logo

భూనిర్వాసితులను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

అధిక వడ్డీల ఆశ చూపెట్టి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు భూనిర్వాసితుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి మోసంచేసిన ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీ డైరెక్టర్లపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని

Published : 20 May 2024 02:23 IST

మాట్లాడుతున్న ఆర్‌.కృష్ణయ్య, చిత్రంలో బాధితులు 

బషీర్‌బాగ్, న్యూస్‌టుడే: అధిక వడ్డీల ఆశ చూపెట్టి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు భూనిర్వాసితుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి మోసంచేసిన ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీ డైరెక్టర్లపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ఆదివారం బషీర్‌బాగ్‌ దేశోద్ధారక భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులతో కలిసి ఆయన మాట్లాడారు. వనపర్తి జిల్లా రేవెళ్ల మండలం బండి రావిపాకుల పరిసర ప్రాంతాల్లో సుమారు 20 గ్రామాల ప్రజలకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో ఆస్తులు కోల్పోతే ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను అధిక వడ్డీల ఆశ చూపెట్టడంతో ఓ ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీకి ఇచ్చారని గుర్తుచేశారు. మూడేళ్ల నుంచి వడ్డీ చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో పని చేసిన ఓ మంత్రి ఫైనాన్స్‌ కంపెనీకి వత్తాసు పలుకుతూ బాధితులకు అన్యాయం చేయడం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దోషులపై కఠిన చర్యలు తీసుకుని 2500 మంది బీసీ, ఎస్సీ వర్గాల బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర మేరు యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోల్కం శ్రీనివాస్, తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి.రాజేందర్, తెలంగాణ బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు అనంతయ్య, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

బీసీ రిజర్వేషన్లు పెంచాకే స్థానిక ఎన్నికలు

బషీర్‌బాగ్‌: బీసీ రిజర్వేషన్లు 20 నుంచి 42 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని 40 బీసీ సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఆదివారం బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి.రాజేందర్‌ ముదిరాజ్, బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు అనంతయ్యల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన బీసీ సంఘాలు, కుల సంఘాల సమావేశాల్లో ఏకగ్రీవంగా తీర్మానించాయి. అనంతరం బషీర్‌బాగ్‌లో విలేకరుల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ..కులగణన చేసిన తర్వాత దాని ఆధారంగా బీసీ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్‌ చేశారు. మేరు యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోల్కం శ్రీనివాస్‌ మేరు, సంఘాల నేతలు కృష్ణమూర్తి యాదవ్, భాగ్యలక్ష్మీ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని