logo

ఎరువు.. కావాలి ఆదరువు

పంచాయతీల్లో కంపోస్టు ఎరువు తయారీ ప్రక్రియను పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Published : 20 May 2024 02:04 IST

అన్ని పంచాయతీల్లోనూ అమలు చేయాలని ఆదేశాలు
నేడు మండలాల వారీగా ప్రత్యేక సమావేశాలు

జీవన్గీలో పొడి చెత్తను షెడ్డులో పోస్తున్న ట్రాక్టరు

న్యూస్‌టుడే, బషీరాబాద్, పాత తాండూరు: పంచాయతీల్లో కంపోస్టు ఎరువు తయారీ ప్రక్రియను పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తడి, పొడి చెత్త సేకరణ, ఎరువు తయారీపై అన్ని మండలాల్లో సోమవారం సమావేశాలు నిర్వహించి పంచాయతీ కార్యదర్శులకు సూచనలు, సలహాలు అందించనున్నారు. వనరులున్నప్పటికీ కొన్ని చోట్ల మాత్రమే కంపోస్టు ఎరువుల తయారీ జరుగుతోందని, అందరూ శ్రద్ధ చూపించాలని అధికారులు సూచిస్తున్నారు.తద్వారా ఆదాయం కూడా సమకూర్చుకోవచ్చని పేర్కొంటున్నారు.
అయిదేళ్ల కిందటే షెడ్ల నిర్మాణం: జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో 566 పంచాయతీలున్నాయి. ఉపాధి హామీ పథకం నిధులతో ప్రతి పంచాయతీలో కంపోస్టు షెడ్లు, చెత్త వేసేందుకు డంపింగ్‌ యార్డు నిర్మాణాలు ఐదేళ్ల కిందటే నిర్మించారు. ప్రారంభంలో తడి, పొడి చెత్తను సేకరించి కంపోస్టు ఎరువును తయారు చేశారు. ఆ తరువాత అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, కొన్ని పంచాయతీలు పట్టించుకోకపోవడంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది.ముఖ్యంగా ఎరువు తయారయ్యేందుకు అవసరమయ్యే వానపాములు గతంలో పంపిణీ చేశారు. ప్రస్తుతం పంచాయతీల వారీగానే సమకూర్చుకోవాలని అధికారులు చెబుతున్నారు.
ఇక తరుచూ తనిఖీలు..: కంపోస్టు ఎరువు తయారీ జరుగుతుందా లేది అని, ఇతర గ్రామాభివృద్ధి పనుల పరిశీలనకు జిల్లా, మండల స్థాయి అధికారులు తరుచూ తనిఖీ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గ్రామస్థాయిలో అలసత్వం కారణంగా పరిశుభ్రత, ఎరువు తయారీ, మొక్కల పెంపకం, నిర్వహణ, సంరక్షణ పనుల అమలు సజావుగా జరగడం లేదు. ఈ విధానాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు వారానికోసారి గ్రామస్థాయిలో అధికారులు పర్యవేక్షణ చేయనున్నారు.
కొన్ని చోట్ల బాగు..: బషీరాబాద్‌ మండలం దామర్‌చేడ్, జీవన్గీ, నవాంద్గీ గ్రామాల్లో ఎరువు తయారీ జరుగుతోంది. మిగతా చోట్ల అరకొరగా ఉంది. ఇదే పరిస్థితి అన్ని మండలాల్లో నెలకొంది. ప్రతి మండలంలోని ఒకటి రెండు చోట్ల అమల్లో ఉంది. మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు చొరవ చూపిస్తే ఈ ప్రక్రియ అమలు కానుంది. తద్వారా పంచాయతీలకు ఆదాయం సమకూరనుంది. ఇందులో ముఖ్యంగా తడి, పొడి చెత్త సేకరణ జరగడం లేదు.  సేకరించిన చెత్తను డంపింగ్‌ యార్డులో వేసి నిప్పంటిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గ్రామ్లాల్లో కార్మికులు అందుబాటులో ఉన్నప్పటికీ తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలని, ఇందుకు ప్రజలు సహకరించాలని కోరుతున్నారు.

నవాంద్గీలో ప్రకృతివనం మొక్కలకు వేస్తున్న కంపోస్టు ఎరువు 


నిత్యం తయారు చేయించాం..

నవనీత, మాజీ సర్పంచి, జీవన్గీ

తడి, పొడి చెత్త సేకరణ వేర్వేరుగా సేకరించి నిల్వ చేయించాం. కార్యదర్శి ప్రకాష్, పారిశుద్ధ్య సిబ్బంది శ్రద్ధ వహించడంతో నిత్యం ఎరువు తయారు చేశాం. నర్సరీలో మొక్కలకు, ప్రకృతివనంలో, రోడ్డుకు ఇరువైపులా ఉన్న  మొక్కలకు ఎరువు వేశాం. ఎరువు తయారీ వల్ల చక్కని ప్రయోజనం ఉంది.


అంతటా చేపట్టేలా కార్యాచరణ.. 

జయసుధ, జిల్లా పంచాయతీ అధికారిణి 

జిల్లాలోని అన్ని పంచాయతీల్లో కంపోస్టు షెడ్లను సద్వినియోగం చేసుకొని ఎరువు తయారు చేయాలి. అవసరమైన వానపాములను సేకరించి ప్రక్రియ ప్రారంభించాలి. ఈ మేరకు ఎంపీడీవోలు, ఎంపీవోలు, కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశాం. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రత్యేక బృందాన్ని నియమిస్తాం. వీరు గ్రామాల్లో పర్యటించి అమలు తీరును  పర్యవేక్షిస్తారు.సలహాలు, సూచనలు అందిస్తారు. త్వరలో అన్ని పంచాయతీల్లో పూర్తి స్థాయిలో అమలు చేయిస్తాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని