logo

ప్రపంచంలోనే అరుదు.. బాంబే బ్లడ్‌ గ్రూపు

బాంబే బ్లడ్‌ గ్రూప్‌ ప్రపంచంలోనే అరుదైన బ్లడ్‌ గ్రూప్‌ అని హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రి డైరెక్టర్‌ నగరి బీరప్ప అన్నారు.

Updated : 20 May 2024 04:06 IST

నిమ్స్‌ డైరెక్టర్‌ నగరి బీరప్ప 

దాతలతో డైరెక్టర్‌ బీరప్ప చిత్రంలో డాక్టర్‌ స్వాతి కులకర్ణి, శాంతివీర్‌ ఉప్పిన్, బి.శాంతి, వినయ్‌శెట్టి, వైద్యులు 

నిమ్స్, న్యూస్‌టుడే: బాంబే బ్లడ్‌ గ్రూప్‌ ప్రపంచంలోనే అరుదైన బ్లడ్‌ గ్రూప్‌ అని హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రి డైరెక్టర్‌ నగరి బీరప్ప అన్నారు. ఆదివారం ఆస్పత్రిలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునో హెమటాలజీ(ఎన్‌ఐఐహెచ్‌), థింక్‌ ఫౌండేషన్, నిమ్స్‌ ఆద్వర్యంలో జరిగిన సమావేశానికి ఐసీఎంఆర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ స్వాతికులకర్ణితో పాటు బీరప్ప హాజరయ్యారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అరుదైన బాంబే రక్త వర్గంపై ప్రజలకు లోతుగా అవగాహన కల్పించేందుకు నిమ్స్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. స్వాతి కులకర్ణి మాట్లాడుతూ.. దేశంలో ఈగ్రూప్‌ వారు ఎంతమంది ఉన్నారో గుర్తించేందుకు స్వచ్ఛంద సంస్థలతో కలిసి ప్రయత్నిస్తున్నామన్నారు. ఇందుకు థింక్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు వినయ్‌శెట్టి కృషిచేస్తున్నట్లు చెప్పారు. నిమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ రిజిస్ట్రార్‌ శాంతివీర్‌ ఉప్పిన్, రక్తనిధి కేంద్ర విభాగాధిపతి బి.శాంతి, డిప్యూటీ మెడికల్‌ సూపరింటెండెంట్‌ లక్ష్మీభాస్కర్, వైద్యులు మురళీమహేశ్, టెక్నికల్‌ స్టాఫ్‌ బిడుగు శేఖర్, మల్లిక్, వివిధ ప్రాంతాల రక్తదాతలు పాల్గొన్నారు.

చాలా మందికి అర్ధం కాదు: వెంకటరమణ, ఎల్బీనగర్‌.

బాంబే బ్లడ్‌ గ్రూప్‌ అంటే 90 శాతం మందికి తెలియదు. నేను రక్త పరీక్ష చేయించుకున్న సమయంలో ఓ పాజిటివ్‌ గ్రూప్‌ అని చెప్పారు. తర్వాత ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో పరీక్ష చేయించుకుంటే బాంబే గ్రూప్‌ అని స్పష్టంగా తెలిసింది. బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో నా గ్రూప్‌ రక్తం కలిగిన ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని ఏ మాత్రం ఆలోచించకుండా ఇచ్చాను. 

30 ఏళ్ల వరకు తెలియదు: రాజ సుబ్బయ్య, మధురానగర్‌

నాకు బాంబే బ్లడ్‌ గ్రూప్‌ ఉందనే విషయం 30 ఏళ్ల వరకు తెలియదు. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకున్నప్పడు ఓ పాజిటివ్‌ అని చెప్పారు. సీఎంసీ ఆస్పత్రిలో మరోసారి పరీక్ష చేయించుకుంటే స్పష్టంగా తెలిసింది. ఇలాంటి బ్లడ్‌ గ్రూప్‌ ఉంటుందా అని ఆశ్చర్యపోయా. నేను ఇప్పటి వరకు బాంబే బ్లడ్‌ గ్రూప్‌ ఉన్న 35 మందికి రక్తదానం చేశా. 

ఆనందం, బాధ రెండూ..: ఎస్‌.కె. మహేశ్‌కర్, విశ్రాంత శాస్త్రవేత

అరుదైన రక్త గ్రూప్‌ ఉన్నన్నట్లు 30 ఏళ్ల క్రితమే తెలిసింది. ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో పరీక్ష చేయిచుకున్న సమయంలో గుర్తించారు. వెంటనే మా కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు చేయగా, అందరివీ సాధారణ గ్రూప్‌లేనని నిర్ధారించారు. కొవిడ్‌ సమయంలో అత్యవసరంగా నాకు రక్తం కావాల్సి వచ్చినా దొరకలేదు. వైద్యుల కృషి, శరీరం సహకరించడంతో కోలుకున్నాను. ఈ గ్రూప్‌ ఉన్నవారు తక్కువ మంది ఉన్నట్లు తెలిసింది. ఓ వైపు సంతోషం ఉన్నా.. అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరకదనే బాధ ఉంది. 


రెండేళ్లలో 16 మందిని గుర్తించాం

- డా.శాంతి, నిమ్స్‌ రక్తనిధి కేంద్రం విభాగాధిపతి

అత్యంత అరుదుగా ఉండే బాంబే బ్లడ్‌ గ్రూప్‌పై నగరంలో అవగాహన కల్పిస్తున్నాం. నగరంలోని పలు డయాగ్నోస్టిక్, రక్తనిధి కేంద్రాల నిర్వహకులతో మాట్లాడి ఈ గ్రూప్‌ ఎలా పరీక్షిస్తే స్పష్టంగా తెలుస్తుందో తెలియజేస్తున్నాం. గడిచిన రెండేళ్లలో ఇలా 16 మందిని గుర్తించాం. ఈ గ్రూప్‌ ఉన్న వారు ఇతర గ్రూప్‌ వారికి ఇవ్వొద్దు. ఈ గ్రూప్‌ వారికి రక్తం కావాల్సి వస్తే ఏ ఇతర గ్రూప్‌ రక్తం సరిపడదు. బాంబే బ్లడ్‌ మాత్రమే ఎక్కించాల్సి ఉంటుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు