logo

స్పందనలో వేగం.. నష్టానికి కళ్లెం

అగ్నిప్రమాదాల సమయంలో ‘తక్షణ ప్రతిస్పందన సమయం’ పెరగడంతో ఆస్తి నష్టం తగ్గుతోంది. ఫైరింజన్‌ వెళ్లడం కాస్త ఆలస్యమైనా కోట్లాది రూపాయల ఆస్తి కాలిబూడిదయ్యే ప్రమాదం ఉంది.

Published : 20 May 2024 02:15 IST

అగ్ని ప్రమాదాలపై అధికారులు అప్రమత్తం

ఈనాడు, హైదరాబాద్‌: అగ్నిప్రమాదాల సమయంలో ‘తక్షణ ప్రతిస్పందన సమయం’ పెరగడంతో ఆస్తి నష్టం తగ్గుతోంది. ఫైరింజన్‌ వెళ్లడం కాస్త ఆలస్యమైనా కోట్లాది రూపాయల ఆస్తి కాలిబూడిదయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో అగ్నిమాపక శాఖ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఫైర్‌కాల్‌ వచ్చిన తక్షణమే వాహనాలు పంపడం, గ్రీన్‌ఛానల్‌ ద్వారా ఫైరింజన్లను చేర్చడం వెనువెంటనే జరుగుతుండటంతో ఆస్తినష్టం తీవ్రత తగ్గుతోంది. గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం అగ్ని ప్రమాదాల సంఖ్య కూడా తగ్గింది. గ్రేటర్‌లో మూడు డివిజన్లు (హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి) ఉండగా సికింద్రాబాద్‌ పరిధిలోనే అత్యధిక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. సనత్‌నగర్, స్నోర్కెల్, మౌలాలీ, సెక్రటేరియట్, అసెంబ్లీ, కంటోన్మెంట్‌ ఫైర్‌స్టేషన్లు ఈ డివిజన్‌ పరిధిలో ఉన్నాయి. స్వప్నలోక్‌ కాంప్లెక్స్, రూబీ హోటల్, దక్కన్‌మాల్, సికింద్రాబాద్‌ బోయిగూడ ఘటనలు సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలోనే జరిగాయి. వీటికితోడు ఇక్కడ అనేక గోదాములు నివాస స్థలాల్లో ఉన్నాయి. 2023లో మొదటి మూడు నెలల్లోనే ఇక్కడ 184 అగ్ని ప్రమాదాలు జరగ్గా మొత్తం రూ.11,15,95,000 ఆస్తినష్టం వాటిల్లింది. 2024లో మొదటి మూడు నెలల్లో 173 అగ్నిప్రమాదాలు సంభవించగా రూ.1,34,24,500 మేరకు ఆస్తినష్టం జరిగింది. 

‘కైట్‌ ఐ’ ద్వారా నిఘా..

గ్రేటర్‌ పరిధిలో మొత్తం 30 అగ్నిమాపక కేంద్రాలు, 40 వరకు అగ్నిమాపక వాహనాలు ఉన్నాయి. వీటికి జీపీఎస్‌ పరికరాలను ఏర్పాటు చేసి ప్యారడైజ్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి అనుసంధానించారు. ఎక్కడైనా ప్రమాదం జరిగిందని ఫోన్‌ వస్తే సమీపంలో ఉన్న వాహనం ఎక్కడుందో చూసి తొలుత దానిని పంపుతారు. తీవ్రత ఆధారంగా మరిన్ని వాహనాలు పంపుతూ మంటలను అదుపు చేస్తున్నారు. ఫైరింజన్‌ నిలిపివేసినా, ఇంజిన్‌ ఆన్‌ చేయడం, గమ్యస్థానం చేరడం తదితర అంశాలను ప్రత్యక్షంగా గమనించే వెసులుబాటు ఉండటంతో ప్రమాద తీవ్రత తగ్గుతోంది. త్వరలో డ్యాష్‌బోర్డు కెమెరాలు అమర్చి ఫైర్‌ఫైటింగ్‌ క్రమాన్ని పర్యవేక్షించే ప్రతిపాదన కూడా ఉంది.

 గ్రీన్‌ఛానల్‌ను మెరుగుపరిస్తే...

‘కైట్‌ ఐ’ ద్వారా వాహనాల కదలికలను గమనిస్తున్న కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచే గ్రీన్‌ఛానల్‌ ఇవ్వాల్సిన మార్గాలపై ట్రాఫిక్‌ విభాగంతో సమన్వయం చేస్తున్నారు. అయితే డెడికేటెడ్‌ గ్రీన్‌ఛానల్‌ కల్పించడం సాధ్యపడటం లేదు. ఫైరింజన్‌ వచ్చిన సమయంలో గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినా ముందున్న వాహనాల కదలికలో వేగం లేకపోవడంతో కూడళ్ల వద్ద ఆలస్యమవుతోంది. ఇందుకు బదులుగా డెడికేటెడ్‌ గ్రీన్‌ఛానల్‌ ఇస్తే మరింత వేగంగా వాహనాలు ఘటనాస్థలానికి చేరుకుంటాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని