గురికావడంతో వైద్యం చేయించడమే కాకుండా, నలుగురు చెల్లెళ్లలో ముగ్గురి వివాహం చేశాడు. మరో చెల్లెలు పదోతరగతి వరకు చదువుకుని తల్లి సత్యమ్మకు ఆసరాగా ఉంటోంది. కుటుంబ పరిస్థితి మెరుగవుతుందన్న సమయంలోనే గతేడాది తండ్రి చనిపోయాడు. ఒకవైపు తల్లి, చెల్లిని ఓదారుస్తూనే పంటలు పండిస్తున్నాడు. యాసంగి వడ్లను విక్రయించి ఆ డబ్బుతో చెల్లి పెళ్లి చేయాలని అనుకున్నాడు. ఇంతలోనే కానరాని లోకాలకు వెళ్లడంతో.. శ్రీనివాస లే నాయనా అంటూ తల్లి సత్యమ్మ రోదన మిన్నంటింది. 

పొలమే సర్వస్వం: జుంటుపల్లి గ్రామానికి చెందిన కొనింటి లక్ష్మప్ప మూడు ఎకరాల భూమిని సాగు చేస్తున్నాడు. పొలం, కుటుంబం సర్వస్వంగా జీవించాడు. ఆయనకు భార్య అనసూజ, ఇద్దరు కుమారులున్నారు. ఇటీవలే పెద్దకుమారుడు శివప్రసాద్‌ పదోతరగతి పూర్తి చేశాడు. చిన్నకుమారుడు ఆదిత్య మూడో తరగతి చదువుతున్నాడు. తండ్రి ఇక లేడని తెలిసి ఆ చిన్నారుల హృదయాలు తల్లడిల్లాయి. ఇక తమకు ఎవరు దిక్కని ఆయన భార్య అనసూజ గుండెలవిసేలా శోకంలో మునిగిపోయింది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. 

బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: ఎమ్మెల్యే

శ్రీనివాస్, లక్ష్మప్ప, వెంకప్ప కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. జరిగిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్పారు. ఒక్కో కుటుంబానికి రూ.6లక్షల చొప్పున సహాయం కోసం ప్రతిపాదనలు పంపించాలని ఆర్డీవోను కోరినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా డబ్బులను అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.


భార్య ఎదుటే విగతజీవిగా 

బెన్నూరు గ్రామానికి చెందిన గొల్లవెంకప్పకు 60 ఏళ్లు పైబడినా కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారు. ఆయన భార్య ఎల్లమ్మ, కుమారుడు మొగులప్ప, కోడలు ఉన్నారు. మూడు ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. కుమారుడు కూలీ పనులు చేస్తూ తండ్రికి చేదోడుగా ఉంటున్నాడు. వానాకాలంలో పంటల సాగుకు మేకల ఎరువును చల్లేందుకు భార్యతో కలిసి పొలానికి వెళ్లాడు. కుప్పగా ఉన్న ఎరువును భార్య తట్టలో నింపి ఇస్తుంటే, వెంకప్ప చల్లుతుండగానే దారుణం జరిగిపోయింది. కళ్లెదుటే భర్త విగత జీవిగా మారిపోవడాన్ని చూసి ఆమె తట్టుకోలేక పోయింది. అయ్యో దేవుడా..నా దేవున్ని తీసుకుపోయావా అంటూ రోదించడం అందరిని కదిలించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని