logo

రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం

పీర్జాదిగూడ నగరంలో అవిశ్వాస తీర్మానంపై ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, భారాసలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పాటు బల నిరూపణకు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు.

Updated : 20 May 2024 09:26 IST

మేడిపల్లి పోలీసులకు మేయర్‌ మౌఖిక ఫిర్యాదు
ప్రతిపక్షాల కంటే ముందే బలపరీక్షకు తీర్మానం

మీడియాతో మాట్లాడుతున్న మేయర్‌ జక్కా వెంకట్‌రెడ్డి 

బోడుప్పల్, న్యూస్‌టుడే: పీర్జాదిగూడ నగరంలో అవిశ్వాస తీర్మానంపై ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, భారాసలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పాటు బల నిరూపణకు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం చోటు చేసుకున్న సంఘటన ఉద్రిక్త పరిస్థితులను కల్పించింది. మేయర్‌ వర్గంపై కాంగ్రెస్‌ వర్గీయులు దాడికి దిగారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
ఇదీ నేపథ్యం: మేయర్‌ జక్కావెంకట్‌రెడ్డిపై ప్రతిపక్షాలు ఈనెల 17న అవిశ్వాస తీర్మానం ఇచ్చాయి. దానిపై కలెక్టర్‌ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.  ఆదివారం మేయర్‌ బృందమే ముందుగా బల నిరూపణకు తీర్మానం ఇచ్చినట్టు వెలుగులోకి వచ్చింది. ఈనెల 6న జిల్లా కలెక్టర్‌ను పీర్జాదిగూడ నగర మేయర్‌ బృందం కలిసింది. బల నిరూపణకు తీర్మానం ఇచ్చారు. దీనిపై కలెక్టర్‌ వచ్చే నెల 5న సమావేశం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం మేయర్‌ బృందం సూర్యాపేటకు వెళ్లింది. అక్కడి నుంచి వస్తుండగా కాంగ్రెస్‌ వర్గీయులు వెంబడించారని భారాస నేతలు మేడిపల్లి పోలీసులకు మౌఖికంగా ఫిర్యాదు చేశారు. 
దౌర్జన్యం చేశారు...: పీర్జాదిగూడ నగర కాంగ్రెస్‌ కార్పొరేటర్లు తమపై దౌర్జన్యానికి యత్నించారని నగర మేయర్‌ జక్కావెంకట్‌రెడ్డి ఆరోపించారు. తాము ఎక్కడికి వెళుతున్నామో తెలుసుకొని తమ కార్పొరేటర్లను బలవంతంగా లాక్కొనేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.  ఆదివారం రాత్రి మేడిపల్లిలో విలేకరులతో భారాస మేయర్, కార్పొరేటర్లు మాట్లాడారు. 10 మంది కార్పొరేటర్లతో సూర్యాపేటకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా.. అంబర్‌పేట అవుటర్‌పై మాటు వేసిన కాంగ్రెస్‌ కార్పొరేటర్లు తమపై దాడికి యత్నించినట్లు తెలిపారు. తాము భయభ్రాంతులకు గురై 158 కి.మీ అవుటర్‌ చుట్టూ తిరుగుతూ ప్రాణాలు కాపాడుకున్నామన్నారు. 12వ డివిజన్‌ కార్పొరేటర్‌ అమర్‌సింగ్, కాంగ్రెస్‌ నాయకుడు మాడుగుల చంద్రారెడ్డి తదితరులు తమ కారుతో ఢీకొట్టారని పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఖండించిన మాజీ మంత్రి హరీశ్‌రావు  

ఈనాడు, హైదరాబాద్‌: పీర్జాదిగూడ కార్పొరేషన్‌ మేయర్, కార్పొరేటర్లపై కాంగ్రెస్‌ దాడిని ఎక్స్‌ వేదికగా మాజీ మంత్రి, భారాస నేత హరీశ్‌రావు ఖండించారు. ఫీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఎలాగైనా సరే అవిశ్వాస తీర్మానం నెగ్గాలని కాంగ్రెస్‌ నాయకులు మేయర్‌ జక్కా వెంకట్‌రెడ్డి, కార్పొరేటర్లను కిడ్నాప్‌ చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. మేయర్, కార్పొరేటర్లకు భద్రత కల్పించాలని డీజీపీ, రాచకొండ కమిషనర్‌ను కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని